రెండేళ్ల క్రితం ఎనిమిది జట్లు పాల్గొన్న ఐపీఎల్‌లో ఎనిమిదో స్థానం... గత ఏడాది పది జట్లు పాల్గొన్న ఐపీఎల్‌లోనూ ఎనిమిదో స్థానం... ఆట మెరుగుపడలేదని అనుకోవాలా లేక తమకంటే రెండు జట్లు కింద ఉన్నాయి కాబట్టి బాగానే ఆడినట్లా! 2016లో చాంపియన్‌గా నిలిచాక తర్వాతి నాలుగు సీజన్లలో టాప్–4లో ఉంటూ నిలకడ ప్రదర్శించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట గత రెండేళ్లు పూర్తిగా గతి తప్పింది. సమష్టి వైఫల్యంతో పాటు వార్నర్ వివాదం టీమ్‌ను బాగా ఇబ్బంది పెట్టాయి.
2019 ఐపీఎల్ తర్వాత మళ్లీ ఇప్పుడే రైజర్స్ తమ సొంత మైదానం హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఆడబోతోంది. పలువురు ఆటగాళ్ల మార్పులతో పాటు సహాయక సిబ్బందిలోనూ స్వల్ప మార్పుచేర్పులతో కొత్త సీజన్‌కు సిద్ధమైంది. ఇలాంటి నేపథ్యంలో జట్టు ఎలాంటి ప్రదర్శన ఇస్తుందని అభిమానులంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. దక్షిణాఫ్రికా టి20 కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ కొత్త కెపె్టన్‌గా ముందు నిలబడగా, ఆల్‌టైమ్ గ్రేట్ క్రికెటర్లలో ఒకడైన బ్రియాన్ లారా ఈసారి పూర్తి స్థాయిలో జట్టుకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం విశేషం. –సాక్షి క్రీడా విభాగం
కొత్త సీజన్ వేలానికి ముందు హైదరాబాద్ 2022లో ఆడిన వారి నుంచి 12 మంది ఆటగాళ్లను వదిలేసుకుంది. వీరిలో ‘కేన్ మామా’ అంటూ అభిమానులు పిలుచుకున్న విలియమ్సన్‌తో పాటు నికోలస్ పూరన్ తదితరులు ఉన్నారు. మరో 12 మందిని కొనసాగించగా అందులోంచే దక్షిణాఫ్రికా క్రికెటర్ మార్క్‌రమ్‌ను కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇటీవలే దక్షిణాఫ్రికా టి20 లీగ్‌లో సన్‌రైజర్స్ యాజమాన్యానికే చెందిన ఈస్టర్న్ కేప్ టీమ్ మార్క్‌రమ్ సారథ్యంలోనే విజేతగా నిలిచింది. కాబట్టి నాయకత్వం విషయంలో ఫ్రాంచైజీ అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుందని భావించవచ్చు.
సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అందుబాటులో ఉన్నా... మార్క్‌రమ్‌పైనే యాజమాన్యం విశ్వాసం ఉంచింది. జట్టు తరఫున గత ఒక్క సీజన్ మాత్రమే ఆడిన అతను 12 ఇన్నింగ్స్‌లలో 139.05 స్ట్రయిక్‌రేట్‌తో 381 పరుగులు చేసి మెరుగైన ప్రదర్శనే కనబర్చాడు. ఈసారి అతడి బ్యాటింగ్‌తో పాటు కెపె్టన్సీ బాధ్యతలు కూడా జట్టుకు కీలకం కానున్నాయి. ముఖ్యంగా ‘హోం గ్రౌండ్’ ఉప్పల్ స్టేడియంలో జరిగే 7 మ్యాచ్‌ల కోసం జట్టులో అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా ఉపయోగించుకోగలిగి విజయాలు సాధిస్తే ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.
బ్రూక్ చెలరేగుతాడా...
సన్‌రైజర్స్ బ్యాటింగ్ లైనప్ లో ఈసారి అందరినీ ఆకర్షిస్తున్న ఆటగాడు ఇంగ్లండ్‌కు చెందిన 24 ఏళ్ల హ్యారీ బ్రూక్. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటికే ‘ఆల్ ఫార్మాట్’ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న అతను 99 టి20ల్లో విధ్వంసకర స్ట్రయిక్‌రేట్ 148.32తో 2432 పరుగులు చేశాడు. మిడిలార్డర్‌లో బ్రూక్ బ్యాటింగ్ రైజర్స్‌కు ‘బూస్ట్’ ఇవ్వగలదు. అయితే భారత గడ్డపై తొలిసారి ఆడనున్న అతను పరిస్థితులను ఎలా వాడుకుంటాడనేది చూడాలి.
మిడిలార్డర్‌లో అతనితో పాటు మార్క్‌రమ్, వికెట్ కీపర్లు ఫిలిప్స్, క్లాసెన్ (ఇద్దరిలో ఒకరు), ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్ జట్టుకు మంచి స్కోరు అందించగలరు. గత ఏడాది పంజాబ్ కింగ్స్ తరఫున పేలవ ప్రదర్శన కనబర్చిన మయాంక్ అగర్వాల్ ఇప్పుడు సన్‌రైజర్స్‌కు ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు. గత సీజన్ టీమ్ టాప్ స్కోరర్ అభిõÙక్ శర్మ, రాహుల్ త్రిపాఠిలు టాపార్డర్‌లో వేగంగా పరుగులు సాధించాల్సి ఉంటుంది. అయితే ఇతర జట్లతో పోలిస్తే తొలి బంతి నుంచే బౌలర్లపై విరుచుకుపడే విధ్వంసక ఓపెనర్ హైదరాబాద్ వద్ద లేడనేది స్పష్టం.
పేసర్ల బృందం...
బ్యాటింగ్‌తో పోలిస్తే మరోసారి హైదరాబాద్ బౌలింగ్ కాస్త పదునుగా కనిపిస్తోంది. గత సీజన్‌లో ఆడిన 14 మ్యాచ్‌ల్లోనూ ‘ఫాస్టెస్ట్ బాల్’ విసిరిన ఉమ్రాన్ మలిక్ ఇప్పుడు కూడా కీలక బాధ్యత పోషించాల్సి ఉంది. పైగా ఈ ఏడాది కాలంలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో అతని ఆట మెరుగవడంతో పాటు బాధ్యత కూడా పెరిగింది. బౌలింగ్‌లో మునుపటి వాడి లోపించడంతో భారత జట్టు చోటుతో పాటు బోర్డు కాంట్రాక్ట్ కూడా కోల్పోయిన భువనేశ్వర్ ఈసారి ఏమాత్రం ప్రభావం చూపిస్తాడనేది చెప్పలేం.
అయితే నటరాజన్, కార్తీక్ త్యాగి, జాన్సెన్, ఫజల్ హఖ్‌లతో పేస్ బృందం పెద్దదిగానే ఉంది. ఆల్‌రౌండర్ సుందర్ ఆఫ్ స్పిన్ జట్టుకు సానుకూలాంశం కాగా, రెగ్యులర్ స్పిన్నర్‌గా ఆదిల్ రషీద్ కనిపిస్తున్నాడు. ఇంగ్లండ్ తరఫున గత కొన్నేళ్లుగా వన్డేలు, టి20ల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న రషీద్ అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటే గతంలో రషీద్ ఖాన్ తరహాలో లెగ్‌స్పిన్‌తో ప్రత్యర్థిపై పైచేయి సాధించవచ్చు.
దేశవాళీ లెగ్‌స్పిన్నర్ మయాంక్ మర్కండే కూడా టీమ్‌లో ఉన్నాడు కానీ గత రెండు సీజన్లుగా అతను రాణించలేకపోయాడు. అయితే ఓవరాల్‌గా చూస్తే ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న క్రికెటర్లు మినహా కొత్తగా జట్టులోకి వచ్చి న యువ ఆటగాళ్లలో మరీ చెప్పుకోదగ్గ ప్లేయర్లు ఎవరూ లేరు. 20 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడినా ఇప్పటి వరకు కీలక దశలో సమద్‌పై పూర్తి నమ్మకం ఉంచలేని పరిస్థితి. కాబట్టి తుది జట్టులో వీరిలో ఎవరికి స్థానం దక్కుతుందనేది సందేహమే.
సన్‌రైజర్స్ జట్టు వివరాలు
మార్క్‌రమ్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్కో జాన్సెన్, ఫజల్ హఖ్ ఫారుఖీ, హ్యారీ బ్రూక్, క్లాసెన్, ఆదిల్ రషీద్, అకీల్ హొసీన్ (విదేశీ ఆటగాళ్లు). అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్, కార్తీక్ త్యాగి, నటరాజన్, ఉమ్రాన్ మలిక్, మయాంక్ అగర్వాల్, అన్‌మోల్ ప్రీత్ సింగ్, మయాంక్ మర్కండే, వివ్రాంత్ శర్మ, మయాంక్ డాగర్, సమర్థ్ వ్యాస్, సన్వీర్, ఉపేంద్ర సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి.
సహాయక సిబ్బంది
బ్రియాన్ లారా (హెడ్ కోచ్), డేల్ స్టెయిన్ (పేస్ బౌలింగ్ కోచ్), ముత్తయ్య మురళీధరన్ (స్పిన్
బౌలింగ్ కోచ్), ర్యాన్ కుక్ (ఫీల్డింగ్ కోచ్), సైమన్ హెల్మెట్ (అసిస్టెంట్ కోచ్).
Comments
Please login to add a commentAdd a comment