ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రాతను మార్చేశాడు ప్యాట్ కమిన్స్. మూడేళ్లుగా పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న జట్టును తన కెప్టెన్సీ నైపుణ్యాలతో ఏకంగా ఫైనల్ చేర్చాడు. ఆఖరి మెట్టుపై రైజర్స్ తడబడ్డా.. అక్కడి దాకా జట్టు సాగించిన విధ్వంసకర పరుగుల ప్రయాణం ఐపీఎల్ చరిత్రలోనే ఓ అద్బుతం లాంటిది.
నిజానికి ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా వన్డే, టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కోసం సన్‌రైజర్స్ ఏకంగా రూ. 20.50 కోట్లు ఖర్చు చేసినపుడు విమర్శలే ఎక్కువగా వచ్చాయి. ఈ ఫాస్ట్ బౌలర్ కోసం భారీ మొత్తం వెచ్చించడం వల్ల ప్రయోజనం ఉండదని చాలా మంది మాజీ క్రికెటర్లు పెదవి విరిచారు.
సంచలన ఆట తీరుతో టైటిల్‌కు చేరువగా
అయితే, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ కమిన్స్ సారథ్యంలోని జట్టు సంచలన ఆట తీరుతో టైటిల్‌కు చేరువగా వచ్చింది. ఇక బౌలర్‌గానూ, సారథిగానూ కమిన్స్.. ఫ్రాంఛైజీ తనపై పెట్టిన పెట్టుబడికి పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడు. ఆరెంజ్ ఆర్మీకి ఇష్టమైన కెప్టెన్‌గా మారిపోయాడు. వచ్చే ఏడాది కూడా తానే కెప్టెన్‌గా ఉండాలనేంత బలంగా ముద్ర వేశాడు.
ఫ్రాంఛైజీ సైతం కమిన్స్‌నే నాయకుడిగా కొనసాగిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాత్రం భిన్నంగా స్పందించాడు. సన్‌రైజర్స్ కమిన్స్‌ను అట్టిపెట్టుకోదని.. వేలానికి ముందు అతడిని టీమ్ నుంచి రిలీజ్ చేస్తుందని జోస్యం చెప్పాడు. తాను ఇలా అనడానికి గల కారణాన్ని కూడా వెల్లడించాడు.
కంగారూ ఆటగాళ్ల ప్రాధాన్యాలు వేరుగా ఉంటాయి
‘‘ప్యాట్ కమిన్స్ వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడతానో.. లేదోనన్న అంశంపై స్పష్టత లేదని చెప్పాడు. ఆస్ట్రేలియాకు ఉన్న బిజీ షెడ్యూల్ ఇందుకు కారణం. యాషెస్, వరల్డ్‌కప్స్.. ఇలా కంగారూ ఆటగాళ్ల ప్రాధాన్యాలు వేరుగా ఉంటాయి.
ఒకవేళ ఆసీస్ షెడ్యూల్‌కు ఐపీఎల్ షెడ్యూల్ అడ్డు రానట్లయితే.. అప్పుడు పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఐపీఎల్‌లో కొత్త నిబంధనలు వచ్చాయని కూడా కమిన్స్ చెప్పాడు. మరి అతడి నిర్ణయం ఎలా ఉండబోతుందో తెలియదు.
హైదరాబాద్ ఈసారి అతడిని రిటైన్ చేసుకోదు
వేలంలో తన పేరు నమోదు చేసుకుని.. ఆ తర్వాత తప్పుకొన్న సందర్భాలు లేవని కూడా అతడే చెప్పాడు. గతంలో మిచెల్ స్టార్క్ వంటి ఆసీస్ ఆటగాళ్లు ఇలా చేసిన మాట వాస్తవం. అయితే, కమిన్స్ ఈ విషయంలో క్లారిటీగానే ఉన్నాడు. నా అభిప్రాయం ప్రకారం.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి అతడిని రిటైన్ చేసుకోదు.
ఎందుకంటే.. మొదటి ప్లేయర్‌గా అతడిని తీసుకుంటే 18 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఈ సీజన్‌లో కమిన్స్ బౌలర్‌గా.. కెప్టెన్‌గా అద్భుతంగా రాణించినా.. ఫ్రాంఛైజీ మాత్రం అతడిని రిలీజ్ చేస్తుందనే నేను నమ్ముతున్నాను’’ అని ఆకాశ్ చోప్రా విచిత్ర వ్యాఖ్యలు చేశాడు.
నిబంధనలు ఇవే
కాగా ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో బీసీసీఐ ఇటీవలే రిటెన్షన్ పాలసీని ప్రకటించింది. మొత్తం ఆరుగురి(ఆర్టీఎమ్ కార్డుతో కలిపి)ని తమతో పాటే జట్లు అట్టిపెట్టుకోవచ్చు.
ఇందులో ఐదుగురు క్యాప్డ్, కనీసం ఒక్కరు అన్‌క్యాప్డ్(ఇండియన్ ప్లేయర్స్) ఉండాలి. ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లను అట్టిపెట్టుకుంటే మొదటి మూడు రిటెన్షన్లకు వరుసగా రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు చెల్లించాలి.
మిగతా రెండు రిటెన్షన్లకు రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక వేలంలోకి వచ్చి అమ్ముడుపోయి.. సీజన్ ఆరంభానికి ముందు సహేతుక కారణాలు లేకుండా తప్పుకొంటే సదరు ఆటగాళ్లపై రెండేళ్ల నిషేధం విధిస్తారు.
చదవండి: T20 WC 2024: పట్టిక తారుమారు.. సెమీస్ బెర్తులు ఖరారు
Comments
Please login to add a commentAdd a comment