కొలొంబోలోని సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా శ్రీలంకతో ఇవాళ (జులై 24) మొదలైన రెండో టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ పైచేయి సాధించింది. పేసర్లు నసీం షా (3/41), షాహీన్ అఫ్రిది (1/44) నిప్పులు చెరగగా.. స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ (4/69) మాయాజాలం చేయడంలో పాక్ శ్రీలంకను తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకే కుప్పకూల్చింది.
పాక్ ఆటగాడు మసూద్ అద్భుతంగా ఫీల్డింగ్ చేయడంతో ఇద్దరు లంక బ్యాటర్లు రనౌట్ రూపంలో వెనుదిరిగారు. ఓపెనర్ నిషాన్ మధుష్క (4), ప్రభాత్ జయసూర్యలను (1) మసూద్ రనౌట్ చేశాడు. పాక్ బౌలర్ల ధాటికి లంక ఆటగాళ్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టగా.. ధనంజయ డిసిల్వ (57) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. ఇతనితో పాటు కెప్టెన్ దిముత్ కరుణరత్నే (17), దినేశ్ చండీమల్ (34), రమేశ్ మెండిస్ (27) మాత్రమే రెండంకెల స్కోర్‌లు చేశారు.
కాగా, ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన తొలి టెస్ట్‌లో ఆతిధ్య పాక్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో సౌద్ షకీల్ (208 నాటౌట్, 30) చెలరేగిపోవడంతో పాక్ 4 వికెట్ల తేడాతో గెలపొందింది.
ధనంజయ డిసిల్వ (122) సెంచరీతో కదం తొక్కడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులు చేయగా.. సౌద్ షకీల్ రెచ్చిపోవడంతో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 461 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక సెకెండ్ ఇన్నింగ్స్‌లో 279 పరుగులకు ఆలౌటైతే.. పాక్ 6 వికెట్లు కోల్పోయి లంక నిర్ధేశించిన 133 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇమామ్ ఉల్ హాక్ (50 నాటౌట్).. సౌద్ షకీల్ సాయంతో పాక్‌ను విజయతీరాలకు చేర్చాడు.
Comments
Please login to add a commentAdd a comment