శ్రీలంక క్రికెట్ బోర్డు తమ స్టార్ ఆటగాడు, టీ20 జట్టు కెప్టెన్ వనిందు హసరంగను కాపాడుకునే విషయంలో భారీ డ్రామా ఆడినట్లు తెలుస్తుంది. బంగ్లాదేశ్‌తో మూడో వన్డే సందర్భంగా ఫీల్డ్ అంపైర్ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు హసరంగపై రెండు టెస్ట్ మ్యాచ్‌లు లేదా నాలుగు వన్డేలు లేదా నాలుగు టీ20ల సస్పెన్షన్ విధించేలా ఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. మూడు ఫార్మాట్లలో ఏది ముందు ఆడాల్సి వస్తే ఆ ఫార్మాట్‌కే సస్పెన్షన్ వర్తిస్తుంది.
అయితే సస్పెన్షన్ విషయాన్ని ముందే పసిగట్టిన లంక క్రికెట్ బోర్డు టెస్ట్ క్రికెట్‌కు ఇదివరకే రిటైర్మెంట్ ప్రకటించిన హసరంగతో హుటాహుటిన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా చేసింది. అలాగే త్వరలో బంగ్లాదేశ్‌తో జరుగబోయే రెండు మ్యాచ్‌ల సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో అతనికి చోటు కల్పించింది. ఈ పరిణామాలన్ని గంటల వ్యవధిలో జరిగి పోయాయి.
హసరంగ టెస్ట్ రిటైర్మెంట్ వెనక్కు తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించిన కొద్ది గంటల్లోపే ఐసీసీ హసరంగపై చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు ప్రకటించింది. హసరంగ టెస్ట్ జట్టులో ఉండటంతో నిబంధనల ప్రకారం సస్పెన్షన్ టెస్ట్ ఫార్మాట్‌కే వర్తిస్తుంది.
ఇలా చేయడం వల్ల ఏంటి ప్రయోజనం అనుకుంటున్నారా..?
శ్రీలంక క్రికెట్ బోర్డు హుటాహుటిన హసరంగను టెస్ట్ జట్టులో చేర్చకపోయుంటే అతను టీ20 వరల్డ్‌కప్ 2024లో తొలి నాలుగు మ్యాచ్‌లకు దూరంగా ఉండాల్సి వచ్చేది. టీ20 జట్టులో లంక జట్టు కెప్టెన్‌గానే కాకుండా కీలక ఆల్‌రౌండర్‌గా కొనసాగుతున్న హసరంగ టోర్నీ ఆరంభంలో జరిగే కీలక మ్యాచ్‌లకు దూరమైతే అది ఆ జట్టు విజయావకాశాలను భారీగా ప్రభావితం చేస్తుంది. ఇలా జరగకుండా ఉండేందుకే లంక క్రికెట్ భారీ డ్రామాకు తెరలేపింది.
కాగా, బంగ్లాదేశ్‌తో మూడో వన్డే సందర్భంగా ఐసీసీ కోడ్ ఉల్లంఘించినందుకు గాను హసరంగపై రెండు టెస్ట్ మ్యాచ్‌ల నిషేధం పడింది. నిషేధంతో పాటు హసరంగ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. హసరంగ ఖాతాలో మూడు డీ మెరిట్ పాయింట్లు కూడా చేరాయి.
మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ల కోసం శ్రీలంక జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో శ్రీలంక టీ20 సిరీస్ గెలువగా.. బంగ్లాదేశ్ వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. టెస్ట్ సిరీస్ మార్చి 22 నుంచి ప్రారంభంకానుంది.
Comments
Please login to add a commentAdd a comment