బంగ్లాదేశ్‌ కొంపముంచిన నో బాల్‌.. ఒక్కడికే మూడు ఛాన్స్‌లు! | Sri Lanka Reaches Super 4 After Defeating Bangladesh By Two Wickets In Asia Cup 2022 | Sakshi
Sakshi News home page

Asia Cup 2022: బంగ్లాదేశ్‌ కొంపముంచిన నో బాల్‌.. ఒక్కడికే మూడు ఛాన్స్‌లు!

Published Fri, Sep 2 2022 7:54 AM | Last Updated on Fri, Sep 2 2022 10:46 AM

Sri Lanka Reaches Super 4 After Defeating Bangladesh By Two Wickets In Asia Cup 2022 - Sakshi

ఆసియాకప్‌-2022లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 2 వికెట్ల తేడాతో  విజయం సాధించింది. తద్వారా గ్రూప్‌ 'బి' నుంచి సూపర్‌-4లో అడుగు పెట్టిన రెండో జట్టుగా శ్రీలంక నిలిచింది . కాగా అఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో శ్రీలంక ఆటగాడు అసిత ఫెర్నాండో మూడు బంతుల్లో 10 పరుగులు సాధించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కాగా టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు సాధించింది.

బంగ్లా బ్యాటర్లలో అఫీఫ్ హొస్సేన్ 39, మెహదీ హసన్‌- 38 పరుగులతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో హాసరంగా, కరుణరత్నే చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. మధుశంక, తీక్షణ, అసిత ఫెర్నాండో తలా ఒక్కో వికెట్ తీశారు. ఇక 184 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మరో నాలుగు బంతులు మిగిలూండగానే చేధించింది. శ్రీలంక బ్యాటర్లలో ఓపెనర్‌ కుశాల్‌ మెండీస్‌(60) పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు.

అతడితో పాటు కెప్టెన్‌ దసున్‌ షనక కూడా 45 పరుగులు చేసి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక అఖరిలో ఆల్‌రౌండర్‌ కరుణరత్నే(16), అసిత ఫెర్నాండో(10) పరుగులు సాధించి తమ వంతు పాత్ర పోషించారు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో తొలి మ్యాచ్‌ ఆడిన ఎబాడోత్ హొస్సేన్ మూడు వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్ రెండు, ముస్తాఫిజుర్, మెహెదీ హసన్‌ చెరో వికెట్‌ సాధించారు.

బంగ్లాదేశ్‌కు ఓటమికి కారణాలు ఇవే
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ ప్రత్యర్ధి జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. అయితే బ్యాటింగ్‌లో అదరగొట్టిన షకీబ్‌ సేన‌.. బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. కాగా అరంగేట్ర మ్యాచ్‌ ఆడుతోన్న బంగ్లా బౌలర్‌ ఎబాడోత్ హొస్సేన్ తన తొలి రెండు ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్‌ చేసి మూడు వికెట్లు పడగొట్టినప్పటకీ . అఖరి రెండు ఓవర్లలో మాత్రం భారీగా పరుగులు సమర్పించకున్నాడు.

హొస్సేన్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 51 పరుగులు ఇచ్చాడు. మరోవైపు సీనియర్‌ పేసర్‌ ముస్తాఫిజుర్ రెహమాన్ కూడా విఫలమయ్యాడు. కెప్టెన్‌ షకీబ్‌ కూడా పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఫీల్డింగ్‌ విషయానికి వస్తే.. శ్రీలంక ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ వేసిన టాస్కిన్‌ ఆహ్మద్‌ బౌలింగ్‌లో కుశాల్‌ మెండిస్‌ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను వికెట్‌ కీపర్‌ రహీమ్‌ జార విడిచాడు. దీంతో 2 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద మెండిస్‌ బతికిపోయాడు.

కొంపముంచిన నో బాల్‌
ఈ మ్యాచ్‌లో బంగ్లా బౌలర్లు ఏకంగా నాలుగు నో బాల్స్‌ వేశారు. తొలుత శ్రీలంక ఇన్నింగ్స్‌ 7వ ఓవర్‌ వేసిన మెహదీ హసన్‌ బౌలింగ్‌లో మెండీస్‌ వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో వికెట్‌ సెలబ్రేషన్స్‌లో బంగ్లా ఆటగాళ్లు మునిగి తేలిపోయారు. అయితే ఆ బంతిని అంపైర్‌ నో బాల్‌గా ప్రకటించాడు. దీంతో బంగ్లా ఆటగాళ్ల ఆనందం కొద్ది క్షణాల్లోనే ఆవిరైపోయింది. మళ్లీ 30 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద మెండిస్‌ బతికిపోయాడు. అదే విధంగా 8వ ఓవర్‌ వేసిన ఎబాడోత్ హొస్సేన్ బౌలింగ్‌లో మెండిస్‌ లెగ్‌ సైడ్‌ ఆడటానికి ప్రయత్నించాడు.

బంతి బ్యాట్‌కు దగ్గరగా వెళ్లడంతో వికెట్‌ కీపర్‌ క్యాచ్‌కు అప్పీల్‌ చేశాడు. అయితే అంపైర్‌ దాన్ని వైడ్‌గా ప్రకటించాడు. కాగా బంగ్లా జట్టుకు ఇంకా రివ్యూలు మిగిలిన్నప్పటికీ షకీబ్‌ మెగ్గు చూపలేదు. అయితే రిప్లేలో బంతి క్లియర్‌గా మెండిస్‌ గ్లౌవ్‌కు తాకి రహీమ్‌ చేతికి వెళ్లింది. దీంతో ముచ్చటగా మూడో సారి కూడా ఔటయ్యే ప్రమాదం నుంచి మెండిస్‌ తప్పించుకున్నాడు. కాగా శ్రీలంక విన్నింగ్స్‌ రన్‌ కూడా నో బాల్‌ రూపంలో రావడం గమనార్హం.


చదవండి: టీమిండియాకు షాక్‌.. న్యూజిలాండ్‌ సిరీస్‌ నుంచి స్టార్‌ పేసర్‌ ఔట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement