శుబ్‌మన్ గిల్.. ప్రస్తుతం టీమిండియాలో ఒక సంచలనం. వరుస సెంచరీలతో హోరెత్తిస్తున్న గిల్ మూడు ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. ఇటీవలే న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టి20లో సుడిగాలి శతకంతో అలరించిన గిల్ తాను టి20ల్లో కూడా ఎంత ప్రమాదకారి అనేది చెప్పకనే చెప్పాడు. అతని ప్రదర్శనపై టీమిండియా దిగ్గజాలు సహా కోహ్లి, రోహిత్ లాంటి స్టార్ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు.
అయితే రెండేళ్ల కిందట ఇంగ్లండ్ భారత్ పర్యటనకు వచ్చిన సమయంలో కోహ్లి, గిల్‌ల మధ్య జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ తన ఆటోబయోగ్రఫీ ''కోచింగ్ బియాండ్- మై డేస్ విత్ ది ఇండియన్ క్రికెట్ టీమ్''లో రాసుకొచ్చాడు. ''మార్చి 2021లో ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. నాలుగో టెస్టు కోసం అహ్మదాబాద్‌లో ఉన్నాం.నరేంద్ర మోదీ స్టేడియంలో అదే మొదటి మ్యాచ్. అదీ కాకుండా భారత్‌లో జరిగే రెండో డే నైట్ టెస్టు. అప్పటికీ మనకు ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్తు ఖరారు కాలేదు.
ఈ మ్యాచ్ గెలవడం టీమిండియాకి చాలా అవసరం. పింక్ టెస్టు కావడంతో స్టేడియంలో సీట్లకు పింక్ కలర్ వేశారు. కరోనా నిబంధనల కారణంగా చాలా తక్కువ మందికి మ్యాచ్ చూసేందుకు అవకాశం కల్పించారు. ఒక చైర్‌కు పింక్ కలర్ వేసి మరో చైర్‌ను నార్మల్‌గా వదిలేశారు.ఈ విషయంపై చాలా పెద్ద చర్చే నడిచింది. పింక్ బాల్ టెస్టులో ఫీల్డింగ్ చేయడం చాలా కష్టం. ఫ్లడ్ లైట్స్ వెలుతురులో బంతి ఏ దిశలో వస్తుందో పసికట్టడం చాలా కష్టం. అందుకే ఫీల్డింగ్ సెషన్ సమయంలో విరాట్ కోహ్లీ, నాతో కలిసి క్యాచ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.
ఆ సెషన్‌లో దాదాపు 200 క్యాచులను అందుకున్నాడు కోహ్లి. రేపు టెస్టు అనగా ప్రాక్టీస్ సెషన్స్‌లో అంత కష్టపడడం రిస్క్ అని నేను చెప్పినా వినలేదు. విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్నంతసేపు శుబ్‌మన్ గిల్ కొద్ది దూరంలో నిలబడి గమనిస్తూ ఉన్నాడు. కొంతసేపటి తర్వాత అతను కూడా వచ్చి క్యాచ్ ప్రాక్టీస్‌లో పాల్గొనాలనుకున్నాడు.
గిల్ అక్కడికి రాగానే విరాట్ కోహ్లీ నవ్వుతూ అతని వైపు చూసి.. ''నీకు పదేళ్లు ఇస్తా.. తమ్ముడు! ఇందులో సగం క్యాచులైనా నువ్వు పట్టుకో చూద్దాం'' అంటూ నవ్వాడు. విరాట్ కోహ్లీ అందుకున్న క్యాచులు అలాంటివి. అప్పటికి సెషన్స్ సమయం ముగియడంతో అందరం కలిసి టీమ్ బస్సులో బయలుదేరి పది నిమిషాల్లో హోటల్‌కి చేరిపోయాం'' అంటూ రాసుకొచ్చాడు.
చదవండి: తల్లికి రోడ్డు ప్రమాదం.. డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజం ఎమోషనల్
Comments
Please login to add a commentAdd a comment