సిడ్నీ: టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్(131; 226 బంతుల్లో 16 ఫోర్లు) శతకం సాధించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా స్మిత్ మాత్రం నిలకడగా ఆడాడు. స్కోరు బోర్డుపై కనీసం మూడొందల స్కోరు ఉంచాలనే లక్ష్యంతో జాగ్రత్తగా ఆడాడు. ఈక్రమంలోనే టెస్టుల్లో మెల్లగా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది స్మిత్‌కు 27వ టెస్టు సెంచరీ. ఫలితంగా టెస్టు సెంచరీల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సరసన చేరాడు స్మిత్. అంతర్జాతీయ కెరీర్‌లో 70 శతకాలు చేసిన కోహ్లి.. టెస్టుల్లో 27 సెంచరీలతో ఉన్నాడు. ఇదిలా ఉంచితే, టెస్టు పరుగుల్లో కోహ్లిని స్మిత్ అధిగమించాడు. కోహ్లి ఇప్పటివరకూ 7,318 టెస్టు పరుగులు సాధిస్తే, స్మిత్ 7,368 పరుగులతో కొనసాగుతున్నాడు. (జడేజా బంతితో చెలరేగినా.. స్మిత్ సెంచరీ కొట్టేశాడు)
స్మిత్ మరో ఘనత
టీమిండియా అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన జాబితాలో స్మిత్ స్థానం సంపాదించాడు. ఇది స్మిత్‌కు టీమిండియాపై ఎనిమిదో టెస్టు సెంచరీగా నమోదైంది. అంతకుముందు గ్యారీ సోబర్స్, వివ్ రిచర్డ్(వెస్టిండీస్), రికీ పాంటింగ్(ఆస్ట్రేలియా)లు మాత్రమే భారత్‌పై ఎనిమిదేసి టెస్టు శతకాలు సాధించినవారు. కాగా, మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 338 పరుగులకు ఆలౌటైంది. 166/2 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ మరో 172 పరుగులు చేసి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ ఆటగాళ్లు లబూషేన్ (91; 196 బంతుల్లో 11 ఫోర్లు) సెంచరీ కోల్పోగా, స్టీవ్ స్మిత్శతకం సాధించాడు. స్మిత్ కడవరకూ క్రీజ్‌లో ఉండి స్కోరును చక్కదిద్దాడు. ఈ రోజు ఆటలో టీమిండియా బౌలింగ్‌లో రాణించినా స్మిత్ మాత్రం శతకంతో ఆకట్టుకోవడంతో ఆసీస్ తేరుకుంది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు సాధించగా, సైనీ, బుమ్రాలకు తలో రెండు వికెట్లు లభించాయి. సిరాజ్‌కు వికెట్ దక్కింది. (‘తల’ ఎత్తుకునే ప్రదర్శన!)
Comments
Please login to add a commentAdd a comment