ఐపీఎల్‌.. బలాబలాలు తేల్చుకుందాం! | Strengths Of Each Franchise In IPL 2020 | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌.. బలాబలాలు తేల్చుకుందాం!

Published Sat, Sep 12 2020 11:15 AM | Last Updated on Sat, Sep 19 2020 3:24 PM

Strengths Of Each Franchise In IPL 2020 - Sakshi

వెబ్‌ స్పెషల్‌: క్రికెట్‌ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-13వ సీజన్‌కు మరో వారం రోజుల వ్యవధి మాత్రమే ఉంది.  కరోనా సంక్షోభంలో సైతం అభిమానులకు మజాను అందించడానికి సన్నద్ధమైంది క్యాష్‌ రిచ్‌ లీగ్‌. టీమిండియా సభ్యులు తమ సహచరులపైనే కత్తులు దూసేందుకు ప్రతీ ఏడాదిలాగే సిద్ధమైపోయారు. తాడోపేడో తేల్చుకుందా రండి అంటూ పోరుకు నడుంబిగించారు.

ఈనెల 19వ తేదీ నుంచి వినోదం అందించేందుకు క్రికెట్‌ అభిమానుల పండగ ఐపీఎల్‌ వచ్చేసింది. అన్ని జట్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమవుతూ టైటిల్‌ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. యూఏఈ వేదికగా ఆరంభం కానున్న ఐపీఎల్‌ మ్యాచ్‌లు దుబాయ్‌, అబుదాబి, షార్జాల్లో జరుగనున్నాయి.  దుబాయ్‌లో 24 మ్యాచ్‌లు, అబుదాబిలో 20 మ్యాచ్‌లు, షార్జాలో 12 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ప్రస్తుతానికి లీగ్‌ దశ మ్యాచ్‌ల వరకే షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ.. ప్లే ఆఫ్స్, ఫైనల్‌ మ్యాచ్‌ షెడ్యూల్‌ను, వేదికలను తర్వాత ప్రకటించనుంది.  53 రోజుల పాటు జరుగనున్న ఈ సీజన్‌ లీగ్‌లో ఆయా జట్ల బలాలు బలహీనతలు ఒక్కసారి చూద్దాం.

డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై.. ఇప్పటివరకూ నాలుగుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ దాన్ని నిలబెట్టుకోవాలనే కసితో ఉంది.

బలాలు; రోహిత్‌ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్‌కు క్రిస్‌లిన్‌, క్వింటాన్‌ డీకాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌,  ఇషాన్‌ కిషాన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లు బ్యాటింగ్‌ బలం. ఓపెనింగ్‌తో పాటు మిడిల్‌ ఆర్డర్‌లో కూడా ఈ జట్టు బ్యాటింగ్‌ విభాగం బలంగానే ఉంది. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో హార్దిక్‌ పాండ్యా, కీరోన్‌ పొలార్డ్‌లు ఆ జట్టులో ఉండటం వారికి అదనపు బలం. ఆల్‌రౌండర్లగా ఉన్న మరో ఇద్దరు ఆటగాళ్లు షెర్ఫాన్‌ రూథర్డ్‌పర్డ్‌, కృనాల్‌ పాండ్యాలు తమ సత్తాను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. బౌలింగ్‌ విభాగంలో జస్‌ప్రీత్‌ బుమ్రా, మిచెల్‌ మెక్లాన్‌గన్‌లో పాటు ట్రెంట్‌ బౌల్ట్‌, కౌల్టర్‌ నైల్‌ రూపంలో పేసర్లు ఉన్నారు.

బలహీనతలు; బ్యాటింగ్‌, పేస్‌ బౌలింగ్‌ విభాగాల్లో బలంగా కనిపిస్తున్న ముంబై ఇండియన్స్‌ స్పిన్‌ బౌలింగ్‌ విభాగంలో చాలా బలహీనంగా ఉంది. రాహుల్‌ చాహర్‌, కృనాల్‌ పాండ్యా. జయంత్‌ యాదవ్‌లు ఆ జట్టులోని స్పిన్నర్లు. వీరు పేసర్లకు సపోర్టింగ్‌ బౌలింగ్‌గా నిలిస్తే ముంబైకు తిరుగుండదు. ఒకవేళ స్పిన్‌ విభాగం రాణించకపోతే యూఏఈలో పేస్‌ బౌలింగ్‌తోనే నెట్టుకురావడం కష్టం.

చెన్నై సూపర్‌ కింగ్స్‌
గతేడాది టైటిల్‌ను తృటిలో కోల్పోయిన జట్టు సీఎస్‌కే. మూడుసార్లు ఈ ట్రోఫీని ముద్దాడింది. ఎంఎస్‌ ధోని నేతృత్వంలోని సీఎస్‌కే పటిష్టమైన జట్లలో ఒకటి. ప్రతీ సీజన్‌లోనే బలంగా కనిపించే జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌.  ఇప్పటివరకూ చెన్నై మూడు టైటిల్‌ను గెలిచిందంటే ధోని మ్యాజిక్‌ కెప్టెన్సీనే కారణం. జట్టును ఒత్తిడి నుండి బయటపడేసి గాడిలో పడేలా చేయడంలో ధోనిది సెపరేట్‌ స్టైల్‌. ఆటగాళ్లను కూడా ఎంతో కూల్‌గా ఉంచుతూ వారి నుంచి పూర్తిస్థాయి ప్రదర్శనతో ఆకట్టుకునేలా చేయడంలో ధోనికి సాటిలేదు.

బలాలు; ధోనితో పాటు షేన్‌ వాట్సన్‌, డుప్లెసిస్‌, అంబటి రాయుడు, మురళీ విజయ్‌లు వారి ప్రధాన బ్యాటింగ్‌ బలం. అప్పడప్పుడు మెరిసే కేదార్‌ జాదవ్‌ కూడా గాడిలో పడితే సీఎస్‌కే బ్యాటింగ్‌ మరింత బలోపేతం అవుతుంది. ఇక డ్వేన్‌ బ్రేవో, రవీంద్ర జడేజా లాంటి ఆల్‌రౌండర్‌ ఉండటం ఆ జట్టుకు అదనపు బలం. మిచెల్‌ సాంత్నార్‌, సామ్‌ కరాన్‌లు కూడా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంటే మాత్రం సీఎస్‌కేను ఆపడం కష్టం. స్పిన్‌ విభాగంలో ఇమ్రాన్‌ తాహీర్‌ ప్రధానపాత్ర పోషించే అవకాశం ఉంది. 

బలహీనతలు; సీఎస్‌కే వైస్‌ కెప్టెన్‌గా ఉన్న సురేశ్‌ రైనా జట్టుకు దూరం కావడం పూడ్చలేని లోటు. ఇక స్పిన్‌ విభాగంలో హర్భజన్‌ సింగ్‌ లేకపోవడంతో అనుభవం ఉన్న ఒక స్పిన్నర్‌ సేవల్ని సీఎస్‌కే కోల్పోనుంది. పేస్‌ బౌలింగ్‌ విభాగంలో లుంగీ ఎన్‌గిడి, దీపక్‌ చాహర్‌లే సీఎస్‌కేకు ఉన్న ప్రధాన ఆప్షన్లు. ఇది ఒక మైనస్‌. హజల్‌వుడ్‌ వంటి మరొక పేసర్‌ ఉన్న గత కొన్ని సీజన్ల నుంచి అతనికి తుది జట్టులో చోటులో దక్కడం లేదు. స్పిన్నర్‌ పీయూష్‌ చావ్లా ఉన్నప్పటికీ సీఎస్‌కే నమ్మకాన్ని చూరగొనే ప్రదర్శన ఇప్పటివరకూ చేయలేదు.

ఢిల్లీ క్యాపిటల్స్‌ 
ఐఎల్‌లో అత్యంత దురదృష్టకరమైన జట్టు అని చెప్పాలి. ఈ జట్టులో ఎంతోమంది ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఉన్నా కూడా.. ట్రోఫీ గెలవాలనే కల ఇంకా వాళ్ళకి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. సమిష్టి ప్రదర్శన కరువై వరస ఓటములతో ఐపీఎల్‌లో చెప్పుకోదగ్గ రికార్డులు లేని ఈ జట్టు 2019లో మాత్రం ప్లేఆఫ్స్ చివరి వరకు వెళ్ళింది. ఇక ఈ ఏడాది ఎలాగైనా ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికే ప్రత్యర్థి జట్లను ఎదుర్కోవడానికి ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. 

బలాలు;
ఢిల్లీ జట్టులో అటు మెరుగైన యువ క్రికెటర్లు, ఇటు సీనియర్ ఆటగాళ్లు పుష్కలంగా ఉన్నారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్, సందీప్ లామిచాన్ వంటి యువ క్రికెటర్స్.. శిఖర్ ధావన్, అజింక్య రహానే, మార్కస్ స్టోయినిస్ వంటి సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు. అంతేకాదు ప్రస్తుతం ఢిల్లీ జట్టులో ఫినిషర్స్ కు కొదవు లేదు. ఒంటి చేత్తో మ్యాచ్ ను మలుపు తిప్పే ప్లేయర్స్ ఈ జట్టులో ఉన్నారు. గత సీజన్ లో అదరగొట్టిన పంత్, భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్, అజింక్య రహానేలపై ఈ జట్టు భారీ ఆశలు పెట్టుకుందనే చెప్పాలి. ఇక ఢిల్లీ జట్టులోకి ఈ ఏడాది వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ అనుభవం యువ బౌలర్లకు చాలా ఉపయోగపడుతుంది. పేస్‌ బౌలింగ్‌ విభాగంలో ఇషాంత్‌ శర్మ, కగిసో రబడా, కీమో పాల్‌, మోహిత్‌ శర్మ, క్రిస్‌ వోక్స్‌లు ఉన్నారు.

బలహీనతలు;
ధావన్, పృథ్వీ షా, అజింక్య రహానేల రూపంలో ఓపెనర్స్ శుభారంభాన్ని ఇచ్చినా.. ఢిల్లీకి మిడిలార్డర్ పెద్ద ఇబ్బందిగా మారింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఒక్కడే ఫామ్ లో ఉన్నాడు.. కొత్తగా టీమ్ లోకి వచ్చిన హెట్‌మైర్, మార్కస్ స్టోయినిస్ ఏమేరకు రాణిస్తారో వేచి చూడాలి. ఢిల్లీకి సరైన ఆల్‌రౌండర్‌ లేకపోవడం లోటు. పేస్‌ బౌలర్‌గా ఉండి బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించే ఆల్‌రౌండర్‌ లేడు. 

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 
బలాలు; కేఎల్ రాహుల్, క్రిస్‌గేల్, గ్లెన్ మాక్స్‌వెల్, నికోలస్ పూరన్ రూపంలో అగ్రశ్రేణి టీ20 బ్యాట్స్‌మెన్‌లు ఉన్నారు. బౌలింగ్‌ విభాగం కూడా మహ్మద్ షమీ, కాట్రెల్, క్రిస్‌ జోర్దాన్ రూపంలో బలంగా కనిపిస్తోంది. ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ 12 సీజన్లు ముగియగా.. పంజాబ్ టీమ్ ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలవలేకపోయింది. 2014లో ఫైనల్‌కు చేరడం మినహా ఎప్పుడూ గొప్ప ప్రదర్శన చేయలేదు. ఆ సీజన్‌లో కేకేఆర్‌ చేతిలో కింగ్స్‌ పంజాబ్‌ ఓటమి పాలై రన్నరప్‌గా సరిపెట్టుకుంది. ఇది ఆ జట్టు ఐపీఎల్‌ చరిత్రలో ఉత్తమ ప్రదర్శన.

బలహీనతలు; కింగ్స్‌ పంజాబ్‌ జట్టుకు స్ట్రాంగ్‌ స్పిన్‌ బౌలింగ్‌లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రవిబిష్నోయ్‌, ముజీబ్‌ ఉర్‌ రహ్మన్‌, దీపక్‌ హుడాలపైనే ఆ జట్టు స్పిన్‌ ఆశలు. మ్యాక్స్‌వెల్‌ పార్ట్‌టైమ్‌ బౌలర్‌ ఎంత వరకూ రాణిస్తాడో చూడాలి. ఆల్‌రౌండర్‌ కోటాలో మ్యాక్స్‌వెల్‌, జేమ్స్‌ నీషమ్‌, కృష్ణప్ప గౌతమ్‌, దీపక్‌ హుడాలు ఉన్నా అందులో మ్యాక్స్‌వెల్‌ ఒక్కడే చెప్పుకోదగ్గవాడు.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌
ఐపీఎల్‌ చరిత్రలో కేకేఆర్‌ రెండుసార్లు టైటిల్‌ను గెలుచుకుంది. గౌతం గంభీర్‌ సారథ్యంలో కేకేఆర్‌ 2012, 2014ల్లో టైటిల్‌ను ముద్దాడింది. అయితే ఆ తర్వాత 2016, 17, 18ల్లో ప్లేఆఫ్స్‌కు చేరినా టైటిల్‌ను మాత్రం సాధించలేకపోయింది. కేకేఆర్‌ మినిమమ్‌ గ్యారంటీ ఉన్న జట్టు. కనీసం ప్లేఆఫ్స్‌ చేరే జట్లలో కేకేఆర్‌ ఒకటిగా చెప్పొచ్చు. మరి దినేశ్‌ కార్తీక్‌ సారథ్యంలోని కేకేఆర్‌.. తాజా సీజన్‌ బలాలు, బలహీనతలు చూద్దాం.

బలాలు; దినేశ్‌ కార్తీక్‌, టామ్‌ బాంటాన్‌, ఇయాన్‌ మోర్గాన్‌, ఆండ్రీ రసెల్‌, శుబ్‌మన్‌ గిల్‌, నితీష్‌ రాణా వంటి స్టార్లతో కేకేఆర్‌ బ్యాటింగ్‌ విభాగం కళకళలాడుతోంది. ఇక ఎప్పట‍్నుంచో కేకేఆర్‌లో ఓపెనింగ్‌ పాత్ర పోషిస్తూ మెరుపులు మెరిపిస్తున్న సునీల్‌ నరైన్‌ కొన్ని విలువైన పరుగులు చేస్తూ ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ప్యాట్‌ కమిన్స్‌, లూకీ ఫెర్య్గుసన్‌, హారీ గర్నీలు కేకేఆర్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆప్షన్లు. స్పిన్‌ విభాగంలో నరైన్‌తో పాటు కుల్దీప్‌ యాదవ్‌ వారికి అదనపు బలం.

బలహీనతలు; అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న కేకేఆర్‌ ఎక్కువగా విదేశీ ఆటగాళ్లపైనే ఆధారపడటం ప్రధాన బలహీనత. ఒకవేళ ఆ జట్టులోని మధ్యలో రావడం కానీ, మధ్యలోని వెళ్లిపోతే అప్పుడు కేకేఆర్‌ కష్టాలు తప్పువు.

రాజస్తాన్‌ రాయల్స్‌
ఐపీఎల్‌ తొలి టైటిల్‌ గెలిచిన జట్టు. షేన్‌ వార్న్‌ సారథ్యంలోని రాజస్తాన్‌ రాయల్స్‌ ఆరంభపు సీజన్‌లో(2008)లో టైటిల్‌ను సాధించింది. 2013, 2015, 2018లో ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఈ నాలుగు సీజన్లు మినహా రాజస్తాన్‌ ఆకట్టుకోలేదు.

బలాలు; ఈ సీజన్‌లో స్టీవ్‌ స్మిత్‌ సారథ్యంలోని రాజస్తాన్‌ జట్టుకు స్మిత్‌తో పాటు రాబిన్‌ ఊతప్ప, మయాంక్‌ మన్కడ్‌, సంజూ శాంసన్‌, జోస్‌ బట్లర్‌, యశస్వి జైస్వాల్‌, డేవిడ్‌ మిల్లర్‌, జోఫ్రా ఆర్చర్‌, జయ్‌దేవ్‌ ఉనాద్కత్‌లు ప్రధాన బలం.

బలహీనతలు; ఈ జట్టు ఎక్కువ భాగం విదేశీ ఆటగాళ్లపై ఆధారపడుతుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఆల్‌రౌండర్‌ ఆప్షన్లలో విదేశీ ఆటగాళ్లపైనే ఆధారపడటం ఈ జట్టు ప్రధాన బలహీనత. ఈ సీజన్‌కు బెన్‌ స్టోక్స్‌ లేకపోవడం కూడా ఆ జట్టుకు ప్రధాన లోటు. చెప్పుకోదగ్గ భారత ఆటగాళ్లు రాజస్తాన్‌కు లేరు.

ఆర్సీబీ
ఈ జట్టు అన్ని విభాగాల్లోని బలంగా కనిపిస్తున్నప్పటికీ అసలు సిసలు ఆటకు వచ్చేసరికి బలహీనపడుతోంది. పేపర్‌ పులులు అనే సామెత ఆర్సీబీకి అచ్చంగా సరిపోతుందేమే. 2009, 2011, 2016లో ఫైనల్‌కు చేరింది. గత సీజన్‌లో చివరి ప్లేస్‌కు పరిమితమైన జట్టు ఆర్సీబీ.  ఈసారైనా తమ అదృష్టం మారుతుందనే ఆశతో ఉంది కోహ్లి అండ్‌ గ్యాంగ్‌.

బలాలు; కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో పాటు ఏబీ డివిలియర్స్‌, అరోన్‌ ఫించ్‌, పార్థీవ్‌ పటేల్‌, మొయిన్‌ అలీలు బ్యాటింగ్‌లో ప్రధాన బలం. ఇక ఆసీస్‌కు చెందిన యువ సంచలనం జోష్‌ ఫిలిప్పి ఆ జట్టుకు ప్రధాన ఆకర్షణ కావొచ్చు. బిగ్‌బాష్‌ లీగ్‌ లీగ్‌లో రాణించిన ఫిలిప్పిని ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ కోసం ఆర్సీబీ తీసుకుంది. వికెట్‌ కీపింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తాబనే ఆశతో ఉంది ఆర్సీబీ. బౌలింగ్‌లో డేల్‌ స్టెయిన్‌ ఉమేశ్‌ యాదవ్‌, నవదీప్‌ షైనీ, చహల్‌లు ఆర్సీబీకి అండ. వీరు రాణిస్తే ఆర్సీబీ ప్లే ఆఫ్‌ ఆశలను పెట్టుకోవచ్చు. 

బలహీనతలు; పేస్‌ బౌలర్లు డెత్‌ ఓవర్లలో రాణించకపోవడమే ఆర్సీబీకి ఉ‍న్న ప్రధాన మైనస్‌. ఉమేశ్‌, షైనీ, సిరాజ్‌లో చివరి ఓవర్లలో ఎక్కువ పరుగులు సమర్పించుకోవడం ఆ జట్టును కలవరపాటుకు గురిచేస్తోంది. ఆరంభ ఓవర్లలో వీరు మెరుగ్గా బౌలింగ్‌ చేసిన గణాంకాలు ఉన్నప్పటికీ మ్యాచ్‌ను కాపాడుకునే క్రమంలో డెత్‌ ఓవర్ల స్పెషలిస్టు లేకపోవడం ఆర్సీబీకి లోటు.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌
2016లో టైటిల్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. గత మూడు సీజన్లగా కనీసం ప్లేఆఫ్స్‌కు చేరుతూ వస్తూ అభిమానుల ఆశల్ని వమ్ము చేయడం లేదు. ఈ ఏడాది కూడా ప్లేఆఫ్స్‌కు చేరే జట్ల అంచనాలలో కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ కచ్చితంగా ఉంటుంది. డేవిడ్‌ వార్నర్‌ సారథ్యంలో ఈ సీజన్‌ ఐపీఎల్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ ‌గెలవడానికి పూర్తిస్థాయిలో కసరత్తులు చేస్తోంది.

బలాలు; వార్నర్‌తో పాటు కేన్‌ విలియమ్సన్‌, మనీష్‌ పాండే, జానీ బెయిర్‌ స్టో, విజయ్‌ శంకర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, రషీద్‌ ఖాన్‌లు ప్రధానబలం. సిద్దార్థ కౌల్‌, సందీప్‌ శర్మ, ఖలీల్‌ అహ్మద్‌లు కూడా చెప్పుకోదగ్గ బౌలర్లే. ఈసారి బిల్లీ స్టాన్‌లేక్‌ జట్టుతో కలవనున్నాడు. 2017, 2018లో ఐపీఎల్‌ ఆడిన స్టాన్‌లేక్‌.. గత సీజన్‌కు దూరమయ్యాడు. తాజా సీజన్‌కు స్టాన్‌లేక్‌ అందుబాటులోకి రావడంతో బౌలింగ్‌ బెంచ్‌ బలం కూడా సన్‌రైజర్స్‌కు పెరిగినట్లే.

బలహీనతలు;  ఎక్కువ మంది ఓవర్‌సీస్‌ ఆటగాళ్లు ఉండటమే ఎస్‌ఆర్‌హెచ్‌కు ప్రధాన బలహీనత. నలుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే ఒక ఐపీఎల్‌ జట్టులో ఆడాలనేది నిబంధన. తుది జట్టులో నలుగురు మించి విదేశీ ఆటగాళ్లు ఉండకూడదు. ఇక్కడ విదేశీ ఆటగాళ్ల బలంతో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌కు ఇది అతి పెద్ద మైనస్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement