వెబ్‌స్పెషల్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అంటేనే వెటరన్, యువ క్రికెటర్ల సమ్మేళనం. ఎంతోమంది క్రికెటర్లను స్టార్లను చేసిన లీగ్ ఇది. ఆటగాళ్లు అటు ఆర్థికంగా స్థిరపడటంతో పాటు జాతీయ జట్టును ఆకర్షించడానికి ఇదొక చక్కటి వేదిక. మరో ఐదు రోజుల్లో ఆరంభం కానున్న ఐపీఎల్-2020వ సీజన్‌తో ఎంతమంది ప‍్రపంచం దృష్టిని ఆకర్షిస్తారనే విషయం పక్కన ఉంచితే, సీనియర్లకు మాత్రం ఇది పెను సవాల్‌గా నిలవడం ఖాయం. ప్రధానంగా ఆయా జట్లకు కెప్టెన్లగా చేసేవాళ్లు తమ జట్టులను ఏ విధంగా విజయాల బాట పట్టిస్తారో చూడాల్సి ఉంది. వీరిలో ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల కెప్టెన్సీనే హాట్ టాపిక్ కాబోతోంది. ప్లేయర్‌గా, కెప్టెన్‌గా వంద ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న ధోని కెప్టెన్సీ గురించి ఎవరికీ బెంగలేకపోయినా, ప్రస్తుతం ఉన్న జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి. ఒకసారి ఓవరాల్ ఐపీఎల్ కెప్టెన్సీ రికార్డులను పరిశీలిద్దాం..
ఎంఎస్ ధోని(సీఎస్‌కే)
మిస్టర్ కూల్‌గా జట్టును నడిపిస్తున్న ధోని.. సీఎస్‌కేకు మూడు టైటిల్స్ అందించిన కెప్టెన్. రెండేళ్లు సీఎస్‌కే ఐపీఎల్‌కు దూరమైనప్పుడు రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌కు ధోని కెప్టెన్‌గా చేశాడు. ఓవరాల్ ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్‌గా 174 మ్యాచ్‌లను ఆడాడు ధోని. ఇది ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్సీ రికార్డుగా ఉంది. ఇక వీటిలో 104 మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ధోని.. 69 మ్యాచ్‌లను చేజార్చుకున్నాడు. ఒకదాంట్లో ఫలితం తేలలేదు. ధోని విన్నింగ్ పర్సటేంజ్ 60.11గా ఉంది. 30, అంతకంటే ఎక్కువ ఐపీఎల్ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసిన వారి పరంగా చూస్తే ఇదే బెస్ట్.
విరాట్ కోహ్లి(ఆర్సీబీ)
ఆర్సీబీ ఫ్రాంచైజీకి విరాట్ కోహ్లి రెగ్యులర్ కెప్టెన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఐపీఎల్‌లో ఇప్పటివరకూ ఆర్సీబీకి మాత్రమే కోహ్లి సారథ్యం వహించాడు. కానీ కోహ్లి నేతృత్వంలోని ఆర్సీబీ ఇప్పటిదాకా టైటిల్ సాధించలేదు. ఆర్సీబీకి 110 మ్యాచ్‌లకు కోహ్లి సారథ్యం వహించాడు. ఇందులో 49 విజయాలు మాత్రమే కోహ్లి ఖాతాలోకి రాగా, 55 మ్యాచ్‌ల్లో పరాజయం చవిచూడాల్సి వచ్చింది. ఇందులో రెండు మ్యాచ్‌లు టైగా ముగియగా, నాలుగు ఫలితం తేలలేదు. ఆటగాడిగా సక్సెస్ అయిన కోహ్లి.. కెప్టెన్‌గా విజయాల శాతం మాత్రం 47. 16గా ఉంది.
రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్)
ఐపీఎల్‌లో అత్యంత సక్సెస్‌ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మ. ముంబై ఇండియన్స్‌కు నాలుగు ఐపీఎల్ టైటిల్స్‌ను రోహిత్ సాధించిపెట్టాడు. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ సాధించిన కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. కెప్టెన్‌గా 104 మ్యాచ్‌ల్లో 60 విజయాలను రోహిత్ ఖాతాలో వేసుకోగా, 42 మ్యాచ్‌ల్లో పరాజయం చవిచూశాడు. మరో రెండు మ్యాచ్‌లు టైగా ముగిశాయి. ఇక్కడ రోహిత్ విజయాల శాతం 58.65 గా ఉంది.
దినేశ్ కార్తీక్(కేకేఆర్)
ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లకు కెప్టెన్‌గా చేశాడు దినేశ్ కార్తీక్. అందులో ఒకటి ఢిల్లీ డేర్‌డెవిల్స్(ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్) ఒకటి కాగా, రెండో కోల్‌కతా నైట్‌రైడర్స్. ఢిల్లీ జట్టులో పెద్దగా ఆకట్టుకోలేని దినేశ్ కార్తీక్.. కేకేఆర్ జట్టులో కెప్టెన్‌గా ఆకట్టుకున్నాడు. ఐపీఎల్‌లో కార్తీక్ 36 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేయగా, 17 మ్యాచ్‌ల్లో విజయం దక్కింది. మరో 18 మ్యాచ్‌ల్లో పరాజయం చవిచూశాడు. ఇక్కడ ఒక మ్యాచ్ టైగా ముగిసింది. కార్తీక్ విజయాల శాతం 48.16గా ఉంది.
డేవిడ్ వార్నర్(ఎస్‌ఆర్‌హెచ్)
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సారథ్యం వహిస్తున్న డేవిడ్ వార్నర్.. 2015 నుంచి 2017 వరకూ కెప్టెన్‌గా కొనసాగాడు. ఈ క్రమంలోనే వార్నర్ సారథ్యంలోని ఎస్‌ఆర్‌హెచ్ 2016లో టైటిల్ అందుకుంది. కాగా, బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో 2018, 2019ల్లో ఐపీఎల్‌కు దూరమయ్యాడు వార్నర్. దాంతో ఆ సీజన్‌లలో కేన్ విలియమ్సన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ ఏడాది వార్నర్ తిరిగి ఎస్‌ఆర్‌హెచ్ పగ్గాలు అప్పజెప్పారు. ఇప్పటివరకూ ఎస్‌ఆర్‌హెచ్‌కు 45 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన వార్నర్.. 26 విజయాలను సాధించాడు. మరొకవైపు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు రెండు మ్యాచ్‌లకు వార్నర్ కెప్టెన్‌గా చేశాడు. మొత్తం 47 ఐపీఎల్ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసిన వార్నర్.. 26 విజయాలను చూడగా, 21 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూశాడు. వార్నర్ ఐపీఎల్ కెప్టెన్సీ విజయాల శాతం 55. 31 గా ఉంది.
స్టీవ్ స్మిత్(రాజస్తాన్ రాయల్స్)
ఐపీఎల్ చరిత్రలో మూడు జట్లకు కెప్టెన్‌గా చేసిన ఘనత స్టీవ్ స్మిత్‌ది. పుణె వారియర్స్, రాజస్తాన్ రాయల్స్, రైజింగ్ పుణె సూపర్‌జెయింట్. ఇప్పుడు వీటిలో రాజస్తాన్ రాయల్స్ మాత్రమే ఉంది. ఈ జట్టుకు స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా చేస్తున్నాడు. స్మిత్ కూడా 2018 సీజన్‌కు దూరం కాగా, 2019 సీజన్‌లో ఆడాడు. కానీ అజింక్యా రహానే కెప్టెన్సీలో స్మిత్ గతేడాది ఐపీఎల్ ఆడాడు. తాజాగా మళ్లీ స్మిత్‌కు రాజస్తాన్ పగ్గాలు అప్పచెప్పారు. ఇప్పటివరకూ 29 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసిన స్మిత్.. 19 విజయాలు సాధించగా, 9 మ్యాచ్‌ల్లో పరాజయం ఎదురైంది. ఒక్క మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఐపీఎల్ కెప్టెన్‌గా స్మిత్ విజయాల శాతం 67. 85గా ఉంది. ఇది ఐపీఎల్‌లో కనీసం ఐదు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసిన వారి పరంగా చూస్తే ఇది అత్యధిక విజయాల శాతం.
శ్రేయస్ అయ్యర్(ఢిల్లీ క్యాపిటల్స్)
గౌతం గంభీర్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌కు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా నియమించబడ్డాడు. 2018లో తొలిసారి ఢిల్లీ కెప్టెన్‌గా వ్యహరించిన అయ్యర్.. 2019 సీజన్ మొత్తానికి సారథిగా ఉన్నాడు. ఇప్పటివరకూ అయ్యర్ 24 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేస్తే 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించాడు. 10 మ్యాచ్‌ల్లో పరాజయం చవిచూడగా, ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ఐపీఎల్‌లో అయ్యర్ కెప్టెన్సీ విజయాల శాతం 56. 25గా ఉంది.
కేఎల్ రాహుల్(కింగ్స్ పంజాబ్)
తొలిసారి ఒక ఐపీఎల్ జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యహరించబోతున్నాడు. ఈ సీజన్ ఐపీఎల్‌లో కింగ్స్ పంజాబ్ జట్టుకు రాహుల్ కెప్టెన్. రవిచంద్రన్ అశ్విన్ నుంచి రాహుల్ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. అదే సమయంలో అశ్విన్‌ను కింగ్స్ వదిలేయడంతో అతను ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment