టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 34వ వసంతంలో అడుగుపెట్టాడు. అతడి పుట్టినరోజు సందర్భంగా స్నేహితులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి నూతన చైర్మన్‌గా ఎన్నికైన బీసీసీఐ కార్యదర్శి జై షా, మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తదితరులు సూర్యను విష్ చేశారు.
నా ప్రాణ స్నేహితుడు, నా ప్రపంచం
ఇక సూర్య భార్య దేవిశా శెట్టి తన మనసులోని భావాలు వెల్లడిస్తూ.. భావోద్వేగపూరిత నోట్‌తో హ్యాపీ బర్త్‌డే చెప్పింది. ‘‘నా ప్రాణ స్నేహితుడు, భర్త, ప్రేమికుడు.. నా ప్రపంచం.. నా జీవితంలో నేను తీసుకున్న సరైన నిర్ణయానికి నిదర్శనం.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ జీవితంలో నా కోసం కేటాయిస్తున్న ప్రతి ఒక్క రోజుకు నేను రుణపడి ఉంటా!
ఈ ప్రపంచాన్ని నాకోసం అందంగా మలిచావు. అసలు నువ్వు లేకుండా నేను ఒక్క పనైనా చేయగలనా? ఇప్పుడూ.. ఎల్లప్పుడూ.. నిన్ను ప్రేమిస్తూనే ఉంటా’’ అంటూ భర్తపై ప్రేమను చాటుకుంది. ఈ సందర్భంగా సూర్యతో దిగిన ఫొటోలను దేవిశా షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక భార్య షేర్ చేసిన పోస్టుకు బదులుగా.. సుకూన్(శాంతి) అంటూ సూర్య బదులిచ్చాడు. కాగా కాలేజీలో తన జూనియర్ అయిన దేవిశాను ప్రేమించిన సూర్య.. పెద్దలను ఒప్పించి 2016, జూలై 7న ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
నాలుగు టీ20 సెంచరీలు
ఇక సూర్య కెరీర్ విషయానికొస్తే... టీమిండియా తరఫున ఇప్పటి వరకు 109 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ యాదవ్.. 3213 పరుగులు చేశాడు. అత్యధికంగా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో నాలుగు సెంచరీలు నమోదు చేశాడు. పొట్టి ఫార్మాట్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా ఎదిగి సత్తా చాటాడు. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
టీమిండియా పూర్తిస్థాయి సారథిగా
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ స్థానంలో సూర్య ఇటీవలే భారత టీ2 జట్టు సారథిగా నియమితుడయ్యాడు. శ్రీలంక పర్యటన సందర్భంగా పూర్తిస్థాయి కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టి.. టీమిండియాకు 3-0తో క్లీన్‌స్వీప్ విజయం అందించాడు. ప్రస్తుతం గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న సూర్య.. అక్టోబరులో బంగ్లాదేశ్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
చదవండి: 'అతడు ఆటను గౌరవించడు.. జట్టులో చోటు దండగ'
Comments
Please login to add a commentAdd a comment