టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి గత కొంత కాలంగా అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. కోహ్లి చివరగా గతేడాది నవంబర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కనిపించాడు. అప్పటి నుంచి కోహ్లితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మను కూడా టీ20 జట్టు నుంచి సెలక్టర్లు తప్పించారు. వారి స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చారు.
ఈ క్రమంలో వచ్చే ఏడాది వెస్టిండీస్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో కోహ్లి ఆడుతాడా లేదా అన్న చర్చ ఇప్పటినుంచే మొదలైంది. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ కెప్టెన్ గవాస్కర్ తన అభిప్రయాలను వెల్లడించాడు. కోహ్లి ప్రస్తుత ఉన్న ఫామ్ ప్రకారం అయితే కచ్చితంగా భారత్ టీ20 సెటాప్‌లో ఉండాలి అని గవాస్కర్ తెలిపాడు.
"టీ20 ప్రపంచకప్-2024కు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉంది. దానికి ముందు వచ్చే ఏడాది మార్చి,ఏప్రిల్ లో మరో ఐపీఎల్ జరుగుతుంది. అందులో కోహ్లి ఎలా రాణిస్తాడన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అంతే తప్ప ప్రపంచకప్‌లో కోహ్లి స్థానం గురించి ఇప్పటినుంచి చర్చలు అవసరంలేదు. ఒక వేళ ఈ ఏడాది జూన్‌లో ఏదైన టీ20 మ్యాచ్ జరిగినట్లైతే అతడు కచ్చితంగా భారత జట్టులో ఉండాలి.
ఎందుకంటే విరాట్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో కూడా రెండు సెంచరీలు సాధించాడు. కానీ వెస్టిండీస్, అమెరికాలో జరగనున్న ప్రపంచ కప్-2024 గురించి అనవసరమైన వాదన అవసరం లేదు. ప్రపంచ కప్ గురించి మాట్లాడితే మాత్రం.. వచ్చే ఐపీఎల్‌లో ప్లేయర్స్ ఫామ్ చూడాలి. అప్పుడే జట్టుపై ఒక క్లారిటీ వస్తుంది" అని స్పోర్ట్ టాక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్-2023లో విరాట్ కోహ్లి దుమ్మురేపాడు. 14 మ్యాచ్‌లు ఆడిన విరాట్ 639 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
చదవండి: AFG vs IND: ఆఫ్గాన్‌తో వన్డే సిరీస్.. భారత కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా! విధ్వంసకర ఓపెనర్ ఎంట్రీ
Comments
Please login to add a commentAdd a comment