న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా నమోదు చేసిన చెత్త రికార్డుపై భారత జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ స్పందించాడు. జట్టు వైఫల్యానికి బ్యాట్స్‌మెన్‌ను తప్పుపట్టడం సరికాదన్నాడు. ఆసీస్ పేస్ బౌలర్లు అద్భుతంగా రాణించారంటూ ప్రశంసలు కురిపించిన గావస్కర్.. వారి ధాటికి భారత్ స్థానంలో ఏ జట్టు ఉన్నా సరే 80-90 పరుగులకు మించి స్కోరు నమోదు చేయలేకపోయేదని అభిప్రాయపడ్డాడు. కాగా తొలి టెస్టు మూడోరోజు ఆటలో భాగంగా కేవలం 36 పరుగులకే భారత్ రెండో ఇన్నింగ్స్ ముగించిన సంగతి తెలిసిందే. ఆసీస్ బౌలర్లు హజిల్‌వుడ్(5 వికెట్లు), కమిన్స్ (4 వికెట్లు) ధాటికి టీమిండియా బ్యాట్స్‌మెన్ ఒక్కరు కూడా సింగిల్ డిజిట్ స్కోరు దాటలేక చేతులెత్తేశారు. మయాంక్ అగర్వాల్ 9 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. (చదవండి: టీమిండియా.. 4,9,2,0,4,0,8, 4,0,1)
ఇక ఇన్నింగ్స్‌లో ఒక్క ఆటగాడు కూడా డబుల్ డిజిట్ దాటకపోవడం 96 ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో కోహ్లి సేనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా సెటైరికల్ మీమ్స్‌తో భారత జట్టు ఆటతీరును పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సునీల్ గావస్కర్ శనివారం మాట్లాడుతూ..‘‘టెస్టు క్రికెట్ మొదలైన నాటి నుంచి.. అత్యల్ప స్కోరుకే ఓ జట్టు ఆలౌట్ కావడం అనేది స్వాగతించదగ్గ విషయం కాదు. అయితే అలాంటి బౌలింగ్‌లో ఏ జట్టైనా సరే చేతులెత్తేయడం ఖాయం. అయితే అందరూ ఇలా 36 పరుగులకే ఆలౌట్ కాకపోవచ్చు. 72, 80, 90 ఇలాంటి గణాంకాలు నమోదయ్యేవేమో! ఒక్కటి మాత్రం నిజం.. హాజిల్‌వుడ్, కమిన్స్.. స్టార్క్ ఆటతీరు అమోఘం. కాబట్టి భారత బ్యాట్స్‌మెన్‌ను నిందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆసీస్ బౌలర్లు అద్భుతంగా రాణించారు’’ అని పేర్కొన్నాడు. (చదవండి: చెత్త ఫీల్డింగ్‌పై సన్నీ సెటైర్లు)
Comments
Please login to add a commentAdd a comment