భారత వన్డే క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు మన హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ పేరిట నమోదై ఉన్నాయి. 2023, నవంబర్ 15న ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సిరాజ్ 9.5 ఓవర్లు వేసి 57 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు.
ఈ ప్రదర్శన తర్వాత 12 మంది భారత బౌలర్లు ఆరు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసినప్పటికీ ఒక్కరు కూడా ఏడు వికెట్ల మార్కును తాకలేకపోయారు. 2014లో స్టువర్ట్ బిన్నీ బంగ్లాదేశ్‌పై నమోదు చేసిన 6/4 ప్రదర్శన భారత వన్డే క్రికెట్ చరిత్రలో రెండో అత్యుత్తమం. భారత వన్డే క్రికెట్‌లో టాప్-5 అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల్లో ఒక్కరు కూడా తమ కోటా 10 ఓవర్లు పూర్తిగా వేయకపోవడం గమనించదగ్గ విశేషం.
అసలు విషయానికొస్తే.. వన్డేల్లో భారత్ తరఫున అత్యుత్తమ గణాంకాలు సిరాజ్ పేరిట నమోదై ఉన్నప్పటికీ.. 1999లో సౌతాఫ్రికాపై సునీల్ జోషీ నమోదు చేసిన గణాంకాలను (10-6-6-5) మాత్రం వన్డే క్రికెట్ ఎన్నటికీ మరువదు. కెన్యాలోని నైరోబీ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో సునీల్ జోషి మెలికలు తిరిగే బంతులతో సౌతాఫ్రికా ఆటగాళ్లను ముప్పుతిప్పలు పెట్టాడు. బంతి వికెట్ల ఆవల నేలపై పడిందంటే వదిలేయడం తప్ప సౌతాఫ్రికా ఆటగాళ్లకు వేరే గత్యంతరం లేకుండా ఉండింది.
వన్డే క్రికెట్ చరిత్రలో ఓ స్పిన్నర్ ఇంతలా బ్యాటర్లను భయపెట్టడం బహుశా ఇదే మొదటిసారి అయ్యుండవచ్చు. ఈ మ్యాచ్‌లో జోషి ఓవర్‌కు 0.60 సగటున పరుగులు సమర్పించుకున్నాడు. వన్డేల్లో కోటా ఓవర్లు పూర్తి చేసి ఇంత తక్కువ ఎకానమీతో బౌల్ చేయడం చాలా అరుదు. నేటి ఆధునికి క్రికెట్‌లో 10 ఓవర్లలో ఒకటి, రెండు మెయిడిన్లు వేస్తేనే గగనమైతే.. అప్పట్లో జోషి ఏకంగా ఆరు మెయిడిన్ ఓవర్లు సంధించాడు. ఆ మ్యాచ్‌లో జోషి స్పిన్ మాయాజాలం ధాటికి సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 48 ఓవర్లు ఎదుర్కొని 117 పరుగులకే కుప్పకూలింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ కేవలం 22.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. సదగోపన్ రమేశ్ 26, సౌరవ్ గంగూలీ 38 పరుగులు చేసి ఔట్ కాగా.. విజయ్ భరద్వాజ్ (18), రాహుల్ ద్రవిడ్ (6) భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. భారత వన్డే క్రికెట్ చరిత్రలో సునీల్ జోషి నమోదు చేసిన గణంకాలు 14వ అత్యుత్తమమైనప్పటికీ.. వన్డే క్రికెట్‌లో ఈ ప్రదర్శన చిరకాలం గుర్తుండిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment