వెస్టిండీస్ మాజీ ఆటగాడు, కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ సునీల్ నరైన్ విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నరైన్ సెంచరీతో కదం తొక్కాడు. ఓపెనర్‌గా వచ్చిన నరైన్.. రాజస్తాన్ బౌలర్లను ఊచకోత కోశాడు.
ఈ క్రమంలో కేవలం 49 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్‌గా 56 బంతులు ఎదుర్కొన్న నరైన్ 13 ఫోర్లు, 6 సిక్స్‌లతో 109 పరుగులు చేశాడు. కాగా నరైన్‌కు ఇది తన కెరీర్‌లోనే తొలి సెంచరీ కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన నరైన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
నరైన్ సాధించిన రికార్డులు ఇవే..
►ఒక ఐపీఎల్ మ్యాచ్‌లో సెంచరీతో పాటు క్యాచ్, వికెట్ పడగొట్టిన తొలి ప్లేయర్‌గా నరైన్ రికార్డులకెక్కాడు. కాగా 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఎవరికి ఈ ఘనత సాధ్యం కాలేదు.
►ఐపీఎల్ చరిత్రలో ఐదు వికెట్ల హాల్‌తో పాటు సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా సునీల్ నరైన్ చరిత్ర సృష్టించాడు. 2012 ఐపీఎల్ సీజన్‍లో ఇదే ఈడెన్‌గార్డెన్స్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‍పై నరైన్ 5 వికెట్లతో ,చెలరేగాడు.
►ఐపీఎల్‍లో హ్యాట్రిక్‍తో పాటు సెంచరీ కూడా సాధించిన మూడో ప్లేయర్‌గా సునీల్ నరైన్ నిలిచాడు. 2013 ఐపీఎల్ సీజన్‍లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‍పై నరైన్ హ్యాట్రిక్ తీశాడు. ఇప్పుడు సెంచరీ చేయడంతో ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వాట్సన్ ఉన్నారు.
►ఐపీఎల్‌లో 100 వికెట్లతో పాటు సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా కూడా నరైన్ రికార్డు సృష్టించాడు. నరైన్ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 170 వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment