
న్యూఢిల్లీ: ఐపీఎల్ నుంచి అర్ధాంతరంగా తప్పుకొన్న టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా ఎట్టకేలకు మౌనం వీడాడు. తమ కుటుంబంలో చోటుచేసుకున్న తీవ్ర విషాదం గురించి ట్విటర్ వేదికగా మంగళవారం స్పందించాడు. వ్యక్తిగత కారణాలతోనే యూఏఈ నుంచి వెనక్కి వచ్చినట్లు వెల్లడించాడు. ఈ మేరకు ‘‘పంజాబ్‌లో మా కుటుంబంపై భయంకరమైన దాడి జరిగింది. మా అంకుల్‌ను చంపేశారు. మా మేనత్త, నా ఇద్దరు కజిన్లు తీవ్ర గాయాలపాలయ్యారు. దురదృష్టవశాత్తు గత రాత్రి నా కజిన్ ఒకరు ప్రాణాలతో పోరాడుతూ మృతి చెందారు.
మా మేనత్త పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అసలు ఆరోజు రాత్రి ఏం జరిగిందో మాకు ఇంతవరకు తెలియలేదు. ఎవరు ఈ దాడి చేశారో అర్థం కావడంలేదు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేయాల్సిందిగా పంజాబ్ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా. అత్యంత హేయమైన పాల్పడిన నేరస్తుల గురించి కనీస వివరాలు తెలుసుకునే అర్హత మాకు ఉందని భావిస్తున్నా. అలాంటి నేరగాళ్లు మరిన్ని నేరాలకు పాల్పడకుండా చూడాలి’’ అని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు సురేశ్ రైనా విజ్ఞప్తి చేశాడు. (చదవండి: ఐపీఎల్‌కు సురేశ్ రైనా దూరం)
కాగా పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో గల రైనా బంధువుల ఇంటిపై ఆగస్ట్ 29న నలుగురు దుండగులు దాడి చేసిన విషయం తెలిసిందే. అర్థరాత్రి నిద్రిస్తున్నసమయంలో అకస్మాత్తుగా దాడి చేసి కుటుంబ యజమానిని హత్య చేశారు. ఇతర కుటుంబ సభ్యులను తీవ్రంగా గాయపరిచారు. కాగా ఈ ఘాతుకానికి పాల్పడింది‘కాలే కచ్చే గ్యాంగ్’ అని తెలిసింది. పరారీలో ఉన్న నిందితుల కోసం పంజాబ్ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.(చదవండి: రైనా కుటుంబంలో తీవ్ర విషాదం)
Comments
Please login to add a commentAdd a comment