
Suryakumar Yadav- Setback To Mumbai Indians Ahead IPL 2024?: టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ మరి కొన్నాళ్లపాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. ఇప్పటికే చీలమండ గాయంతో బాధపడుతున్న ఈ డాషింగ్ బ్యాటర్ ను మరో ఆరోగ్య సమస్య వేధిస్తున్నట్లు తెలుస్తోంది. స్పోర్ట్స్ హెర్నియా వల్ల అతడు ఇబ్బందిపడుతున్నట్లు సమాచారం.
సర్జరీ కోసం జర్మనీకి
ఈ నేపథ్యంలో సర్జరీ కోసం సూర్యకుమార్ జర్మనీ వెళ్లేందుకు సిద్ధమైనట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం వెలువరించింది. ‘‘సూర్యకుమార్ యాదవ్ స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం అతడు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నాడు.
రానున్న రెండు- మూడు రోజుల్లో అతడు సర్జరీ కోసం జర్మనీలోని మ్యూనిచ్‌కు పయనమవుతాడు. కాబట్టి రంజీ ట్రోఫీ టోర్నీతో పాటు ఐపీఎల్-2024 ఆరంభ మ్యాచ్‌లకు సూర్య దూరంగా ఉంటాడు.
రంజీలు ఆడడు.. ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం!
రంజీల్లో ముంబై తరఫున ఆడటం వీలుపడదు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున కొన్ని మ్యాచ్‌లకు కూడా అతడు అందుబాటులో ఉండడు’’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించినట్లు తెలిపింది.
జూన్‌లోనే టీ20 వరల్డ్‌కప్-2024 మొదలుకానుంది కాబట్టి.. సూర్య పూర్తిగా కోలుకునేలా మేనేజ్‌మెంట్ అన్ని రకాల చర్యలు చేపట్టిందని సదరు వర్గాలు పేర్కొన్నట్లు వెల్లడించింది. కాగా చీలమండ నొప్పి వల్ల సూర్యకుమార్ యాదవ్ ఇప్పటికే అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు.
ఇప్పటికే హార్దిక్ దూరమయ్యాడు!
ఇదిలా ఉంటే.. సూర్య గనుక ఆరంభ మ్యాచ్‌లకు దూరమైతే ముంబై ఇండియన్స్ ఎదురుదెబ్బ తగినట్లే! ఇప్పటికే కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా చీలమండ నొప్పితో ఆటకు దూరంగా ఉన్నాడు. అతడు ఎప్పుడు జట్టుతో చేరతాడన్న అంశంలో స్పష్టత లేదు. ఇప్పుడు సూర్య కూడా దూరం కావడంతో ఇద్దరు కీలక ఆటగాళ్లు లేకుండానే ముంబై ఐపీఎల్-2024 సీజన్‌ను ఆరంభించాల్సి ఉంటుంది.
స్పోర్ట్స్ హెర్నియా అంటే?
WebMD హెల్త్ అండ్ ఫిట్‌నెస్ గైడ్ ప్రకారం.. కండరాల్లో నొప్పి లేదంటే గజ్జల్లో గాయం.. లేదంటే పొట్ట దిగువన(మృదువైన కణజాలం) తీవ్రమైన నొప్పి రావడాన్ని సాధారణంగా స్పోర్ట్స్ హెర్నియాగా వ్యవహరిస్తారు. కేవలం ప్రొఫెషనల్ ప్లేయర్లే గాకుండా.. ఆటలు ఆడే చాలా మందిలో సాధారణంగా కనిపించే సమస్యే ఇది.
మెడికల్ ప్రొఫెషనల్స్ దీనిని స్పోర్ట్స్ హెర్నియా లేదంటే.. అథ్లెటిక్ పబల్గియాగా వ్యవహరిస్తారు. ఇదిలా ఉంటే.. మానవ శరీరంలో నిర్దిష్ట ప్రాంతంలో ఉండాల్సిన అవయవాలు మరొక భాగంలోకి చొచ్చుకువచ్చే స్థితిని సాధారణంగా హెర్నియా అని పిలుస్తారు. స్పోర్ట్స్ హెర్నియా, దీని లక్షణాలు వేర్వేరుగా ఉంటాయి.
చదవండి: అఫ్ఘనిస్తాన్‌తో సిరీస్ కోసం భారత జట్టు ప్రకటన.. రోహిత్, కోహ్లి రీఎంట్రీ, సంజూకు ఛాన్స్