44 మ్యాచ్‌ల తర్వాత... | Sweden Defeats US Womens Soccer Team In Opening Tokyo Olympics Game | Sakshi
Sakshi News home page

44 మ్యాచ్‌ల తర్వాత...

Published Thu, Jul 22 2021 5:07 AM | Last Updated on Thu, Jul 22 2021 5:07 AM

Sweden Defeats US Womens Soccer Team In Opening Tokyo Olympics Game - Sakshi

స్వీడన్‌ క్రీడాకారిణులు సంబరం

టోక్యో: నాలుగుసార్లు ఒలింపిక్‌ పసిడి పతక విజేత అమెరికా మహిళల ఫుట్‌బాల్‌ జట్టుకు టోక్యో ఒలింపిక్స్‌ తొలి మ్యాచ్‌లోనే చుక్కెదురైంది. ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ హోదాలో గోల్డ్‌ మెడల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అమెరికాకు 2016 రియో ఒలింపిక్స్‌ రన్నరప్‌ స్వీడన్‌ జట్టు షాక్‌ ఇచ్చింది. గ్రూప్‌ ‘జి’లో భాగంగా బుధవారం జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో అమెరికా 0–3 గోల్స్‌ తేడాతో స్వీడన్‌ చేతిలో ఓడింది. గత 44 మ్యాచ్‌ల్లో ఓటమెరుగని అమెరికాకు స్వీడన్‌ రూపంలో పరాభవం తప్పలేదు. బ్లాక్‌స్టెనియస్‌ (25వ, 54వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ చేయగా... మరో గోల్‌ను లినా హర్టిగ్‌ (72వ నిమిషంలో) చేసింది. గ్రూప్‌ ‘జి’లోనే జరిగిన మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 2–1తో న్యూజిలాండ్‌పై గెలిచింది.

ఆస్ట్రేలియా ప్లేయర్లు తమెక యలోప్‌ (20వ నిమిషంలో), స్యామ్‌ కెర్‌ (33వ నిమిషంలో) చెరో గోల్‌ సాధించారు. న్యూజిలాండ్‌ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను గబీ రెనీ (90+1వ నిమిషంలో) చేసింది. గ్రూప్‌ ‘ఇ’లో జరిగిన పోరులో బ్రిటన్‌ 2–0 గోల్స్‌తో చిలీపై గెలుపొందింది. బ్రిటన్‌ తరఫున ఎలెన్‌ వైట్‌ (17వ, 72వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ చేసింది. గ్రూప్‌ ‘ఇ’లోనే జపాన్, కెనడా మధ్య జరిగిన మ్యాచ్‌ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. కెనడా ప్లేయర్‌ క్రిస్టినే (12వ నిమిషంలో) గోల్‌ చేయగా... జపాన్‌ క్రీడాకారిణి మనా ఇవబుచి (84వ నిమిషంలో) గోల్‌ చేసింది. గ్రూప్‌ ‘ఎఫ్‌’లో జరిగిన పోరుల్లో నెదర్లాండ్స్‌ 10–3తో జాంబియాపై, బ్రెజిల్‌ 5–0తో చైనాపై గెలిచాయి. ఒలింపిక్స్‌ క్రీడలు అధికారికంగా శుక్రవారం ఆ ఆరంభమ వుతాయి.  అయితే ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లను మాత్రం రెండు రోజుల ముందుగానే ప్రారంభిస్తారు. మరోవైపు మహిళల సాఫ్ట్‌బాల్‌ పోటీలు కూడా బుధవారమే మొదలయ్యాయి. తొలి మ్యాచ్‌లో  డిఫెండింగ్‌ చాంపియన్‌ జపాన్‌ జట్టు 8–1తో ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించింది.


జాత్యహంకారానికి వ్యతిరేకంగా...
ఒలింపిక్స్‌ పోటీల ఆరంభ రోజు మహిళా ఫుట్‌బాల్‌ ప్లేయర్లు జాత్యహంకారానికి వ్యతిరేకంగా తమ నిరసనను తెలియజేశారు. బ్రిటన్, చిలీ మధ్య మ్యాచ్‌ ఆరంభానికి ముందు రెండు జట్ల క్రీడాకారిణులు మోకాలిపై కూర్చొని జాతి వివక్ష అంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం అమెరికా, స్వీడన్‌ ప్లేయర్లు కూడా ఈ విధంగానే చేశారు.  ఒలింపిక్స్‌ మొదలవ్వడానికి రెండు రోజుల ముందే మహిళల ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు ఆరంభమయ్యాయి. బుధవారం మొదటి రౌండ్‌ తొలి అంచె మ్యాచ్‌లు జరిగాయి. మొత్తం 12 జట్లు పోటీలో ఉండగా.... గ్రూప్‌కు నాలుగు జట్ల చొప్పున మూడు గ్రూప్‌లు (ఇ, ఎఫ్, జి)గా విభజించారు. ఫురుషుల విభాగంలో నేటి నుంచి మ్యాచ్‌లు ఆరంభమవుతాయి. ఇందులో 16 జట్లు పాల్గొంటుండగా... నాలుగు టీమ్‌లు చొప్పున నాలుగు గ్రూప్‌లుగా (ఎ, బి, సి, డి) విభజించారు. తొలి రౌండ్‌లో భాగంగా ప్రతి గ్రూప్‌లోని ఒక జట్టు మిగిలిన జట్లతో మూడేసి మ్యాచ్‌లను ఆడనుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement