డర్బన్: భారత గడ్డపై వన్డే ప్రపంచకప్‌ను ఎగరేసుకుపోయిన ఆ్రస్టేలియాను పొట్టి ఫార్మాట్‌లో టీమిండియా గట్టి దెబ్బ కొట్టింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో స్టార్లు, అనుభవజ్ఞులు లేకపోయినా... సూర్యకుమార్ సేన టి20 సిరీస్‌ను సాధించింది. ఇప్పుడు కూడా దాదాపు అలాంటి జట్టుతోనే విదేశీ గడ్డపై గట్టి ప్రత్యర్థి అయిన దక్షిణాఫ్రికాతో కఠిన సవాల్‌కు టీమిండియా సై అంటోంది.
రిజర్వ్ బెంచ్ మెరిసేందుకు, ఐపీఎల్ వేలానికి ముందు అందరికంటా పడేందుకు యువ ఆటగాళ్లకు ఇది లక్కీ చాన్స్ అని చెప్పొచ్చు. యశస్వి జైస్వాల్, రుతురాజ్ ఆ్రస్టేలియా బౌలింగ్‌పై తమ సత్తా చాటుకున్నారు. మిడిలార్డర్‌లో రింకూ సింగ్, జితేశ్ శర్మలు కూడా వచ్చిన అవకాశాల్ని వినియోగించుకున్నారు. ఇదంతా బాగున్నప్పటికీ సిరీస్ స్వదేశంలో జరిగింది. ఇప్పుడు విదేశీ గడ్డపై యంగ్ ఇండియా ఏ మేరకు రాణిస్తుందనేది అసక్తికరంగా మారింది.
గిల్, జడేజా రావడంతో...
ఆసీస్‌పై విజయవంతమైన జట్టుకు తాజాగా రెగ్యులర్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్, సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, సీమర్ సిరాజ్‌లు కలవడం టీమిండియాకు కచ్చితంగా కలిసొచ్చే అంశం. ఓపెనింగ్‌లో రుతురాజ్ ఫామ్‌లో ఉండటం, టాపార్డర్‌లో శ్రేయస్ అయ్యర్ అందుబాటులో ఉండటం ప్రత్యర్థి బౌలింగ్‌కు ఇబ్బందికరం. దీంతో బ్యాటింగ్ ఆర్డర్ ఇంకాస్త పటిష్టంగా మారింది. రవిబిష్ణోయ్, అర్ష్ దీప్‌లతో బౌలింగ్ విభాగం కూడా మెరుగైన స్థితిలో ఉంది. సీనియర్లు రోహిత్ శర్మ, కోహ్లి, రాహుల్‌లు లేని జట్టును ఆల్‌రౌండ్ నైపుణ్యంతో కూడిన జట్టు ముందుకు తీసుకెళ్తుందనడంలో ఎవరికీ ఏ సందేహం లేదు.
మార్క్‌రమ్ సారథ్యంలో...
దక్షిణాఫ్రికా కూడా పలువురు సీనియర్ ఆటగాళ్లు బవుమా, రబడా, నోర్జే, ఇన్‌గిడి గైర్హాజరీలో కొత్త ముఖాలతో బరిలోకి దిగుతుంది. మార్క్‌రమ్ నేతృత్వంలోని సఫారీ జట్టుకు సొంతగడ్డ అనుకూలతలు ఉన్నప్పటికీ టి20 ఫార్మాట్‌లో ఏదైనా సాధ్యమే! హెండ్రిక్స్, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్‌లు ధనాధన్ ఆటలో మెరిపించే సత్తా ఉన్నవారు. కొయెట్జీ, షమ్సీ, కేశవ్ మహరాజ్‌లు బౌలింగ్‌లో ఇటీవల నిలకడగా రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ సమరం తప్పదు.
పిచ్–వాతావరణం
టి20లకు సరిపోయే పిచ్. బ్యాటింగ్‌కు అనుకూలమైనప్పటికీ ఉదయం వాన ముప్పుతో ఆరంభంలో నెమ్మదించే అవకాశముంది. అయితే మ్యాచ్ సమయానికల్లా (రాత్రి) వర్షం బెడద ఉండకపోవచ్చు.
జట్లు (అంచనా)
భారత్: సూర్యకుమార్ (కెప్టెన్ ), గిల్, రుతురాజ్, అయ్యర్, రింకూ సింగ్, జితేశ్ శర్మ, జడేజా, దీపక్ చహర్, కుల్దీప్ / రవి బిష్ణోయ్, సిరాజ్, అర్‡్షదీప్.
దక్షిణాఫ్రికా: మార్క్‌రమ్ (కెప్టెన్), హెండ్రిక్స్, బ్రీట్జ్‌కే, స్టబ్స్ / క్లాసెన్, మిల్లర్, ఫెరీరా, జాన్సెన్, కేశవ్ మహరాజ్, కొయెట్జీ, బర్గర్, షమ్సీ
Comments
Please login to add a commentAdd a comment