
ICC Mens T20 World Cup 2022- Final Pakistan vs England: పొట్టి ఫార్మాట్ క్రికెట్‌లో ఇంగ్లండ్ మరోసారి జగజ్జేతగా నిలిచింది. 2010లో పాల్ కాలింగ్ వుడ్ బృందం ట్రోఫీ గెలవగా.. బట్లర్ సేన టీ20 ప్రపంచకప్-2022 కప్‌ను సొంతం చేసుకుంది. దీంతో మరోసారి వరల్డ్‌కప్ టైటిల్ గెలవాలన్న పాక్ ఆశలు అడియాసలయ్యాయి. ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆదివారం ఇంగ్లండ్- పాకిస్తాన్ ప్రపంచకప్ ఫైనల్లో తలపడ్డాయి.
సామ్ కరన్ అదరగొట్టాడు
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు ఇంగ్లండ్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఐదో ఓవర్ రెండో బంతికి ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్(14 బంతుల్లో 15 పరుగులు)ను అవుట్ చేసి సామ్ కరన్ పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పతనానికి బాటలు పరిచాడు.
ఇక ఆదిల్ రషీద్, బెన్ స్టోక్స్, క్రిస్ జోర్డాన్ తమ వంతు సాయం చేశారు. సామ్ అత్యధికంగా 3, రషీద్, జోర్డాన్ చెరో రెండు వికెట్లు తీయగా.. స్టోక్స్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది.
పాక్ బ్యాటర్లలో కెప్టెన్ బాబర్ ఆజం 32, షాన్ మసూత్ 38 పరుగులతో రాణించారు. రిజ్వాన్ 15 పరుగులు చేయగా.. షాదాబ్ ఖాన్ 20 రన్స్ తీశాడు. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు.
ఆదిలోనే షాక్.. అయినా
ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను ఆదిలోనే కోలుకోలేని దెబ్బ కొట్టాడు షాహిన్ ఆఫ్రిది. టీమిండియాతో సెమీస్‌లో హీరోగా నిలిచిన ఓపెనర్ అలెక్స్ హేల్స్(1)ను తొలి ఓవర్లోనే బౌల్డ్ చేశాడు.
ఆ తర్వాత హ్యారీస్ రవూఫ్ ఫిలిప్ సాల్ట్(10)ను పరుగులకే పెవిలియన్‌కు చేర్చాడు. బట్లర్(26) వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో పవర్ ప్లేలో 49 పరుగులు చేసిన ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయింది. 10 ఓవర్లు ముగిసే సరికి 77 పరుగులతో పటిష్టంగా కనిపించినా.. ఆ తర్వాతి ఓవర్లలో పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.
భయపెట్టిన పాక్ బౌలర్లు.. ఆదుకున్న స్టోక్స్
దీంతో 11వ ఓవర్లో 2, 12వ ఓవర్లో 3, 13వ ఓవర్లో 5, 14వ ఓవర్లో 2 పరుగులు మాత్రమే చేసింది ఇంగ్లండ్. ఈ క్రమంలో మరో రెండు వికెట్లు పడినా ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(52) ఆచితూచి ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. మహ్మద్ వసీం జూనియర్ బౌలింగ్‌లో సింగిల్ తీసి ఇంగ్లండ్ గెలుపును ఖరారు చేశాడు.
ఈ క్రమంలో ఐదు వికెట్లతో పాక్‌ను చిత్తు చేసిన బట్లర్ బృందం టీ20 ప్రపంచకప్-2022 చాంపియన్‌గా అవతరించింది. సామ్ కరన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా మూడేళ్ల కాలంలో ఇంగ్లండ్ ఐసీసీ టైటిల్ గెలవడం ఇది రెండోసారి. 2019లో వన్డే వరల్డ్‌కప్.. తాజాగా పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది ఇంగ్లిష్ జట్టు.
టీ20 ప్రపంచకప్ 2022: ఫైనల్ పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ స్కోర్లు:
టాస్: ఇంగ్లండ్... ఫీల్డింగ్
పాకిస్తాన్: 137/8 (20)
ఇంగ్లండ్: 138/5 (19)
ఐదు వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీ కైవసం చేసుకున్న ఇంగ్లండ్
చదవండి: Chris Jordan: ఒకసారి అంటే పర్లేదు.. రెండోసారి కూడా అదే తప్పు