T20 WC 2022: No Ball Drama On Final Delivery Of Bangladesh Vs Zimbabwe Match - Sakshi
Sakshi News home page

BAN VS ZIM: క్రికెట్‌ చరిత్రలో ఇలా తొలిసారి.. నాటకీయంగా నో బాల్‌ ప్రకటన

Published Sun, Oct 30 2022 3:22 PM | Last Updated on Sun, Oct 30 2022 5:15 PM

T20 WC 2022: No Ball Drama On Final Delivery Of Bangladesh Vs Zimbabwe Match - Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022 సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. క్వాలిఫయర్స్‌ తొలి మ్యాచ్‌లో ఆసియా ఛాంపియన్‌ శ్రీలంకకు పసికూన నమీబిమా షాకివ్వగా.. ఆ మరుసటి రోజే మరో చిన్న జట్టు స్కాట్లాండ్‌.. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ వెస్టిండీస్‌ను మట్టికరిపించి సంచలనం సృష్టించింది. ఆతర్వాత అక్టోబర్‌ 21న వెస్టిండీస్‌కు మరో పరాభవం ఎదురైంది. అండర్‌ డాగ్‌ ఐర్లాండ్‌్‌.. వెస్టిండీస్‌ను 9 వికెట్ల భారీ తేడాతో ఓడించి, తమను తక్కువ అంచనా వేస్తే ఎంతటి జట్టుకైనా ఇదే గతి అని పెద్ద జట్లకు అలర్ట్‌ మెసేజ్‌ పంపింది. 

సంచనాలు క్వాలిఫయర్స్‌ దశకే పరిమితమయ్యాయనుకుంటే పొరబడ్డట్టే. సూపర్‌-12 దశలోనూ సంచలన విజయాల జైత్రయాత్ర కొనసాగింది. అక్టోబర్‌ 26న జరిగిన గ్రూప్‌-1 మ్యాచ్‌లో లెజెండ్‌ కిల్లర్‌ ఐర్లాండ్‌.. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో హాట్‌ ఫేవరెట్‌ ఇంగ్లండ్‌కు షాకిచ్చింది. ఐర్లాండ్‌ విజయానికి వరుణుడు పరోక్షంగా సహకరించినప్పటికీ.. విజయాన్ని విజయంగానే పరిగణించాలి. ఈ మ్యాచ్‌ తర్వాత అక్టోబర్‌ 27న మరో పెను సంచలనం నమోదైంది. పసికూన జింబాబ్వే.. పాకిస్తాన్‌ను ఒక్క పరుగు తేడాతో మట్టికరిపించి, దాయాదిని చావుదెబ్బ కొట్టింది.

ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్‌ ఇలాంటి సంచలన విజయాలకే కాక మరెన్నో హైడ్రామాలకు నెలవుగా మారింది. భారత్‌-పాక్, సౌతాఫ్రికా-జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో చాలా నాటకీయ  పరిణామాలు చూశాం. అలాంటిదే ఇవాళ (అక్టోబర్‌ 30) జరిగిన బంగ్లాదేశ్‌-జింబాబ్వే మ్యాచ్‌లోనూ చోటు చేసుకుంది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 3 పరుగుల తేడాతో గెలుపొందింది. 

అయితే మ్యాచ్‌ చివరి ఓవర్‌లో నెలకొన్న హైడ్రామాను క్రికెట్‌ ప్రేమికులు మునుపెన్నడూ కని ఎరుగరు. జింబాబ్వే గెలుపుకు చివరి ఓవర్‌లో 16 పరుగులు అవసరమైన సమయంలో బంతి మొసద్దెక్‌ హుస్సేన్‌ అందుకున్నాడు. తొలి 5 బంతులకు 11 పరుగులు రాగా.. ఆఖరి బంతికి జింబాబ్వే విజయానికి 5 పరుగులు అవసరమయ్యాయి. ఆఖరి బంతికి ముజరబానీ స్టంపౌట్‌ కావడంతో బంగ్లాదేశ్‌ గెలుపు సంబురాల్లో మునిగి తేలిపోయింది.

ఇక్కడే అసలు ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ముజరబానీని స్టంపౌట్‌ చేసే క్రమంలో బంగ్లా వికెట్‌ కీపర్‌ బంతిని స్టంప్స్‌కు ముందే కలెక్ట్‌ చేసుకోవడంతో థర్డ్‌ అంపైర్‌ నో బాల్‌గా ప్రకటించాడు. దీంతో జింబాబ్వేకు ఫ్రీ హిట్‌ లభించింది. అయితే ఫ్రీ హిట్‌ బంతికి ఒక్క పరుగు కూడా చేయలేకపోవడంతో జింబాబ్వే ఓటమిపాలైంది. 

స్కోర్‌ వివరాలు..
బంగ్లాదేశ్‌: 150/7 (20 ఓవర్లు)
జింబాబ్వే: 147/8 (20 ఓవర్లు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement