టీమిండియా
ICC Mens T20 World Cup 2022- Final Prediction: టీ20 ప్రపంచకప్-2022 తుది అంకానికి చేరుకుంటోంది. సూపర్-12లో భాగమైన ఎనిమిది జట్లు సెమీస్ బెర్తు కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి. మరోవైపు ఈ ఎడిషన్‌లో వర్షం సైతం జట్ల తలరాతను ప్రభావితం చేసే అంశంగా పరిణమించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా గ్రూప్-2లో ఆదివారం(నవంబరు 6) నాటి మ్యాచ్‌లు ముగిసేదాకా సెమీస్ చేరే జట్లేవో చెప్పలేని పరిస్థితి.
బుమ్రా లేకున్నా
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాతో పాటు ఫైనల్ చేరే జట్టు ఇదేనంటూ అంచనా వేశాడు. ఈ మేరకు ఐసీసీ వెబ్‌సైట్ కాలమ్‌లో.. ‘‘ఆస్ట్రేలియా కొన్ని విభాగాల్లో కాస్త వెనుకబడి ఉంది. మరోవైపు టీమిండియా జస్‌ప్రీత్ బుమ్రా సేవలు కోల్పోయింది.
అయినప్పటికీ ఈ రెండు జట్లు తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఫైనల్ మ్యాచ్‌ను నేరుగా వీక్షించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఈ టోర్నీ ఆసాంతం స్టేడియం ప్రేక్షకులతో కిక్కిరిసిపోతోంది.
కచ్చితంగా చెప్పలేం.. అయితే
కొన్ని మ్యాచ్‌లకు అంతరాయం కలిగినా ఇండియా- పాకిస్తాన్ వంటి మ్యాచ్‌లు పూర్తి వినోదం అందించాయి. నిజానికి ఫైనల్ ఆడేందుకు మెల్‌బోర్న్‌కు ఏ జట్లు వెళ్తాయో ఎవరూ కరెక్ట్‌గా చెప్పలేరు. అయితే, ఆస్ట్రేలియా తన మార్గాన్ని సుగమం చేసుకుంటుందని భావిస్తున్నా.
సౌతాఫ్రికా కూడా ప్రమాదకర జట్టే. అయితే, నేను ముందు నుంచి చెప్తున్నట్లుగానే ఇండియా- ఆస్ట్రేలియా మధ్యే ఫైనల్ జరుగుతుందని అనుకుంటున్నా’’ అని పాంటింగ్ రాసుకొచ్చాడు. కాగా గ్రూప్-2లో ఉన్న టీమిండియా ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్‌లలో 3 గెలిచి ఆరు పాయింట్లతో టాపర్‌గా ఉండగా.. గ్రూప్-1లో ఆస్ట్రేలియా నాలుగింట రెండు గెలిచి ఐదు పాయింట్లతో ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది.
ఇక ఇదే గ్రూపులో ఉన్న న్యూజిలాండ్ మెరుగైన రన్‌రేటుతో 7 పాయింట్లతో టాపర్‌గా కొనసాగుతోంది. మరోవైపు ఇంగ్లండ్ ఆసీస్ కంటే మెరుగైన రన్‌రేటుతో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆసీస్ సెమీస్ చేరడమే కష్టంగా మారనుంది. ఈ నేపథ్యంలో పాంటింగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా నవంబరు 13న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ప్రపంచకప్ ఫైనల్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే.
చదవండి: NZ Vs IRE: ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఐరిష్ బౌలర్! భువీని సైతం వెనక్కి నెట్టి
ఐసీసీ భారత్‌కు సపోర్ట్ చేస్తోంది.. వారికి ఉత్తమ అంపైర్ అవార్డులు ఇవ్వాలంటూ పాక్ మాజీ ప్లేయర్ అక్కసు
Comments
Please login to add a commentAdd a comment