టీ20 వరల్డ్‌కప్-2024 సెమీఫైనల్లో భారత జట్టు అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా సెయింట్ లూసియా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. గ్రూపు-1 నుంచి తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు మాత్రమే చేయగల్గింది.
ఓ దశలో ట్రావిస్ హెడ్ క్రీజులో ఉన్నంతసేపు ఆసీస్‌దే విజయమని అంతా భావించారు. కానీ 17 ఓవర్ వేసిన బుమ్రా అద్బుతమైన బంతితో హెడ్‌ను బోల్తా కొట్టించడంతో మ్యాచ్ స్వరూపామే మారిపోయింది. అంతకుముందు ఓవర్ అర్ష్‌దీప్ కూడా అద్బుతంగా బౌలింగ్ చేశాడు. ఇక ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్(76) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మార్ష్(37) పరుగులతో పర్వాలేదన్పించాడు.
భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ రెండు, బుమ్రా, అక్షర్ పటేల్ తలా ఒక్క వికెట్ సాధించారు. ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(92) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సూర్యకుమార్ యాదవ్(31), శివమ్ దూబే(28) పరుగులతో రాణించారు.
ఆసీస్ బౌలర్లలో స్టార్క్, స్టోయినిష్ తలా రెండు వికెట్లు సాధించగా.. హాజిల్ వుడ్ తలా వికెట్ పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైన ఆస్ట్రేలియా.. అఫ్గానిస్తాన్-బంగ్లాదేశ్ ఫలితం కోస ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బంగ్లాదేశ్‌పై అఫ్గానిస్తాన్ గెలిస్తే ఆసీస్ ఇంటిముఖం పడుతోంది. గ్రూపు-1 నుంచి రెండో జట్టుగా అఫ్గానిస్తాన్ సెమీస్‌కు చేరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment