![T20 WC: Adam Zampa Tests Covid Positive Ahead Of Sri Lanka Clash - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/25/Untitled-2.jpg.webp?itok=-mwdn8BM)
టీ20 వరల్డ్‌కప్-2022 ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో చావుదెబ్బ తిన్న ఆస్ట్రేలియాకు శ్రీలంకతో ఇవాళ (అక్టోబర్ 25) జరుగబోయే కీలక పోరుకు ముందు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా కోవిడ్ బారిన పడ్డాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ధృవీకరించింది. జంపా.. తేలికపాటి జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నాడని, అతన్ని తుది జట్టుకు ఎంపిక చేయాలా వద్దా అన్న దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సీఏ పేర్కొంది.
జంపా కీలక బౌలర్ కావడంతో, కరోనా లక్షణాలు కూడా స్వల్పంగా ఉండటంతో అతన్ని తుది జట్టులోకి ఎంపిక చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సీఏకు చెందిన అధికారి ఒకరు వెల్లడించారు. ఒకవేళ ఆసీస్ యాజమాన్యం జంపాను పక్కకు పెట్టాలని భావిస్తే, అతని స్థానంలో ఆస్టన్ అగర్ జట్టులోకి వస్తాడని అతను తెలిపాడు. కాగా, కోవిడ్ బారిన పడ్డ ఆటగాళ్లు కూడా బరిలోకి దిగవచ్చని ఇటీవలే ఐసీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 23న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ ఆల్‌రౌండర్ జార్జ్ డాక్రెల్ కోవిడ్ నిర్ధారణ అయినప్పటికీ బరిలోకి దిగాడు.
ఇదిలా ఉంటే, తొలి మ్యాచ్‌లోనే కివీస్ చేతిలో ఓడి సెమీస్ చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న ఆస్ట్రేలియా.. లంకతో జరగాల్సిన మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రూప్ ఆఫ్ డెత్‌గా పరిగణించే గ్రూప్-1లో అన్ని జట్లు పటిష్టమైనవే కావడంతో సెమీస్ బెర్తులకు తీవ్ర పోటీ ఎదురవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఆసీస్ తొలి మ్యాచ్‌లో ఓడటంతో తదుపరి జరిగే 4 మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సి ఉంటుంది.
చదవండి: ఆసీస్ వర్సెస్ శ్రీలంక.. మ్యాక్స్‌వెల్ మెరుస్తాడా? హసరంగా మ్యాజిక్ చేస్తాడా?
Comments
Please login to add a commentAdd a comment