T20 World Cup WI Vs ZIM: West Indies Beat Zimbabwe By 31 Runs, Check Score Details - Sakshi
Sakshi News home page

T20 WC 2022 WI VS ZIM: డూ ఆర్‌ డై మ్యాచ్‌లో విండీస్‌ ప్రతాపం.. సూపర్‌-12 ఆశలు సజీవం

Published Wed, Oct 19 2022 5:18 PM | Last Updated on Thu, Oct 20 2022 2:12 AM

T20 WC: Alzarri Joseph Takes Four As West Indies Beat Zimbabwe By 31 Runs - Sakshi

హోబర్ట్‌:  వెస్టిండీస్‌ దారిలో పడే విజయం సాధించింది. టి20 ప్రపంచకప్‌ తొలిరౌండ్‌ గ్రూప్‌ ‘బి’లో జింబాబ్వేపై తప్పక గెలవాల్సిన పోరులో ఓపెనర్‌ చార్లెస్‌ (36 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా, బౌలింగ్‌లో అల్జారీ జోసెఫ్‌ (4/16), జేసన్‌ హోల్డర్‌ (3/12) నిప్పులు చెరిగారు. రెండు సార్లు వరల్డ్‌ చాంపియన్‌ అయిన విండీస్‌ 31 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించి ‘సూపర్‌ 12’ ఆశల్ని సజీవంగా నిలబెట్టుకుంది.

మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. కరీబియన్‌ టాపార్డర్‌లో ఓపెనర్‌ కైల్‌ మేయర్స్‌ (12 బంతుల్లో 13; 2 ఫోర్లు), వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఎవిన్‌ లూయిస్‌ (18 బంతుల్లో 15; 1 ఫోర్‌) నిరాశపరిచారు. కానీ మరో ఓపెనర్‌ జాన్సన్‌ చార్లెస్‌ 13 ఓవర్లదాకా క్రీజులో నిలిచాడు.

జట్టు స్కోరు 97 పరుగుల వద్ద అతను అవుట్‌ కాగానే... జింబాబ్వే బౌలర్‌ సికందర్‌ రజా (3/19) ఒకే ఓవర్లో బ్రూక్స్‌ (0), హోల్డర్‌ (4)లను పెవిలియన్‌ చేర్చాడు. దీంతో విండీస్‌ 101 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఆఖరి ఓవర్లలో రోవ్‌మన్‌ పావెల్‌ (21 బంతుల్లో 28; 1 ఫోర్, 2 సిక్స్‌లు), అకీల్‌ హోసిన్‌ (18 బంతుల్లో 23 నాటౌట్‌; 2 ఫోర్లు) ధాటిగా ఆడటంతో 150 పైచిలుకు స్కోరు చేసింది. జింబాబ్వే బౌలర్లలో ముజరబాని 2, సీన్‌ విలియమ్స్‌ ఒక వికెట్‌ తీశారు.

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన జింబాబ్వే 18.2 ఓవర్లలో 122 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్‌ వెస్లీ మదెవెర్‌ (19 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్‌), చివర్లో లూక్‌ జాంగ్వే (22 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుగ్గా ఆడారు. మిగతా వారిలో ఆరుగురు బ్యాటర్స్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. నిజానికి పవర్‌ప్లేలో 4.4 ఓవర్ల వరకు 47/1 స్కోరుతో పటిష్టంగా ఉన్న జింబాబ్వే మరో 11 పరుగుల వ్యవధిలో 4 కీలక వికెట్లను కోల్పోయి 64/5 స్కోరుతో కష్టాల్లో కూరుకుపోయింది. జోసెఫ్, హోల్డర్‌ ధాటికి ఎవరూ క్రీజులో నిలువలేకపోయారు.

ఐర్లాండ్‌ను గెలిపించిన కాంఫర్‌
ఇదే గ్రూపులో జరిగిన మరో పోరులో ఐర్లాండ్‌ 6 వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌పై జయభేరి మోగించింది. ధనాధన్‌ మెరుపులతో టి20 మజా పంచిన ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ కుర్టిస్‌ కాంఫర్‌ (32 బంతుల్లో 72 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) హీరోగా నిలిచాడు. అంతకుముందు స్కాట్లాండ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 176 పరుగులు చేసింది. మైకెల్‌ జోన్స్‌ (55 బంతుల్లో 86; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగాడు. కెప్టెన్‌ బెరింగ్టన్‌ (37; 3 ఫోర్లు, 1 సిక్స్‌), క్రాస్‌ (28; 5 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. తర్వాత ఐర్లాండ్‌ 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసి గెలిచింది. 61/4 స్కోరుతో పరాజయం దిశగా పయనిస్తున్న జట్టును కాంఫర్, జార్జ్‌ డాక్రెల్‌ (37 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అబేధ్యమైన ఐదో వికెట్‌కు 119 పరుగులు జోడించి గెలిపించారు.

‘బి’లో అందరూ రేసులో...
గ్రూప్‌ ‘బి’ అందరిని ఊరిస్తోంది. ఇందులో ఉన్న స్కాట్లాండ్, జింబాబ్వే, విండీస్, ఐర్లాండ్‌ రెండేసి మ్యాచ్‌లాడాయి. అన్నీ జట్ల ఖాతాలో ఒక విజయం, 2 పాయింట్లు ఉన్నాయి. దీంతో ఈ నాలుగు జట్లు శుక్రవారం ఆడే రెండు లీగ్‌ మ్యాచ్‌లు నాకౌట్‌గా మారాయి. రేపు ఐర్లాండ్‌తో విండీస్, స్కాట్లాండ్‌తో జింబాబ్వే తలపడతాయి. గెలిచిన రెండు జట్లు ‘సూపర్‌ 12’కు అర్హత సంపాదిస్తాయి.

గ్రూప్‌ ‘ఎ’లో నేటి మ్యాచ్‌లు
 శ్రీలంక vs నెదర్లాండ్స్‌ (ఉ.గం. 9:30 నుంచి)
 నమీబియ్ఠా vs యూఏఈ (మ.గం. 1:30 నుంచి) స్టార్‌ స్పోర్ట్స్‌–2లో ప్రత్యక్ష ప్రసారం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement