డెవాన్ కాన్వే (PC: PTI)
పొట్టి ఫార్మాట్ వల్ల క్రికెట్ నాశనమవడం ఖాయమని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఆందోళన వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల మెదళ్లలో టీ20 అనే విషం నిండిపోవడం వల్ల సంప్రదాయ క్రికెట్‌కు ఆదరణ తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. లీగ్ క్రికెట్ వల్ల ఆయా బోర్డులు, ఆటగాళ్లకు డబ్బులు వస్తాయని.. అయితే, ఆటకు మాత్రం నష్టం చేకూరుతుందని పేర్కొన్నాడు.
కాగా ఇటీవలి కాలంలో లీగ్ క్రికెట్ ఆడేందుకు చాలా మంది ప్లేయర్లు సెంట్రల్ కాంట్రాక్టును వదులుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా న్యూజిలాండ్ క్రికెటర్లలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ సహా ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్ ఇప్పటికే కాంట్రాక్టును వదులుకోగా.. డెవాన్ కాన్వే, ఫిన్ అలెన్ సైతం గురువారం ఇందుకు సంబంధించి తమ నిర్ణయాన్ని వెల్లడించారు.
కాసుల వర్షం వల్లే
ఫ్రాంఛైజీ క్రికెట్ ఒప్పందాల దృష్ట్యా కాంట్రాక్ట్ రెన్యువల్‌పై సంతకం చేసేందుకు వీరిద్దరు నిరాకరించారని కివీస్ బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై స్పందించిన పాకిస్తాన్ మాజీ బ్యాటర్ బసిత్ అలీ యూట్యూబ్ చానెల్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘శ్రీలంకతో సిరీస్ సందర్భంగా న్యూజిలాండ్ జట్టుకు అందుబాటులో ఉండబోనని కాన్వే చెప్పాడు.
మరో క్రికెటర్ కూడా ఇదే మాట అంటున్నాడు. ఇది కేవలం న్యూజిలాండ్ బోర్డు సమస్య మాత్రమే కాదు. క్రమక్రమంగా అన్ని దేశాల బోర్డులకు ఇలాంటి తలనొప్పులు వస్తాయి. పాకిస్తాన్ ప్లేయర్లు కూడా ఇదే బాటలో నడిచినా ఆశ్చర్యం లేదు. ఫ్రాంఛైజీ క్రికెట్ కురిపించే కాసుల వర్షం వల్లే ఆటగాళ్లు అటువైపు ఆకర్షితులవుతున్నారు.
ఇండియా లక్కీ
నిజానికి ఈ విషయంలో ఇండియా లక్కీ అనే చెప్పాలి. ఎందుకంటే.. భారత ఆటగాళ్లు ఐపీఎల్ మినహా ఇతర టీ20 టోర్నమెంట్లు ఆడరు. ఏదేమైనా టీ20 పిచ్చి.. ఇక్కడితో ఆగదు. క్రికెట్‌ను.. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌ను నాశనం చేస్తుంది. గంటల తరబడి క్రీజులో నిలబడే బ్యాటర్ల పాలిట ఇదొక విషం లాంటిది. ఇండియా మినహా దాదాపు అన్ని దేశాల జట్లు టీ20 క్రికెట్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. డబ్బు వస్తోంది.. కానీ సంప్రదాయ క్రికెట్ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది’’ అని బసిత్ అలీ ఆందోళన వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment