T20 World Cup 2021- Adam Zampa Says He Has Always Been Underestimated: టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడం జంపా. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో 12 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఆసీస్‌ను సెమీ ఫైనల్ చేర్చడంలో కీలకంగా వ్యవహరించాడు. ముఖ్యంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు.
అంతేకాదు పాకిస్తాన్‌తో కీలకమైన సెమీ ఫైనల్‌లో ఒక వికెట్ తీసి ఆసీస్ తుదిపోరుకు అర్హత సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో నవంబరు 14న న్యూజిలాండ్‌తో ఫైనల్‌లో ఆడేందుకు ఆడం జంపా సన్నద్ధమవుతున్నాడు.
అయితే, ఈ మెగా ఈవెంట్‌లో ఆస్ట్రేలియాకు కీలకంగా మారి సత్తా చాటుతున్న ఆడం జంపా.. తనను ఎల్లప్పుడూ తక్కువగానే అంచనా వేస్తానని అంటున్నాడు. వరల్డ్‌కప్ ఆరంభానికి ముందు కరోనా కాలంలో ఇంటికే పరిమితమైన తాను స్థానిక టీనేజర్లకు బౌలింగ్ చేస్తూ ప్రాక్టీసు చేశానని తెలిపాడు. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియాతో మాట్లాడుతూ.. ‘‘నన్నెప్పుడూ అండర్‌ఎస్టిమేట్ చేస్తారనుకుంటాను. పదిహేను, పదహారేళ్ల కుర్రాడిగా ఉన్ననాటి నుంచి... నా కంటే మెరుగ్గా బౌలింగ్ చేయగల వాళ్లు ఉన్నారని భావిస్తా.
అంతెంతుకు ఈ టోర్నమెంట్ తర్వాత కూడా... మరో సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతున్న క్రమంలోనూ ఇలాగే జరుగుతుంది. తద్వారా నన్ను నేను మరింత మెరుగుపరచుకోగలను’’ అని జంపా చెప్పుకొచ్చాడు. ఇక తన బలాలు, బలహీనతలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి టీ20 వరల్డ్‌కప్‌లో మెరుగ్గా రాణించేందుకు కృషి చేస్తున్నానని చెప్పుకొచ్చాడు.
ఇక సెమీస్ హీరో మార్కస్ స్టొయినిస్ ఆడం జంపా గురించి చెబుతూ... అతడిని అత్యంత నిజాయితీ గల ఆటగాడిగా అభివర్ణించాడు. పాకిస్తాన్‌తో సెమీ ఫైనల్‌లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడని ప్రశంసించాడు. కాగా ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో 22 పరుగులు ఇచ్చిన జంపా.. కీలకమైన బాబర్ ఆజమ్ వికెట్ తీసి సత్తా చాటిన సంగతి తెలిసిందే.
చదవండి: T20 WC 2021: పాపం కివీస్.. టి20 ప్రపంచకప్ కొట్టినా నెంబర్‌వన్ కాకపోవచ్చు.. టీమిండియాను ఓడిస్తేనే
Comments
Please login to add a commentAdd a comment