T20 World Cup 2021: ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి వరల్డ్ టీ20 మొట్టమొదటి జగజ్జేతగా నిలిచిన టీమ్... మేటి ఆటగాళ్లు గల జట్టు... అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తున్న వైనం... అన్నింటికీ మించి.. మెంటార్‌గా... చివరి నిమిషంలో కూడా ప్రత్యర్థి ఎత్తులను చిత్తు చేసి, ఊహకందని వ్యూహాలు రచించగల.. చాణక్యం తెలిసిన మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని... వెరసి ఈసారి పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది విరాట్ కోహ్లి సేన.
సామాన్య క్రీడాభిమానులే కాదు... ఎంతో మంది దిగ్గజాలు, పోటీలో పాల్గొనే జట్లకు చెందిన స్టీవ్ స్మిత్ వంటి ఆటగాళ్లు సైతం టైటిల్ ఫేవరెట్ టీమిండియానే అని చెబుతున్న తరుణం... మరి ఇన్ని అంచనాల నడుమ దాయాది పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో వరల్డ్‌కప్ వేట మొదలుపెడుతున్న భారత జట్టులో ఎవరి రికార్డు ఎలా ఉంది? కెప్టెన్‌గా మొట్టమొదటి.. చివరి టీ20 ప్రపంచకప్ ఆడనున్న కోహ్లికి ఈ టోర్నీ మధుర జ్ఞాపకంగా నిలుస్తుందా?!
►ఐసీసీ మెగా టోర్నీ సూపర్ 12 దశకు నేరుగా అర్హత సాధించిన టీమిండియా.. గ్రూప్-2లో ఉంది.
15 మంది సభ్యులతో బీసీసీఐ ప్రకటించిన జట్టు:
విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చహర్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ.
రిజర్వు ప్లేయర్లు: శ్రేయస్ అయ్యర్, దీపక్ చహర్, అక్షర్ పటేల్.
మెంటార్: ఎంఎస్ ధోని
►ఇలా మొత్తంగా ఐదుగురు బ్యాటర్లు, ముగ్గురు ఆల్‌రౌండర్లు, ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లు, ఒక వికెట్ కీపర్(రిషభ్ పంత్).. ఇలా సమతౌల్యమైన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు.
వారే ఓపెనర్లు..
వార్మప్ మ్యాచ్‌లలో ఓపెనింగ్ స్థానాల్లో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌లను బరిలోకి దించారు. అయితే, మేజర్ టోర్నీలో కేఎల్, హిట్‌మ్యాన్‌ను పంపుతామని ఇప్పటికే కోహ్లి ప్రకటించాడు.
విరాట్ కోహ్లి(కెప్టెన్)(Virat Kohli)
కెప్టెన్‌గా పలు చిరస్మరణీయ విజయాలు అందించినప్పటికీ ఇంతవరకు ఐసీసీ ట్రోఫీ గెలవలేదన్న లోటు కోహ్లికి ఉంది. అయితే, బ్యాటర్‌గా మాత్రం అతడికి తిరుగులేదు. ముఖ్యంగా... టీ20 ఫార్మాట్.. వరల్డ్‌కప్ ఈవెంట్లలో కోహ్లికి మంచి రికార్డు ఉంది. 2014, 2016 టోర్నీలలో ఈ ‘రన్ మెషీన్’ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలవడం విశేషం.
అయితే, అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సుదీర్ఘ కాలం టాప్‌లో కొనసాగిన కోహ్లి.. ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నాడు. చాలా రోజులుగా అతడి ఖాతాలో సెంచరీ లేకపోవడం గమనార్హం. ఇక ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకడైన కోహ్లి.. ఈ సీజన్‌లో 15 మ్యాచ్‌లలో 15 ఇన్నింగ్స్ ఆడి 405 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు: 72 నాటౌట్.
ఇక తొలి మ్యాచ్‌లో భాగంగా.. టీ20 మెగా టోర్నీలో పాకిస్తాన్‌పై కోహ్లి అజేయ రికార్డు కలిగి ఉండటం తొలి మ్యాచ్‌లో కలిసి వచ్చే అంశం. ఇప్పటి వరకు పాక్‌తో మూడు మ్యాచ్‌ల(2012, 2014,2016)లో ఆడిన కోహ్లి ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. వరుసగా 78, 38, 55 పరుగులతో అజేయంగా నిలిచాడు.
రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్)(Rohit Sharma)
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు ఓపెనర్‌గా మంచి రికార్డు ఉంది. స్ట్రైక్‌రేటు పరంగా చూసినా... అనుభవం దృష్ట్యా.. హిట్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతేగాక సారథిగానూ ఐపీఎల్‌లో అత్యద్భుత రికార్డు రోహిత్ శర్మ సొంతం. ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు విజేతగా నిలిపిన ఘనత అతడిది. ఇక టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ముగిసిన తర్వాత కోహ్లి స్థానంలో రోహిత్ టీ20 పగ్గాలు చేపట్టడం లాంఛనమేనన్న అభిప్రాయాలు ఉన్నాయి.
మరి.. రోహిత్ శర్మ.. కేఎల్ రాహుల్‌తో కలిసి మెరుగైన ఓపెనింగ్ భాగస్వామ్యాలు నమోదు చేస్తే టీమిండియా దూసుకుపోవడం ఖాయమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరో విశేషం ఏమిటంటే... ఇప్పటి వరకు జరిగిన 6 టీ20 వరల్డ్‌కప్‌లలో టీమిండియా తరఫున ఆడిన ఏకైక క్రికెటర్‌గా రోహిత్‌కు ఉన్న అపార అనుభవం అదనపు బలం.
కేఎల్ రాహుల్(KL Rahul)
బ్యాటర్‌గా తన సత్తా ఏమిటో ఇటీవల ముగిసిన ఐపీఎల్-2021 సీజన్‌లో మరోసారి నిరూపించాడు కేఎల్ రాహుల్. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ అయిన అతడు... 13 మ్యాచ్‌లలో 13 ఇన్నింగ్స్ ఆడి.. 626 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 98 నాటౌట్. కేఎల్ రాహుల్ ఫామ్ గురించి చెప్పడానికి ఈ గణాంకాలు చాలు.
ఏ స్థానంలోనైనా ఆడగల సమర్థత రాహుల్‌కు ఉండటం అదనపు బలం. అవసరమైన సమయాల్లో వికెట్ కీపర్‌గా కూడా తన సేవలు అందించగలడు.
సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav)
ఐపీఎల్‌లో తనను తాను నిరూపించుకున్న సూర్యకుమార్ యాదవ్ అందరితో పోలిస్తే కాస్త ఆలస్యంగానే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్‌గా ఉన్న సూర్య... ఈ ఏడాది ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌తో అరంగేట్రం చేశాడు. శ్రీలంక పర్యటనతో వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు.
అయితే, ఈ ఐపీఎల్ సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ(317 పరుగులు).. టోర్నీ చివర్లో ఫామ్‌లోకి రావడం, వార్మప్ మ్యాచ్‌లోనూ రాణించడంశుభపరిణామం. అయితే, తొలిసారి ఐసీసీ టోర్నీ ఆడుతున్న ఒత్తిడిని సూర్య ఎలా అధిగమిస్తాడో చూడాలి!
రిషభ్ పంత్(Rishabh Pant)
టీమిండియా యువ సంచలనం రిషభ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా సత్తా చాటుతూ... ఎంఎస్ ధోని వారసుడిగా పేరొందాడు. ఇక ఇటీవల ముగిసిన ఐపీఎల్-2021లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను టేబుల్ టాపర్‌గా నిలిపి సారథిగానూ మంచి మార్కులే కొట్టేశాడు పంత్. బ్యాటర్‌గానూ 419 పరుగులతో సత్తా చాటాడు.
ఇక టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో వికెట్ కీపర్ బ్యాటర్‌గా పంత్ పాత్ర కీలకం. టెస్టు, వన్డే, టీ20.. ఇలా అన్ని ఫార్మాట్లలో తను మంచి రికార్డు కలిగి ఉన్నపటికీ... కొన్నిసార్లు అనవసర షాట్లు ఆడి.. వికెట్ సమర్పించుకోవడం అతడి బలహీనత.
ఇషాన్ కిషన్(Ishan Kishan)
శిఖర్ ధావన్ స్థానంలో జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు ఈ యువ వికెట్ కీపర్ బ్యాటర్. ముంబై ఇండియన్స్ తరఫున సుదీర్ఘకాలంగా ఐపీఎల్ ఆడుతున్న ఇషాన్ కిషన్... ఈసారి(241 పరుగులు) పెద్దగా రాణించలేదు. కానీ, తనదైన రోజు చెలరేగి ఆడి.. జట్టును విజయతీరాలకు చేర్చగల సత్తా అతడికి ఉంది.
ఇటీవలి వార్మప్ మ్యాచ్‌లోనూ ఇరగదీసి తన విలువేంటో నిరూపించుకున్నాడు. ఇక టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి ఓపెనర్‌గా ఎంపికయ్యావని కోహ్లి తనతో వ్యాఖ్యానించినట్లు వెల్లడించిన ఇషాన్ కిషన్.. అన్నీ కుదిరితే రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం లేకపోలేదు. అన్నట్టు ఇషాన్ కిషన్‌కు ఇదే తొలి వరల్డ్‌కప్.
రవీంద్ర జడేజా(Ravindra Jadeja)
ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా ప్రశంసలు అందుకుంటున్నాడు జడేజా. ఇటు బౌలింగ్‌లోనూ.. అటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటడమే కాదు.. ఫీల్డింగ్‌లోనూ అద్భుత విన్యాసాలతో ఆకట్టుకోగలడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో 227 పరుగులు చేసిన జడ్డూభాయ్... 13 వికెట్లు తీసి.. చెన్నై సూపర్‌కింగ్స్ నాలుగోసారి చాంపియన్‌గా నిలిచే క్రమంలో తనవంతు పాత్ర పోషించాడు. ఇలా జడేజా ఫామ్‌లో ఉండటం శుభపరిణామం.
హార్దిక్ పాండ్యా(Hardik Pandya)
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్లలో హార్దిక్ పాండ్యా ఒకడు. విధ్వంసకర షాట్లతో విరుచుకుపడటం సహా... పదునైన బంతులతో బ్యాటర్లను తిప్పలు పెట్టగల ప్రతిభ అతడి సొంతం. అయితే, గాయం కారణంగా కొన్ని రోజులు జట్టుకు దూరం కావడం... ఇటీవలి ఐపీఎల్(బౌలింగ్ చేయలేకపోయాడు)లోనూ పెద్దగా రాణించకపోవడం కాస్త ఆందోళనకరంగా పరిణమించింది. అయితే, తనదైన రోజున బ్యాటర్‌గా రాణించగల హార్దిక్ ప్రతిభపై కోహ్లి నమ్మకం ఉంచితే తుదిజట్టులో అతడిని చూసే అవకాశాలు ఉంటాయి.
శార్దూల్ ఠాకూర్(Shardul Thakur)
టీమిండియా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనలలో మెరుగ్గా రాణించి తన విలువేమిటో నిరూపించుకున్నాడు శార్దూల్ ఠాకూర్. అంతేకాదు ఐపీఎల్-2021లో విశ్వరూపం ప్రదర్శించి 21 వికెట్లతో చెలరేగాడు. ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు సాధించిన నాలుగో బౌలర్‌గా నిలిచిన ‘షేర్’దూల్.. చెన్నై చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఒత్తిడిలోనూ మెరుగ్గా రాణించి సీఎస్‌కే కెప్టెన్, టీమిండియా టీ20 మెంటార్ ఎంఎస్ ధోని నమ్మకం చూరగొన్న అతడు... చివరి నిమిషంలో బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. అక్షర్ పటేల్ స్థానంలో 15 మంది సభ్యుల్లో ఒకడిగా చేరాడు.
రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin)
వాస్తవానికి టీ20 వరల్డ్‌కప్ జట్టులో అశ్విన్‌కు చోటు దక్కడం అనూహ్యమనే చెప్పాలి. సుమారు నాలుగేళ్ల క్రితం భారత్ తరఫున పొట్టి ఫార్మాట్‌లో ఆడిన అశూను ఎంపిక చేయడం సామాన్యులనే కాదు... క్రీడా విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. ఇంగ్లండ్ టూర్(టెస్టు)లో అశ్విన్‌కు సరైన అవకాశాలు లభించలేదనే కారణంతోనే.. ఇప్పుడు అవకాశం ఇచ్చారా అంటూ కొందరు మాజీలు ప్రశ్నించడం గమనార్హం.
అయితే, అత్యుత్తమ స్పిన్నర్‌గా అశ్విన్‌కు ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకునే ఉద్దేశంతోనే అతడిని ఎంపిక చేశారనడంలో సందేహం లేదు. కానీ... తుదిజట్టులో చోటు దక్కుతుందా లేదా అన్నది ఇప్పుడే ఓ అంచనాకు రాలేం.
జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)
యార్కర్ల కింగ్ బుమ్రా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వైవిధ్యమైన బంతులు విసురుతూ బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో దిట్ట. డెత్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేయడం బుమ్రా బలం. ఇక ఐపీఎల్-2021లో ముంబై తరఫున 21 వికెట్లు పడగొట్టిన బుమ్రా... టీ20 ప్రపంచకప్‌లోనూ తన సత్తా చాటడం ఖాయంగానే కనిపిస్తోంది.
భువనేశ్వర్ కుమార్(Bhuvneshwar Kumar)
స్వింగ్ కింగ్‌గా భువీకి పేరుంది. మ్యాచ్ ఆరంభ, డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ బ్యాటర్లను ఒత్తిడికి గురిచేయడం అతడి బలం. అయితే, ఐపీఎల్-2021లో భువీ ఆశించిన మేర రాణించలేకపోయాడు. ఎస్‌ఆర్‌హెచ్ తరఫున 11 ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు. అయితే, అనుభవం దృష్ట్యా భువీ వంటి పేసర్ తమకు ఎప్పుడూ అవసరమేనని, తన ఎంపిక సరైందనేని కోహ్లి.. టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభానికి ముందు కెప్టెన్ల సమావేశంలో చెప్పడం భువనేశ్వర్ విలువేమిటో చాటుతోంది.
మహ్మద్ షమీ(Mohammed Shami)
ఐపీఎల్‌లో సుదీర్ఘకాలంగా ఆడుతున్న షమీ.. కచ్చితత్వంతో వేగంగా బంతులు విసరడంలో తనకు తానే సాటి. ఇటీవల ముగిసిన ఐపీఎల్-2021లోనూ పంజాబ్ తరఫున ఆడిన షమీ 19 వికెట్లు పడగొట్టాడు.
రాహుల్ చహర్(Rahul Chahar)
రాహుల్ చహర్ ఎంపిక సైతం క్రీడాభిమానులను, కొంతమంది మాజీ ఆటగాళ్లను ఆశ్చర్యానికి గురిచేసింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కీలక బౌలర్ అయిన యజువేంద్ర చహల్‌ను కాదని... రాహుల్‌ను ఎంపిక చేయడమే ఇందుకు కారణం. ఫామ్ లేమిని కారణంగా చూపి.. తనను పక్కన పెట్టిన సెలక్టర్ల నిర్ణయాన్ని తప్పని నిరూపించేలా.. ఐపీఎల్-2021లో ఆర్సీబీ తరఫున 18 వికెట్లు తీసి మెరుగ్గానే రాణించాడు చహల్. అదే సమయంలో... రాహుల్(13 వికెట్లు).. చహల్ స్థానాన్ని భర్తీ చేయగల బౌలర్‌ను అని నిరూపించుకోవడంలో విఫలమయ్యాడు. మరి సెలక్టర్లు తన మీద ఉంచిన నమ్మకాన్ని అతడు నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి.
వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy)
మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారతాడని చాలా మంది మాజీ ఆటగాళ్లు అంచనా వేస్తున్నారు. తన బంతులతో బ్యాటర్లను తికమక పెట్టగల వైవిధ్యమైన బౌలింగ్ శైలి అతడి సొంతం. ఐపీఎల్-2021లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున మైదానంలో దిగిన వరుణ్ చక్రవర్తి... 18 వికెట్లతో సత్తా చాటాడు. ఇక వార్మప్ మ్యాచ్‌లలో వరుణ్‌ను ఆడించకపోవడం చూస్తుంటే... ప్రధాన ఆయుధాన్ని దాచి.. అసలైన సమరంలో అతడిని రంగంలోకి దించి మెరుగైన ఫలితాలు రాబట్టడమే వ్యూహమని తెలుస్తోంది.
- సాక్షి వెబ్‌స్పెషల్
మరి... 2007లో విజేతగా నిలిచినా.. ఆ తదుపరి వరల్డ్‌కప్ అంటే 2009లో తొలి రౌండ్‌లో వెనుదిరిగిన జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకుంది టీమిండియా. అయితే 2010, 2012లో సూపర్ 8, 2014లో రన్నరప్, 2016లో సెమీస్‌కు చేరి సత్తా చాటింది. మరి... కెప్టెన్‌గా కోహ్లికి, కోచ్‌గా రవిశాస్త్రికి చివరిదైన ఈ టీ20 వరల్డ్‌కప్‌ను టీమిండియా గెలుస్తుందంటారా?! మీ అభిప్రాయం చెప్పండి.
Comments
Please login to add a commentAdd a comment