
Shoaib Akhtar Comments On New Zealand Loss Against Pakistan: రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ న్యూజిలాండ్ జట్టుపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. మైదానంలో కూడా భద్రతా కారణాల దృష్ట్యా ఇబ్బంది పడతారేమోనన్న కారణంగానే తొందరగా పెవిలియన్‌కు పంపామన్నట్లుగా సెటైర్లు వేశాడు. ఏదేమైనా శుభాకాంక్షలు అంటూ కేన్ విలియమ్సన్ సేనను టీజ్ చేశాడు. టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో భాగంగా అక్టోబరు 26 నాటి మ్యాచ్‌లో పాకిస్తాన్.. న్యూజిలాండ్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన విషయం తెలిసిందే.
తద్వారా గ్రూపు-2లోని టీమిండియా, న్యూజిలాండ్ వంటి ప్రధాన జట్లను ఓడించి సెమీస్ చేరే మార్గాన్ని సులువు చేసుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించాడు. కివీస్‌పై పాక్ విజయాన్ని హర్షించిన అతడు... భద్రతా కారణాలు చూపి తమ దేశ పర్యటనను రద్దు చేసుకున్న న్యూజిలాండ్‌పై ప్రతీకారం తీర్చుకున్నట్లయిందని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. ఈ మేరకు... ‘‘న్యూజిలాండ్ జట్టుకు శుభాభినందనలు. వాళ్లు పాకిస్తాన్‌కు రాలేదు.
యూఏఈలో సురక్షితంగా ఉన్నారా? అయ్యో... మీకోసం మైదానంలోకి భద్రతా సిబ్బందిని పంపడమే మర్చిపోయాం. నాకు తెలిసి మీరు మైదానంలో అంత సేఫ్‌గా ఉన్నట్లు భావించలేదు అనుకుంటా’’ అని సెటైర్లు వేశాడు. ఇక తమ దేశం గురించి చెబుతూ.. ‘‘పాకిస్తాన్, భారత్... ప్రపంచంలో ఉన్న నా అభిమానులందరికీ ఒక విజ్ఞప్తి.. దయచేసి మీరంతా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకు ఓ ఇ- మెయల్ పంపండి.
పాకిస్తాన్ సురక్షితమైన దేశమే.. కానీ పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో ఆట మాత్రం.. ఇతర జట్లకు అంత శ్రేయస్కరం కాదు’’ అంటూ షోయబ్ అక్తర్ బాబర్ ఆజం బృందాన్ని ఆకాశానికెత్తేశాడు. అదే విధంగా... టీమిండియా ఫైనల్‌కు చేరాలని ఆకాంక్షించిన అక్తర్... భారత్- పాక్ మధ్య తుదిపోరు మరింత ఆసక్తికరంగా సాగుతుందని చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్‌ను ఓడించి కోహ్లి సేనను సేవ్ చేశామని.. నవంబరు 14 వరకు మీకోసం ఎదురుచూస్తామని పేర్కొన్నాడు.
చదవండి: Shoaib Malik: సెలక్టర్ల నిర్ణయం సరైందేనని నిరూపించాడు: జహీర్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment