8 వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం
నెదర్లాండ్స్ నిర్ధేశించిన 45 పరుగుల సునాయాస లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక కేవలం 7.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ పథుమ్ నిస్సంక(0), చరిత్ అసలంక(6) తక్కువ స్కోర్‌కే పెవిలియన్‌కు చేరినప్పటికీ.. కుశాల్ పెరీరా(24 బంతుల్లో 33; 6 ఫోర్లు), అవిష్క ఫెర్నాండో(2)లు జట్టును విజయతీరాలకు చేర్చారు. నెదర్లాండ్స్ బౌలర్లు బ్రాండన్ గ్లోవర్, పాల వాన్ మీకెరెన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో శ్రీలంక గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచి సూపర్ 12లో బలమైన జట్లున్న గ్రూప్-1లో చేరింది. కాగా, క్వాలిఫయర్స్‌లో గ్రూప్-ఏ నుంచి శ్రీలంకతో పాటు నమీబియా సూపర్ 12కు అర్హత సాధించింది.
లంక బౌలర్ల విజృంభణ.. 44 పరుగులకే కుప్పకూలిన నెదర్లాండ్స్
టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక పసికూన నెదర్లాండ్స్‌పై ప్రతాపాన్ని చూపింది. స్పిన్నర్లు వనిందు హసరంగ(3/9), మహీశ్ తీక్షణ(2/3), పేసర్లు లహీరు కుమార(3/7), దుశ్మంత చమీరా(1/13) చెలరేగి బౌల్ చేయడంతో నెదర్లాండ్స్ చిగురుటాకులా వణిపోయింది. కేవలం 10 ఓవర్లు మాత్రమే ఆడి 44 పరగులకే ఆలౌటై, పొట్టి ప్రపంచకప్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో కొలిన్ ఆకెర్‌మెన్(11) మినహా ఏ ఒక్కరూ రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. నెదర్లాండ్స్ స్కోర్‌లో 6 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. కాగా, గ్రూప్-ఏ నుంచి శ్రీలంక ఇదివరకే సూపర్ 12 బెర్త్ ఖరారు చేసుకోగా.. నెదర్లాండ్స్ ఈ మ్యాచ్ జయాపజయాలతో సంబంధం లేకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
లంక బౌలర్ల విజృంభణ.. 32 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన నెదర్లాండ్స్
టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్.. లంక బౌలర్ల ధాటికి వణికిపోతుంది. తొలి 5 ఓవర్లలో కేవలం 32 పరుగులు మాత్రమే చేసి సగం వికెట్లు కోల్పోయింది. వనిందు హసరంగ(2/5), మహీశ తీక్షణ(2/3) తమ స్పిన్ మాయాజాలంతో నెదర్లాండ్స్‌కు కుదురుకునే అవకాశం ఇవ్వడంలేదు. తొలి ఓవర్‌లో మ్యాక్స్ ఒడౌడ్ 2 పరుగులు చేసి రనౌట్ కాగా.. బెన్ కూపర్(9), మైబుర్గ్(5)లను తీక్షణ, ఆకెర్‌మెన్(11), బాస్ డీ లీడే(0)లను హసరంగ పెవిలియన్‌కు పంపాడు.
షార్జా: టీ20 ప్రపంచకప్-2021 క్వాలిఫయర్స్ పోటీల్లో భాగంగా శుక్రవారం రాత్రి 7:30 గంటలకు షెడ్యూలైన గ్రూప్-ఏ మ్యాచ్‌లో శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
తుది జట్లు:
శ్రీలంక: కుశాల్ పెరీరా(వికెట్ కీపర్), పాథుమ్ నిషంక, చరిత్ అసలంక, అవిష్క ఫెర్నాండో, భనుక రాజపక్స, దసున్ షనక(కెప్టెన్), చమిక కరుణరత్నే, వనిందు హసరంగ, దుష్మంత చమీర, మహీశ్ తీక్షణ, లాహిరు కుమార.
నెదర్లాండ్స్: మాక్స్ ఆడౌడ్, స్టెఫాన్ మైబుర్గ్, బెన్ కూపర్, బాస్ డీ లీడే, కొలిన్ ఆకెన్‌మాన్, రియాన్ టెన్ డొచేట్, స్కాట్ ఎడ్వర్డ్స్(వికెట్ కీపర్), పీటర్ సీలార్(కెప్టెన్), ఫ్రెడ్ క్లాసీన్, పాల్ వాన్ మీకెరెన్, బ్రాండన్ గ్లోవర్.
Comments
Please login to add a commentAdd a comment