T20 World Cup 2021: Is Team India Winning Chances Depends On Toss How: టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో భాగంగా విజయాలను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. టాస్ గెలిచి... తొలుత బౌలింగ్ ఎంచుకున్న జట్లదే పైచేయిగా ఉంటోంది. అక్టోబరు 17 నుంచి ఆరంభమైన క్వాలిఫయర్ పోటీల నుంచి నేటి దాకా ఎక్కువ శాతం మ్యాచ్‌లలో ఇదే తంతు కొనసాగుతోంది. మెగా ఈవెంట్‌లో మస్కట్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఒమన్.. 10 వికెట్ల తేడాతో పపువా న్యూగినియాపై గెలుపొందింది.
ఇక దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు అక్కడ జరిగిన దాదాపు అన్ని మ్యాచ్‌లలోనూ టాస్ గెలిచిన జట్టునే విజయం వరించింది. మంచు ప్రభావం టాస్ ఓడిన జట్ల కొంప ముంచుతోంది. ఉదాహరణకు.. అక్టోబరు 24 నాటి టీమిండియా- పాకిస్తాన్.. తాజాగా అక్టోబరు 28 నాటి ఆస్ట్రేలియా- శ్రీలంక మ్యాచ్‌లు. వీటిలో టాస్ గెలిచిన పాకిస్తాన్ 10 వికెట్లు, ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ప్రత్యర్థి జట్లపై గెలుపొందాయి.
ఒక్కటి మినహా టీమిండియా మ్యాచ్‌లన్నీ అక్కడే..
పరిస్థితులు అన్నీ బాగుంటే భారత్‌లోనే టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీ జరగాల్సింది. అయితే, కరోనా నేపథ్యంలో బీసీసీఐ ఈ వేదికను యూఏఈకి మార్చింది. ఈ క్రమంలో హోస్ట్ భారత జట్టు ఒక్కటి మినహా మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే ఆడనుంది. అన్నీ కూడా రాత్రి 7: 30 నిమిషాలకే ఆరంభం అవుతాయి.
ఇక సూపర్-12లో భాగంగా ఇప్పటికే పాకిస్తాన్‌తో మ్యాచ్ పూర్తి చేసుకున్న కోహ్లి సేన.. అక్టోబరు 31న న్యూజిలాండ్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఆ తదుపరి అబుదాబి వేదికగా అఫ్గనిస్తాన్‌తో నవంబరు 3న తలపడనుంది. ఇక అన్నీ సజావుగా సాగి ఫైనల్ చేరితే దుబాయ్‌లోనే తుదిపోరుకు సిద్ధం కావాల్సి ఉంటుంది.
టాస్ ఓడిపోతే పరిస్థితి ఏంటి?
అక్టోబరు 24న పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టాస్ ఓడిపోయాడు. ఈ క్రమంలో బాబర్ ఆజం ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు కనీవిని ఎరుగని రీతిలో ఓటమి ఎదురైన విషయం తెలిసిందే. ప్రపంచకప్ చరిత్రలో చిరకాల ప్రత్యర్థి చేతిలో ఓటమి ఎరుగని భారత జట్టు ఏకంగా 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.
అయితే, మంచు ప్రభావం కూడా ఈ మ్యాచ్‌పై ఎంతగానో ఉందని.. ఓటమి అనంతరం కోహ్లి పేర్కొన్నాడు. ఆ మాట వాస్తవమేనని.. శ్రీలంక మాజీ కెప్టెన్ మహేళ జయవర్ధనే వంటి మాజీలు సైతం అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో సెమీస్ చేరే క్రమంలో కోహ్లి సేనకు మార్గం సుగమం కావాలంటే కివీస్‌తో ఆడబోయే మ్యాచ్ కీలకంగా మారింది. కాబట్టి టాస్ గెలవాల్సిన ఆవశ్యకత కూడా ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ టాస్ ఓడినట్లయితే పరిస్థితి ఎలా ఉండబోతుందో ఇప్పటికే అంచనా వేసిన అభిమానులు.. కోహ్లి తప్పక టాస్ గెలువు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
సూపర్-12 రౌండ్: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా షెడ్యూల్ ఇలా..
►ఇండియా వర్సెస్ పాకిస్తాన్, అక్టోబరు 24-దుబాయ్
►ఇండియా వర్సెస్ న్యూజిలాండ్-అక్టోబరు 31- దుబాయ్
►ఇండియా వర్సెస్ అఫ్గనిస్తాన్- నవంబరు 3- అబుదాబి
►ఇండియా వర్సెస్ స్కాట్లాండ్- నవంబరు 5-దుబాయ్
►ఇండియా వర్సెస్ నమీబియా- నవంబరు 8-దుబాయ్
చదవండి: T20 World Cup 2021: స్వదేశానికి తిరిగి వచ్చేసిన టీమిండియా నెట్ బౌలర్
Comments
Please login to add a commentAdd a comment