బాబర్ ఆజం, రోహిత్ శర్మ
T20 World Cup 202: ‘‘రోహిత్ శర్మ నాకంటే పెద్దవాడు. తను చాలా ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నాడు. తనకు నాకంటే అనుభవం ఎక్కువ. అతడి నుంచి నేను నేర్చుకోవాల్సి చాలా ఉంది’’....
‘‘బాబర్ చెప్పినట్లు అదేం లేదులెండి.. పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే ఎలా ఉంటుందో మాకు తెలుసు. భారత్, పాక్ మ్యాచ్ అనగానే ఒత్తిడికి లోనవ్వాల్సిన అవసరం లేదు. మేము ఎప్పుడు పాకిస్తాన్ ఆటగాళ్లను కలిసినా.. ఇంటి దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయన్న అంశం గురించి మాట్లాడుకుంటాం.
ఇంట్లో వాళ్ల యోగక్షేమాల గురించి పరస్పరం అడిగి తెలుసుకుంటాం. మేమే కాదు.. మా ముందు తరం క్రికెటర్లు కూడా ఇలా ఉండేవారట. జీవితం ఎలా సాగుతోంది. నువ్వు కొత్తగా ఏ కారు కొన్నారు.. లేదంటే ఏ కారు కొనాలనుకుంటున్నావు లాంటి విషయాలు మాట్లాడుకుంటాం’’....
ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, పాకిస్తాన్ సారథి బాబర్ ఆజం స్పందించిన విధానం ఇది. టీ20 ప్రపంచకప్-2022 ఆడేందుకు భారత్, పాక్ సహా 16 జట్లు ఆస్ట్రేలియాకు చేరుకున్నాయి. ఆదివారం నుంచి ఈ మెగా ఈవెంట్ ఆరంభం కానున్న తరుణంలో కెప్టెన్లు ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు.
దాయాదులు పోరుపై ఆసక్తి.. అయితే ఆటగాళ్లు మాత్రం..
ఈ సందర్భంగా ఓ జర్నలిస్టు.. మెగా టోర్నీల్లో ఎదురుపడినపుడు భారత్, పాకిస్తాన్ ఆటగాళ్లు ఏం మాట్లాడుకుంటారంటూ ప్రశ్న అడుగగా.. రోహిత్ శర్మ, బాబర్ ఆజం ఇలా స్పందిస్తూ ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య గల అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. కాగా అనివార్య కారణాల వల్ల కేవలం ప్రతిష్టాత్మక టోర్నీల్లో తప్ప భారత్, పాక్ ముఖాముఖి తలపడే పరిస్థితి లేదు.
సహజంగానే దాయాదుల పోరు పట్ల ఉండే ఆసక్తి.. అరుదైన సందర్భాల్లో మాత్రమే తలపడుతున్న కారణంగా మరింతగా పెరిగింది. దీంతో చిరకాల ప్రత్యర్థుల పోరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఇరు జట్ల అభిమానులకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో.. ఆటను ఆటలాగే చూడాలని, తాము మాత్రం క్రీడాస్ఫూర్తితోనే ముందుకు సాగుతామంటూ రోహిత్ చెప్పిన తీరు ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.
కాగా సూపర్-12 దశలో భాగంగా అక్టోబరు 23న భారత్- పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. ఇక గతేడాది ప్రపంచకప్ సందర్భంగా పాక్ చేతిలో భారత్ ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఆ మ్యాచ్ తర్వాత అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లి సహా మెంటార్ ధోని పాక్ ఆటగాళ్ల వద్దకు వెళ్లి అభినందించి క్రీడాస్ఫూర్తిని చాటుకున్నారు.
చదవండి: T20 WC 2022: జట్లు, పాయింట్ల కేటాయింపు విధానం, షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్.. ఇతర పూర్తి వివరాలు
Comments
Please login to add a commentAdd a comment