నమీబియా వెటరన్ ఆల్‌రౌండర్ డేవిడ్ వీస్ (39) లేటు వయసులో అదిరిపోయే ప్రదర్శనలతో ఇరదీస్తున్నాడు. గత కొంతకాలంగా నమీబియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న వీస్.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ 2024లోనూ చెలరేగిపోతున్నాడు.
వరల్డ్‌కప్ గ్రూప్-బి పోటీల్లో భాగంగా ఒమన్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో వీస్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటి నమీబియాను గెలిపించాడు. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో నమీబియా సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. రెగ్యులర్ మ్యాచ్‌లో బ్యాట్‌తో బంతితో సత్తా చాటిన వీస్.. సూపర్ ఓవర్‌లోనూ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు.
రెగ్యులర్ మ్యాచ్‌లో తొలుత బంతితో (3.4-0-28-3) రాణించిన వీస్.. ఆ తర్వాత బ్యాట్‌తోనూ (8 బంతుల్లో 9 నాటౌట్; ఫోర్) పర్వాలేదనిపించాడు. అనంతరం ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీయగా.. సూపర్ ఓవర్‌లోనూ వీస్ ఇరగదీశాడు. సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాట్‌తో (4 బంతుల్లో 13 నాటౌట్; ఫోర్, సిక్స్) చెలరేగిన వీస్.. ఆతర్వాత బంతితోనూ (1-0-10-1) రాణించి నమీబియాను ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ మ్యాచ్ ఆధ్యాంతం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసినందుకు గాను వీస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్.. నమీబియా బౌలర్ల ధాటికి 19.4 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. నమీబియా బౌలర్లలో వీస్‌తో పాటు ట్రంపెల్‌మన్ (4-0-21-4), ఎరాస్మస్ (4-0-20-2), స్కోల్జ్ (4-0-20-1) సత్తా చాటారు. ఒమన్ ఇన్నింగ్స్‌లో ఖలీద్ కైల్ (34) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఒమన్ చేసినన్ని పరుగులే (109) చేయగలిగింది. ఒమన్ బౌలర్లలో మెహ్రాన్ ఖాన్ (3-1-7-3), కెప్టెన్ ఆకిబ్ ఇలియాస్ (4-1-17-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. బిలాల్ ఖాన్, అయాన్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. నమీబియాను విజయతీరాలకు చేర్చేందుకు ఫ్రైలింక్ (45) పోరాడినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.
సూపర్ ఓవర్ విషయానికొస్తే.. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా వీస్, ఎరాస్మస్ (2 బంతుల్లో 8 నాటౌట్; 2 ఫోర్లు) రాణించడంతో 21 పరుగులు చేసింది. అనంతరం 22 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. వీస్ ధాటికి 10 పరుగలకే పరిమితమై ఓటమిపాలైంది.
Comments
Please login to add a commentAdd a comment