టీ20 వరల్డ్‌కప్ 2024 ఫైనల్ మ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ సారి ఫైనల్‌కు క్వాలిఫై అయ్యే మొదటి జట్టుకు ప్రపంచకప్ టోర్నీల్లో ఇది మొదటి ఫైనల్ అవుతుంది. భారతకాలమానం ప్రకారం రేపు (జూన్ 27) ఉదయం జరుగుబోయే తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లలో ఏ జట్టు ఫైనల్‌కు చేరినా రికార్డే అవుతుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు ప్రపంచకప్ టోర్నీల్లో (వన్డే, టీ20) ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరలేదు. సౌతాఫ్రికా పలు మార్లు సెమీఫైనల్‌కు చేరగా.. ఆఫ్ఘనిస్తాన్‌కు మాత్రం ఇదే తొలి సెమీఫైనల్.
కాగా, ట్రినిడాడ్ వేదికగా సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య రేపు ఉదయం తొలి సెమీఫైనల్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు జూన్ 29 జరిగే ఫైనల్ మ్యాచ్‌కు అర్హత సాధిస్తుంది. మరోవైపు రెండో సెమీఫైనల్లో భారత్- ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రేపు రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తుంది.
మ్యాచ్ జరిగే సమయానికి 88 శాతం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే.. సూపర్-8లో గ్రూప్ టాపర్‌గా ఉన్నందున్న టీమిండియా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే కూడా లేదు. మరోవైపు సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగే తొలి సెమీఫైనల్‌కు రిజర్వ్ డే ఉంది. ఒకవేళ రేపు సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా సాధ్యపడకపోయినా రిజర్వ్ డే అయిన 28న తేదీన మ్యాచ్‌ను జరిపిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment