T20 World Cup 2024: లంకేయులకు షాక్‌.. పసికూన చేతిలో పరాభవం | T20 World Cup 2024: Netherlands Stun Sri Lanka In Warm Up Match | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: లంకేయులకు షాక్‌.. పసికూన చేతిలో పరాభవం

Published Wed, May 29 2024 10:24 AM | Last Updated on Wed, May 29 2024 10:58 AM

T20 World Cup 2024: Netherlands Stun Sri Lanka In Warm Up Match

శ్రీలంక క్రికెట్‌ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. టీ20 వరల్డ్‌కప్‌ 2024 వార్మప్‌ మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్‌ చేతిలో వీరు చిత్తుగా ఓడారు. ఫ్లోరిడాలో జరిగిన ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన నెదర్లాండ్స్‌.. మైఖేల్‌ లెవిట్‌ (28 బంతుల్లో 55 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. 

లెవిట్‌తో పాటు తేజ నిడమనూరు (27), కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (12 బంతుల్లో 27 నాటౌట్‌) సత్తా చాటారు. శ్రీలంక బౌలర్లలో దిల్షన్‌ మధుషంక (4-0-39-2) రాణించగా.. నువాన్‌ తుషార, దునిత్‌ వెల్లలగే, ఏంజెలో మాథ్యూస్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక ఆదిలోనే తడబడింది. ఆ జట్టు పవర్‌ ప్లేలో 4 వికెట్లు కోల్పోయి కేవలం 30 పరుగులు మాత్రమే చేసింది. ఆతర్వాత కూడా లంక బ్యాటర్లు లయను అందుకోలేకపోయారు. ఏ దశలో గెలుపు దిశగా సాగలేకపోయారు. 18.5 ఓవర్లలో 161 పరుగుల వద్ద లంక ఇన్నింగ్స్‌ ముగిసింది. ఫలితంగా నెదర్లాండ్స్‌ సంచలన విజయం నమోదు చేసింది. 

లంక ఇన్నింగ్స్‌ చివర్లో కెప్టెన్‌ హసరంగ బ్యాట్‌ ఝులిపించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. హసరంగ 15 బంతుల్లో 43 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు వరుస సిక్సర్లు ఉండటం విశేషం. లంక ఇన్నింగ్స్‌లో హసరంగతో పాటు ధనంజయ డిసిల్వ (31), దసున్‌ షనక (35 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆర్యన్‌ దత్‌ 3 వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బకొట్టగా.. కైల్‌ క్లెయిన్‌ 2, లొగాన్‌ వాన్‌ బీక్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. 

నెదర్లాండ్స్‌ తమ రెండో వార్మప్‌ మ్యాచ్‌ను మే 30న ఆడనుంది. డల్లాస్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో ఆ జట్టు కెనడాను ఢీకొట్టనుంది. శ్రీలంక తమ రెండో వార్మప్‌ మ్యాచ్‌ను మే 31న ఆడనుంది. ఫ్లోరిడాలో జరిగే ఆ మ్యాచ్‌లో లంకేయులు ఐర్లాండ్‌తో తలపడతారు. ప్రపంచకప్‌లో శ్రీలంక, నెదర్లాండ్స్‌ జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. ఈ రెండు జట్లు గ్రూప్‌-డిలో పోటీపడనున్నాయి. వీటితో పాటు సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌, నేపాల్‌ జట్లు గ్రూప్‌-డిలో ఉన్నాయి. భారత్‌, పాకిస్తాన్‌ జట్లు గ్రూప్‌-ఏలో ఉండగా.. ఈ రెండు జట్ల మధ్య సమరం జూన్‌ 9న న్యూయార్క్‌లో జరుగనుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement