
పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది(ఫొటో కర్టెసీ: ఏఎఫ్‌పీ)
Shahid Afridi on Pakistan’s T20 World Cup selection: వచ్చే నెలలో జరుగనున్న టీ20 ప్రపంచకప్‌నకు ఎంపిక చేసిన తమ జట్టు పట్ల పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది అసంతృప్తి వ్యక్తం చేశాడు. కనీసం రెండు, మూడు మార్పులైనా చేయాలని, అప్పుడే అనుకున్న ఫలితాలు రాబట్టగలమని పేర్కొన్నాడు. యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబరు 17 నుంచి ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో... 15 మందితో కూడిన జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ప్రకటించింది.
కెప్టెన్ బాబర్ అజమ్ నేతృత్వంలో ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్, ఇద్దరు వికెట్ కీపర్స్, నలుగురు ఆల్‌రౌండర్స్, నలుగురు ఫాస్ట్ బౌలర్స్‌తో మెగా ఈవెంట్‌లో బరిలో దిగనున్నట్లు తెలిపింది. అయితే, ఈ నిర్ణయం పట్ల పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్... అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాదీర్, షాహనవాజ్ దహానిలను రిజర్వ్ ఆటగాళ్లుగా ప్రకటించడం పట్ల అతడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. అనుభవం ఉన్న ఆటగాళ్లను అవకాశం ఇస్తే బాగుంటందని సూచించాడు. ఇక అక్టోబరు 10 వరకు జట్లలో మార్పులు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో షాహిద్ ఆఫ్రిది సైతం.. క్రికెట్ పాకిస్తాన్‌తో మాట్లాడుతూ పలు సూచనలు చేశాడు.
జట్టు ఎంపిక సరిగ్గా లేదు..
‘‘కొంతమందిని ఎందుకు ఎంపిక చేశారో.. మరికొంత మందిని ఎందుకు పక్కన పెట్టారో అర్థం కావడం లేదు. టీ20 వరల్డ్‌కప్ ఆరంభానికి ముందే జట్టులో కొన్ని మార్పులు చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం.. ఇటీవల ప్రకటించిన జట్టు సరిగ్గా లేదు. కచ్చితంగా రెండు, మూడు మార్పులు చేయాలి. సెలక్షన్ కమిటీ అభిప్రాయంతో నేను ఏకీభవించడం లేదు. అయితే, వరల్డ్‌కప్‌లో మన జట్టుకు నేను తప్పకుండా మద్దతుగా నిలుస్తాను’’ అని చెప్పుకొచ్చాడు. అయితే, ఆ మార్పులు ఏమిటో మాత్రం వెల్లడించలేదు.
ఇక మేజర్ టోర్నీకి ముందు కొత్త కోచ్‌ల నియామకం గురించి షాహిది చెబుతూ.. ‘‘టీ20 వరల్డ్‌కప్‌నకు ముందు కొత్తగా కోచింగ్ సిబ్బంది(హెడెన్, ఫిలాండర్) నియామకం పెద్దగా ప్రభావం చూపుతుందని నేను అనుకోను. టోర్నీ ముగిసిన తర్వాత ఈ నియామకం జరిపితే బాగుండేది’’ అని అభిప్రాయపడ్డాడు. పాత కోచ్‌లు మిస్బా-ఉల్- హక్, వకార్ యూనిస్ తమంతట తాముగా తప్పుకోవాలనే నిర్ణయం తీసుకుంటే మాత్రం అది పాకిస్తాన్ క్రికెట్‌కు నష్టం చేకూర్చే అవకాశం ఉందని పేర్కొన్నాడు.
కొత్త కోచ్‌లు కుదురుకోవడానికి సమయం పడుతుందని, ఐసీసీ టోర్నీ సమయంలో ఇలాంటి మార్పులు ప్రభావం చూపుతాయని చెప్పుకొచ్చాడు. కాగా మిస్బా, వకార్ యూనిస్ స్థానంలో ఆసీస్ మాజీ దిగ్గజ ఆటగాడు మాథ్యూ హెడెన్‌ను హెడ్ కోచ్‌గా, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ వర్నన్ ఫిలాండర్‌ను బౌలింగ్ కోచ్‌గా పీసీబీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
చదవండి: Shoaib Akhtar: ‘ముందు టీమిండియా.. ఆ తర్వాత న్యూజిలాండ్.. వదిలిపెట్టొద్దు’
Comments
Please login to add a commentAdd a comment