
PC: AFP
Eoin Morgan Comments Ahead T20 World Cup Journey: ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా మ్యాచ్‌తో ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ టోర్నీ అసలైన ఆట మొదలుకానుంది. అక్టోబరు 23న ఆసీస్- ప్రొటీస్ మ్యాచ్ తర్వాత.. అదే రోజు మరో రసవత్తర పోరు జరుగనుంది. డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌తో మాజీ చాంపియన్ ఇంగ్లండ్ తలపడనుంది. ఇక సోమవారం జరిగిన వార్మప్ మ్యాచ్‌లలో ఇంగ్లండ్- టీమిండియా చేతిలో, వెస్టిండీస్ పాకిస్తాన్ చేతిలో ఓడిపోయాయి.
ఇదిలా ఉండగా, కోహ్లి సేనతో తలపడే క్రమంలో జోస్ బట్లర్ సారథిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తాను ఫామ్‌లోకి రాలేకపోతే తుది జట్టు నుంచి తప్పుకొనే అవకాశాలు ఉన్నాయన్నాడు. కాగా ఈ ఏడాది ఇంగ్లండ్ తరఫున 7 టీ20లు ఆడిన మోర్గాన్.. కేవలం 82 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అంతేగాక.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ సారథిగా వ్యవహరించిన అతడు... జట్టును ఫైనల్ చేర్చి సమర్థవంతమైన కెప్టెన్ అనిపించుకున్నాడు.
కానీ, బ్యాటర్‌గా మాత్రం విఫలమయ్యాడు. 16 ఇన్నింగ్స్‌లో అతడు.. 133 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌నకు ముందు మోర్గాన్ ఫామ్‌లేమితో సతమతమవడం ఇంగ్లండ్‌కు తలనొప్పిగా మారిన తరుణంలో కొంతమంది మాజీలు అతడిని తీవ్రంగా విమర్శించారు. ఈ విషయాలపై మోర్గాన్ తాజాగా స్పందిస్తూ... తాను గనుక ఫామ్‌లోకి రాకపోతే టీ20 జట్టు నుంచి తనను తాను డ్రాప్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు.
‘‘వరల్డ్‌కప్ గెలిచే జట్టులో నేను ఉంటానో లేదో తెలియదు. పరుగులు చేయలేకపోతున్నాను. కానీ.. నా కెప్టెన్సీ చాలా బాగుంది. బ్యాటర్‌గా, సారథిగా రెండు పాత్రలను సమర్థవంతంగా పోషించేందుకు సిద్ధంగా ఉంటాను. అయితే, కెప్టెన్‌గా ఉండటం నాకు ఇష్టం’’ అని పేర్కొన్నాడు. మరి, జట్టు ప్రయోజనాల కోసం తుదిజట్టు నుంచి తప్పుకొనే అవకాశం ఉందా అని ప్రశ్నించగా... ‘‘కచ్చితంగా ఆ ఆప్షన్ ఉంటుంది’’ అని బీబీసీ స్పోర్ట్‌తో మోర్గాన్ వ్యాఖ్యానించాడు.
చదవండి: T20 WC 2021: ఒమన్ బౌలర్ అద్బుతం.. సింగిల్ హ్యాండ్‌తో
Comments
Please login to add a commentAdd a comment