Dilip Vengsarkar on Virat Kohli: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడని భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగసర్కార్ అన్నాడు. ఐసీసీ టైటిల్ గెలిచి సగర్వంగా పదవి నుంచి వైదొలగాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. కాగా యూఏఈ వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్ తర్వాత తాను టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు కోహ్లి గురువారం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. పనిభారం ఎక్కువైందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. అయితే, వన్డే, టెస్టు సారథిగా కొనసాగేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు.
ఈ నేపథ్యంలో కోహ్లి నిర్ణయంపై మాజీలు భిన్నంగా స్పందిస్తున్నారు. ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఈ విషయం వెల్లడిచేయాల్సిందని కొంతమంది అభిప్రాయపడుతుండగా.. వెంగసర్కార్ మాత్రం కోహ్లి నిర్ణయం సరైనదేనని పేర్కొన్నాడు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘నేనిది ముందే ఊహించాను. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా అన్ని ఫార్మాట్లలో ఎనిమిదేళ్లుగా జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
కెప్టెన్‌గా ముందుండి నడిపిస్తున్నాడు. కాబట్టి తనపై ఒత్తిడి ఉండటం సహజం. నిజానికి తను కరెక్ట్ టైంలో కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాడు. టీ20 కెప్టెన్‌గా వరల్డ్‌కప్ గెలిచి తను అత్యున్నత స్థాయిలో పదవి నుంచి వైదొలిగితే బాగుంటుంది. కోహ్లికి ఆ అర్హత ఉంది’’ అని అభిప్రాయపడ్డాడు. అంతేగాకుండా.. టెస్టు క్రికెట్‌పై దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్న వెంగ్‌సర్కార్.. సంప్రదాయ క్రికెట్ పట్ల కోహ్లి విజయాలను ఈ సందర్భంగా ప్రస్తావించాడు.
చదవండి: టి20 కెప్టెన్సీపై కోహ్లి నిర్ణయం.. అనుష్క స్పందన
Comments
Please login to add a commentAdd a comment