ఇటీవలికాలంలో క్రికెట్‌లో ఫీల్డ్ అంపైర్ల తప్పిదాలు చాలా ఎక్కువయ్యాయి. అంపైర్ల తప్పుడు నిర్ణయాల కారణంగా చాలా జట్లు గెలవాల్సిన మ్యాచ్‌ల్లో ఓటమిపాలవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మరోసారి రిపీటైంది. టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా సౌతాఫ్రికా-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్ సామ్ నొగాస్కీ తప్పుడు నిర్ణయం బంగ్లాదేశ్ ఓటమికి పరోక్ష కారణమైంది.
సౌతాఫ్రికా నిర్ధేశించిన 114 పరుగుల లక్ష్య ఛేదనలో (ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో) ఈ తప్పిదం జరిగింది. సౌతాఫ్రికా బౌలర్ బార్ట్‌మన్ ఓట్నీల్ వేసిన బంతిని బంగ్లా బ్యాటర్ మహ్మదుల్లా లెగ్‌సైడ్ దిశగా ఆడే ప్రయత్నం చేయగా.. బంతి ప్యాడ్‌లకు తాకి బౌండరీకి వెళ్లింది. సౌతాఫ్రికా ఆటగాళ్లు ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేయడంతో అంపైర్ నొగాస్కీ ఔట్‌గా ప్రకటించాడు.
అంపైర్ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన మహ్మదుల్లా రివ్యూకి వెళ్లగా నాటౌట్‌గా తేలింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఫీల్డ్ అంపైర్ నిర్ణయం తీసుకోగానే బంతి డెడ్ బాల్‌గా మారుతుంది. ఈ కారణంగా మహ్మదుల్లాను ఔట్‌గా ప్రకటించిన బంతి బౌండరీకి వెళ్లినా బంగ్లా స్కోర్‌కు కౌంట్ కాలేదు.
ఫైనల్‌గా చూస్తే ఇదే నాలుగు పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం బంగ్లా ఆటగాడు తౌహిద్ హ్రిదోయ్ ఫీల్డ్ అంపైర్ సామ్ నొగాస్కీ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. నొగాస్కీ కరెక్ట్‌గా తన నిర్ణయాన్ని ప్రకటించి ఉంటే ఫలితం తమకు అనుకూలంగా వచ్చేదని అన్నాడు.
కాగా, ఇదే మ్యాచ్‌లో హ్రిదోయ్‌ను ఔట్‌గా ప్రకటించిన తీరుపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రబాడ బౌలింగ్‌లో అనుమానాస్పద రివ్యూకు హ్రిదోయ్ ఔట్‌గా ప్రకటించబడ్డాడు.
స్కోర్ల వివరాలు..
సౌతాఫ్రికా-113/6 (క్లాసెన్ 46; తంజిబ్ హసన్ సకీబ్ 3/18)
బంగ్లాదేశ- 109/7 (తౌహిద్ హ్రిదోయ్ 37; కేశవ్ మహారాజ్ 3/27)
4 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం
Comments
Please login to add a commentAdd a comment