వెస్టిండీస్‌తో రెండో టెస్టులో బంగ్లాదేశ్ చారిత్రాత్మక విజయం సాధించింది. ఆతిథ్య విండీస్‌ను ఏకంగా 101 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా కరేబియన్ గడ్డపై పదిహేనేళ్లలో తొలి టెస్టు గెలుపు నమోదు చేసింది. అంతేకాదు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 పాయింట్ల పట్టికలో వెస్టిండీస్‌ను వెనక్కినెట్టింది.
కరేబియన్ పర్యటనలో బంగ్లాదేశ్
కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు బంగ్లాదేశ్ కరేబియన్ పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య ఆంటిగ్వా వేదికగా తొలి టెస్టు జరగగా.. ఆతిథ్య వెస్టిండీస్ 201 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
జమైకాలో రెండో టెస్టు
అయితే, రెండో టెస్టులో మాత్రం బంగ్లాదేశ్ వెస్టిండీస్‌కు ఊహించని షాకిచ్చింది. జాకర్ అలీ బ్యాట్‌తో, తైజుల్ ఇస్లాం బాల్‌తో చెలరేగడంతో బ్రాత్‌వైట్ బృందాన్ని మట్టికరిపించింది. జమైకా వేదికగా శనివారం నుంచి మంగళవారం (నవంబరు 30- డిసెంబరు 3) వరకు జరిగిన ఈ మ్యాచ్‌లో.. టాస్ గెలిచిన బంగ్లా తొలుత బ్యాటింగ్ చేసింది.
బ్యాటర్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితం కావడంతో తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ షాద్‌మన్ ఇస్లాం(64), కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్(36) రాణించడంతో ఈ మేర స్కోరు సాధించింది.
నహీద్ రాణా ఐదు వికెట్లతో చెలరేగడంతో
ఇందుకు బదులిచ్చేందుకు రంగంలోకి దిగిన విండీస్ జట్టు.. 146 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా యువ పేసర్ నహీద్ రాణా ఐదు వికెట్లతో చెలరేగి వెస్టిండీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.
ఈ క్రమంలో.. 18 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బంగ్లాదేశ్.. 268 పరుగులు సాధించింది. కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ 42 పరుగులతో రాణించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ జాకర్ అలీ 91 పరుగులతో దుమ్ములేపాడు. ఈ నేపథ్యంలో పర్యాటక బంగ్లాదేశ్ విండీస్ ముందు 287 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ఈసారి ఐదేసిన తైజుల్ ఇస్లాం
అయితే, టార్గెట్‌ను ఛేదించే క్రమంలో వెస్టిండీస్‌ను ఆరంభం నుంచే బంగ్లా బౌలర్లు తిప్పలు పెట్టారు. ముఖ్యంగా స్పిన్నర్ తైజుల్ ఇస్లాం ఓపెనర్లలో మైకైల్ లాయీస్(6)తో పాటు.. కెప్టెన్ బ్రాత్‌వైట్(43)లను అవుట్ చేసి వికెట్ల పతనానికి నాంది పలకగా.. పేసర్లు టస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, నహీద్ రాణా అతడికి సహకారం అందించారు.
సిరీస్ సమం..
ఇక విండీస్ బ్యాటర్లలో కేవం హోడ్జ్(55) అర్ధ శతకంతో కాసేపు పోరాడే ప్రయత్నం చేయగా.. తైజుల్ ఇస్లాం అతడిని పెవిలియన్‌కు పంపి మరోసారి దెబ్బ కొట్టాడు. ఇక నహీద్ రాణా షమార్ జోసెఫ్(8)ను పదో వికెట్‌గా వెనక్కి పంపడంతో విండీస్ కథ ముగిసిపోయింది. 185 పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్ కాగా.. బంగ్లా 101 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
ఇక బంగ్లా బౌలర్లలో ప్లేయర్ ‘ఆఫ్ ది మ్యాచ్’ తైజుల్ ఇస్లాం ఏకంగా ఐదు వికెట్లు దక్కించుకోగా.. టస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్ తలా రెండు, నహీద్ రాణా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
పాయింట్ల పట్టికలోనూ తారుమారు
ఇక విండీస్‌పై విజయంతో బంగ్లాదేశ్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరగా.. వెస్టిండీస్ తొమ్మిదో స్థానానికి పడిపోయింది. టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్ టాప్-5లో ఉన్నాయి.
చదవండి: వినోద్ కాంబ్లీని కలిసిన సచిన్.. చేయి వదలకుండా బిగించడంతో.. ఆఖరికి
Comments
Please login to add a commentAdd a comment