7 డాలర్లే ఉన్నాయి.. ఏకంగా ఇంటినే ఇచ్చేశాడు! దయలోనూ కింగే! | Dwayne 'The Rock' Johnson Gifts Furnished Home To UFC Fighter Temba Gorimbo | Sakshi
Sakshi News home page

The Rock: 7 డాలర్లే ఉన్నాయి.. ఏకంగా ఇంటినే ఇచ్చేశాడు! దయలోనూ కింగే!

Published Wed, Feb 28 2024 5:41 PM | Last Updated on Thu, Mar 21 2024 6:21 PM

TB: Dwayne Johnson Gifts Furnished Home To UFC Fighter Temba - Sakshi

డ్వేన్‌ డగ్లస్‌ జాన్సన్‌ అంటే గుర్తుపట్టకపోవచ్చేమో గానీ.. ‘ది రాక్‌’ అనగానే చాలా మందికి అతడి రూపం కళ్ల ముందు కదలాడుతుంది. ప్రొఫెషనల్‌ రెజ్లర్‌గా.. హాలీవుడ్‌ స్టార్‌గా అతడు సాధించిన.. సాధిస్తున్న విజయాలు స్ఫురణకు వస్తాయి.

ఏకంగా ఎనిమిదిసార్లు వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ చాంపియన్‌గా నిలిచిన ఘనత డ్వేన్‌ జాన్సన్‌ సొంతం. హాలీవుడ్‌లోనూ తన నటనతో స్టార్‌గా తనకంటూ అభిమానులను సంపాదించుకున్నాడతడు!

కఠిన సవాళ్లను దాటుకుని
కాలిఫోర్నియాలోని శాన్‌ ఫ్రాన్సిస్‌కోలో మే 2, 1972లో జన్మించాడు డ్వేన్‌ జాన్సన్‌. అతడి తల్లిండ్రులు అటా జాన్సన్‌, రాకీ జాన్సన్‌. రాకీ ప్రొఫెషన్‌ రెజ్లర్‌. తండ్రిని చూసి చిన్ననాటి నుంచే రెజ్లింగ్‌పై ఇష్టం పెంచుకున్నాడు డ్వేన్‌.

డబ్ల్యుడబ్ల్యుఈ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు సంపాదించిన తండ్రి, తాత వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని తానూ రెజ్లర్‌గా మారాలని నిర్ణయించుకున్నాడు. అయితే, తండ్రి సంపాదనలో నిలకడ లేకపోవడంతో చిన్నతనం నుంచే ఆర్థికంగా కష్టాలు చవిచూశాడు. అద్దె కట్టలేని కారణంగా ఎన్నోసార్లు ఇళ్లు మారాల్సి వచ్చేది.

ఫలితంగా అప్పటికి రెజ్లర్‌గా మారాలన్న కలకు విరామం ఇచ్చాడు. స్కూళ్లో చదువుతున్న సమయంలో ఫుట్‌బాల్‌ కోచ్‌ డ్వేన్‌లో దాగిన ప్రతిభను గుర్తించి అవకాశమిచ్చాడు. క్రమక్రమంగా స్టార్‌ ఫుట్‌బాలర్‌గా పేరొంది పెద్ద క్లబ్బులకు ఆడే అవకాశాలు వచ్చినా గాయాల కారణంగా చేజారిపోయేవి.

దీంతో మళ్లీ కథ మొదటికే వచ్చేది. అలాంటి సమయంలో అనూహ్యంగా ప్రొఫెషనల్‌ రెజ్లింగ్‌లో అడుగుపెట్టాడు డ్వేన్‌ జాన్సన్‌. ఆరంభంలో తండ్రి, తాత పేరు కలిసి వచ్చేలా రాకీ మైవియా పేరుతో బరిలోకి దిగాడు.

ఈ క్రమంలో కఠిన సవాళ్లు ఎదుర్కొని తనకంటూ ఫ్యాన్‌ బేస్‌ సొంతం చేసుకుని ‘ది రాక్‌’గా ఎదిగాడు. డబ్ల్యుడబ్ల్యుఈ సూపర్‌స్టార్‌గా క్రేజ్‌ సంపాదించాడు. అంతటితో సంతృప్తి చెందక హాలీవుడ్‌లో నటుడిగా అదృష్టం పరీక్షించుకుని అక్కడా విజయవంతమయ్యాడు డ్వేన్‌ జాన్సన్‌. 

రెజ్లింగ్‌లోనే కాదు.. దయచూపడంలోనూ రాజే!
ఇతరులకు సాయం చేయడంలోనూ తాను ముందే ఉంటానని నిరూపించాడు డ్వేన్‌ జాన్సెన్‌. అమెరికన్‌ మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ను ప్రోత్సహించే అల్టిమేట్‌ ఫైటింగ్‌ చాంపియన్‌షిప్‌లో రాణించాలనుకుంటున్న ఆఫ్రికన్‌ వ్యక్తికి అందమైన ఇంటిని బహుమతిగా ఇచ్చాడు.

తన అకౌంట్లో కేవలం ఏడు డాలర్లే ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసిన అతడిని సర్‌ప్రైజ్‌ చేశాడు. ‘‘ఇతడు ఎంతో ప్రత్యేకమైన మనిషి. తెంబా జీవితంలో మూడు అత్యంత ముఖ్యమైనవి. 

తన కుటుంబం, సౌతాఫ్రికాలోని తన గ్రామం, అక్కడి ప్రజలు.. ఇంకా యూఎఫ్‌సీలో వరల్డ్‌ చాంపియన్‌ కావడం. ఎంతో మందికి తను స్ఫూర్తి’’ అంటూ సదరు వ్యక్తిని ప్రశంసించిన డ్వేన్‌ జాన్సెన్‌.. అతడికి ఇంటి తాళాలు అందించిన వీడియోను పంచుకున్నాడు. ఈ వీడియో తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోంది.

తెంబా అంకితభావానికి ఫిదా అయి మియామిలో ఫుల్‌ ఫర్నిష్డ్‌ ఇంటిని కానుకగా అందించాడు. ఈ నేపథ్యంలో డ్వేన్‌ జాన్సన్‌ పెద్ద మనసు పట్ల ప్రశంసలు కురుస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement