జూనియర్ ఆసియా కప్ మహిళల హాకీ టోర్నీ టైటిల్ నిలబెట్టుకున్న టీమిండియా
మస్కట్: ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత మహిళల హాకీ జట్టు తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. వరుసగా రెండోసారి జూనియర్ ఆసియా కప్ చాంపియన్‌గా టీమిండియా నిలిచింది. మూడుసార్లు చాంపియన్ చైనా జట్టుతో ఆదివారం జరిగిన ఫైనల్లో జ్యోతి సింగ్ నాయకత్వంలోని భారత జట్టు ‘షూటౌట్’లో 3–2 గోల్స్ తేడాతో విజయం సాధించింది. అంతకుముందు నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. ఫలితంగా విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించారు.
‘షూటౌట్’లో భారత్ తరఫున సాక్షి రాణా, ఇషిక, సునెలిత టొప్పో సఫలమయ్యారు. ముంతాజ్ ఖాన్, కనిక సివాచ్ విఫలమయ్యారు. చైనా తరఫున గువోటింగ్ హావో, లియు టాంగ్జీ సఫలంకాగా... వాంగ్ లిహాంగ్, లి జింగీ, దన్‌దన్ జువో విఫలమయ్యారు. ముగ్గురు చైనా ప్లేయర్ల షాట్‌లను భారత గోల్‌కీపర్ నిధి నిలువరించి టీమిండియా విజయంలో ముఖ్యపాత్ర పోషించింది.
ఫైనల్ చేరుకునే క్రమంలో లీగ్ దశలో చైనా చేతిలో మాత్రమే ఓడిపోయిన భారత జట్టుకు టైటిల్ పోరులోనూ గట్టిపోటీ ఎదురైంది. తొలి 29 నిమిషాల వరకు రెండు జట్లు ఖాతా తెరువలేకపోయాయి. 30వ నిమిషంలో లభించిన పెనాల్టీ స్ట్రోక్‌ను చైనా జట్టు సద్వినియోగం చేసుకుంది. టాన్ జిన్‌జువాంగ్ గోల్ చేయడంతో మాజీ చాంపియన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
ఆ తర్వాత 41వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను కనిక సివాచ్ గోల్‌గా మలచడంతో భారత్ స్కోరును 1–1తో సమం చేసింది. ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్ చేయడానికియత్నించినా ఫలితం లేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment