‘ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు’... అన్న చందంగా ఏరి కోరి సిద్ధం చేసుకున్న స్పిన్ పిచ్‌పై టీమిండియా బోల్తా కొట్టింది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో పిచ్ పేస్‌కు అనుకూలించడం వల్లే టీమిండియా తడబడింది అని సర్దిచెప్పుకున్న వాళ్లు సైతం... పుణే ప్రదర్శనతో బేజారవుతున్నారు. ప్రత్యర్థిని స్పిన్ వలలో వేసి ఉక్కిరి బిక్కిరి చేయాలనుకున్న రోహిత్ సేన చివరకు ఆ ఉచ్చులోనే చిక్కి విలవిల లాడింది. టెస్టు కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నాలుగు కంటే ఎక్కువ వికెట్లు తీసిన అనుభవం లేని సాంట్నర్‌కు ఏకంగా మనవాళ్లు ఏడు వికెట్లు సమర్పించుకున్నారు.
భారత ఆటగాళ్లు తడబడ్డ చోటే రెండో ఇన్నింగ్స్‌లోనూ న్యూజిలాండ్ ప్లేయర్లు స్వేచ్ఛగా పరుగులు రాబట్టడం పుండు మీద కారం చల్లినట్లయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసిన భారత స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ రెండో ఇన్నింగ్స్‌లోనూ నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నా... కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ మాత్రం చక్కటి ఇన్నింగ్స్‌తో అలరించాడు. స్పిన్నర్లను ఎదుర్కొనే క్రమంలో క్రీజు వదలి ఒక అడుగు ముందుకు వేసి బంతిని అందుకోవడంతో పాటు... కాళ్ల కదలికలో చురుకుదనం చూపిస్తూ ఖాళీల్లోకి బంతిని పోనిచ్చి పరుగులు పిండుకున్నాడు.
మరో ఎండ్‌లో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతున్నా... ఏమాత్రం తడబడకుండా క్రీజులో నిలిచి కెపె్టన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా రెండో టెస్టులో న్యూజిలాండ్ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. 1955–56 నుంచి భారత్‌లో పర్యటిస్తున్న న్యూజిలాండ్... ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇక్కడ టెస్టు సిరీస్ గెలవలేకపోయింది. 36 ఏళ్ల తర్వాత తొలిసారి భారత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో టెస్టు మ్యాచ్ ఓడిన టీమిండియా... ఇప్పుడు టెస్టు క్రికెట్ చరిత్రలో మొదటిసారి సిరీస్ ఓటమి అంచున నిలిచింది.
వరుసగా మూడోసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరాలనుకుంటున్న టీమిండియా... ఇదే ప్రదర్శన కొనసాగిస్తే మున్ముందు మరిన్ని కష్టాలు ఎదుర్కోక తప్పదు. 2023–25 ఎడిషన్‌లో భాగంగా భారత్ ఇంకా కేవలం ఆరు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది. అందులో ఒకటి న్యూజిలాండ్‌తో కాగా... మిగిలిన ఐదు ఆ్రస్టేలియాలో ఆ్రస్టేలియాతో. ఇలాంటి దశలో స్వదేశంలో ఆడుతున్న సిరీస్‌లో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చి డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మెరుగైన స్థితితో ఆసీస్ గడ్డపై అడుగు పెడుతుంది అనుకుంటే... ఫలితాలు మాత్రం అందుకు విరుద్ధంగా వస్తున్నాయి.
తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం తర్వాత భారత మాజీ కెప్టెన్ , హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే మాట్లాడుతూ... ‘జట్టులో పుజారా వంటి ప్లేయర్ ఎంతో అవసరం. ఎలాంటి పిచ్‌పైనైనా ఓపికగా నిలవడంతో పాటు సహచరులకు భరోసా ఇవ్వగల సామర్థ్యం అతడి సొంతం’ అని అన్నాడు. ఇప్పుడు వరుసగా రెండో టెస్టులోనూ మన బ్యాటర్ల ఆటతీరు చూస్తుంటే కుంబ్లే చెప్పింది నిజమే అనిపిస్తోంది.
స్వదేశంలోనే పరిస్థితి ఇలా ఉంటే... ఆ్రస్టేలియా టూర్‌లో టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుందనే అనుమానాలు రేకెత్తక మానవు! గత రెండు ఆసీస్ పర్యటనల్లోనూ పుజారా క్రీజులో పాతుకుపోయి జట్టుకు మూలస్తంభంలా నిలిచి మరపురాని విజయాలు అందించాడు. మరి బెంగళూరు, పుణే పిచ్‌పైనే పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడుతున్న మనవాళ్లు కంగారూ గడ్డపై ఏం చేస్తారో వేచి చూడాలి!
–సాక్షి క్రీడావిభాగం
Comments
Please login to add a commentAdd a comment