ఓవరాల్‌ టీమ్‌ చాంప్‌ భారత్‌ | U17 World Wrestling Championship 2024, Team Of Indian Women Wrestlers Stood At The Top With 185 Points | Sakshi
Sakshi News home page

U17 World Wrestling Championship: ఓవరాల్‌ టీమ్‌ చాంప్‌ భారత్‌

Published Sat, Aug 24 2024 4:05 AM | Last Updated on Sat, Aug 24 2024 1:34 PM

Team of Indian Women Wrestlers stood at the top

185 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన భారత మహిళా రెజ్లర్ల బృందం

పసిడి పతకం నెగ్గిన కాజల్‌

శ్రుతిక ఖాతాలో రజతం

రాజ్‌బాలా, ముస్కాన్‌లకు కాంస్యం  

అమ్మాన్‌ (జోర్డాన్‌): ప్రపంచ అండర్‌–17 రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో భారత మహిళల జట్టు ఫ్రీస్టయిల్‌ విభాగంలో తొలిసారి ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శుక్రవారం భారత్‌ ఖాతాలో ఒక స్వర్ణం, ఒక  రజతం, రెండు కాంస్య పతకాలు చేరాయి. 69 కేజీల విభాగం ఫైనల్లో కాజల్‌ 9–2తో ఒలెక్సాండ్రా రిబాక్‌ (ఉక్రెయిన్‌)పై గెలిచి బంగారు పతకం సాధించింది. 

46 కేజీల విభాగం ఫైనల్లో శ్రుతిక శివాజీ పాటిల్‌ 0–13తో యు కత్సుమె (జపాన్‌) చేతిలో ఓడిపోయి రజతం దక్కించుకుంది. 40 కేజీల విభాగం కాంస్య పతక బౌట్‌లో రాజ్‌బాలా 11–5తో మొనాకా ఉమెకావా (జపాన్‌)పై, 53 కేజీల విభాగం కాంస్య పతక బౌట్‌లో ముస్కాన్‌ 12–2తో ఇసాబెల్లా గొంజాలెస్‌ (అమెరికా)పై విజయం సాధించారు. 61 కేజీల విభాగం కాంస్య పతక బౌట్‌లో రజి్నత 2–6తో హినై హర్బనోవా (అజర్‌బైజాన్‌) చేతిలో ఓడిపోయి నాలుగో స్థానంలో నిలిచింది.  

మహిళల ఫ్రీస్టయిల్‌ విభాగంలో మొత్తం 10 వెయిట్‌ కేటగిరీల్లో పోటీలు జరగ్గా... తొమ్మిది కేటగిరీల్లో భారత రెజ్లర్లు పోటీపడ్డారు. ఐదు స్వర్ణాలు (25 పాయింట్ల చొప్పున), ఒక రజతం (20 పాయింట్లు), రెండు కాంస్యాలు (15 పాయింట్ల చొప్పున) సొంతం చేసుకున్నారు. మరో కేటగిరీలో నాలుగో స్థానం (10 పాయింట్లు) లభించింది. ఓవరాల్‌గా 185 పాయింట్లతో భారత్‌ టాప్‌ ర్యాంక్‌ను దక్కించుకుంది. 146 పాయింట్లతో జపాన్‌ రన్నరప్‌గా నిలువగా... 79 పాయింట్లతో కజకిస్తాన్‌ మూడో స్థానం పొందింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement