T20I: స్ట్రైక్‌రేటు ఏకంగా 600..? అంతలోనే.. | Is Teja Nidamanuru 1st Batter To Be Out With Strike Rate Of 600 In T20I? | Sakshi
Sakshi News home page

స్ట్రైక్‌రేటు ఏకంగా 600.. అంతర్జాతీయ టీ20లలో ఇదే తొలిసారి?

Published Thu, Feb 29 2024 2:01 PM | Last Updated on Thu, Feb 29 2024 2:41 PM

Is Teja Nidamanuru 1st Batter To Be Out With Strike Rate Of 600 In T20I - Sakshi

నమీబియాతో టీ20 మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ బ్యాటర్‌, తెలుగు మూలాలున్న తేజ నిడమనూరు చేసిన పరుగులు కనీసం 20 పరుగుల మార్కు కూడా అందుకోలేదు. అయినా.. అతడి పేరు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఎందుకంటే...?!

నేపాల్‌- నమీబియా- నెదర్లాండ్స్‌ మధ్య నేపాల్‌ వేదికగా టీ20 ట్రై సిరీస్‌ జరుగుతోంది. ఇందులో భాగంగా నమీబియా- నెదర్లాండ్స్‌ కీర్తిపూర్‌ వేదికగా గురువారం తలపడుతున్నాయి.

ఇందులో టాస్‌ గెలిచిన నెదర్లాండ్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్‌ మైకేల్‌ లెవిట్‌ మెరుపు శతకం(62 బంతుల్లో 135 రన్స్‌) బాదగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ సైబ్రండ్‌ ఎంగెల్బ్రెట్‌ సూపర్‌ హాఫ్‌ సెంచరీ(40 బంతుల్లో 75 పరుగులు) చేశాడు.

చిచ్చరపిడుగు పరుగుల విధ్వంసం
ఈ క్రమంలో లెవిట్‌ స్ట్రైక్‌రేటు 217.74గా నమోదు కాగా.. సైబ్రండ్‌ స్ట్రైక్‌రేటు 187.50. మరి తేజ నిడమనూరు స్ట్రైక్‌రేటు ఎంతో తెలుసా?!.. సరిగ్గా 600. నిజమే.. నమీబియాతో మ్యాచ్‌లో మూడు బంతులు ఎదుర్కొన్న అతడు మూడు సిక్సర్ల సాయంతో 18 పరుగులు చేశాడు.

నెట్టింట చర్చ
ఈ నేపథ్యంలో అంతర్జాతీయ టీ20లలో 600 స్ట్రైక్‌రేటు వద్ద ఉండగా అవుటైన మొదటి బ్యాటర్‌ తేజ నిడమనూరేనా అంటూ ఓ నెటిజన్‌ చర్చకు దారితీశారు. ఇందుకు స్పందనగా మిగతా యూజర్లు తమకు తోచిన సమాధానం ఇస్తున్నారు.

ఈ సందర్భంగా వన్డేల్లో ఆండీ మెక్‌బ్రైన్‌ అనే క్రికెటర్‌ ఒక బంతి ఎదుర్కొని సిక్సర్‌ కొట్టాడని ఓ నెటిజన్‌ ప్రస్తావించారు. మొత్తానికి అలా తేజ స్ట్రైక్‌రేటు గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. 

సాధారణంగా ఓ బ్యాటర్‌ మ్యాచ్‌లో మొత్తంగా చేసిన పరుగులను వందతో గుణించి, అతడు ఎదుర్కొన్న బంతులతో భాగించి స్ట్రైక్‌రేటును నిర్ణయిస్తారు. అలా తేజ స్ట్రైక్‌రేటు 600 అయింది. అదీ సంగతి!!

భారీ స్కోరుతో సత్తా చాటి
ఇదిలా ఉంటే నమీబియాతో మ్యాచ్‌లో లెవిట్‌, సైబ్రండ్‌ కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 178 పరుగులు జోడించడం విశేషం. నెదర్లాండ్స్‌ తరఫున అంతర్జాతీయ టీ20లలో ఇదే అత్యధిక భాగస్వామ్యం. వీరిద్దరి సునామీ ఇన్నింగ్స్‌ కారణంగా నెదర్లాండ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఏకంగా 247 పరుగులు చేసింది. మరోవైపు.. తేజ దురదృష్టవశాత్తూ రనౌట్‌గా వెనుదిరిగాడు. 

కాగా 1994లో విజయవాడలో జన్మించిన తేజ నిడమనూరు 2022లో నెదర్లాండ్స్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 30 వన్డేలు, 8 టీ20లు ఆడి వరుసగా 679, 79 పరుగులు చేశాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement