భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఇంగ్లండ్‌లోని ఓవల్ మైదానం వేదిక కానున్న సంగతి తెలిసిందే. జూన్ 7న ఇరు జట్ల మధ్య ఈ మెగా ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఓవల్ స్టేడియం గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఇంగ్లండ్‌లో అత్యంత ప్రసిద్ధ అంతర్జాతీయ క్రికెట్ మైదానాలలో ఓవల్ ఒకటి.
1845లో ఈ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించారు. ఈ స్టేడియం కెపాసీటీ 27,500. ఇంగ్లండ్‌లో అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చిన తొలి మైదానం కూడా ఓవలే కావడం గమనార్హం. 1880 సెప్టెంబరులో ఈ స్టేడియంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. అదే విధంగా ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ సీజన్ చివరి మ్యాచ్ కూడా అనవాయితీగా ఇదే మైదానంలో జరుగుతుంది.
ఇక ఇదే స్టేడియంలో 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇక క్రికెట్ మాత్రమే కాకుండా ఫిపా ప్రపంచకప్ ఫైనల్‌కు కూడా ఓవల్ ఆతిథ్యం ఇచ్చింది. హాకీ, రగ్బీ వంటి ఇతర క్రీడలకు సంబంధించిన మ్యాచ్‌లు కూడా ఈ స్టేడియంలో జరిగాయి. ఇది సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్‌కు హోం గ్రౌండ్.
యాషెస్ పుట్టుకకు కారణం.. 1882లో ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియాకు ఇది తొలి విజయం. అయితే ఇంగ్లండ్ ఓటమిని ఆ దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌లోని ప్రతీ వార్తాపత్రిక ఇంగ్లండ్ టీంను దారుణంగా విమర్శిస్తూ వ్యాసాలు ప్రచురించాయి.
“ఇంగ్లీష్ క్రికెట్ చనిపోయింది. 29 ఆగస్టు 1882, ఓవల్‌లో ఇంగ్లండ్ టీం అంత్యక్రియల తర్వాత వచ్చిన బూడిదను (యాషెస్) ఆస్ట్రేలియా తీసుకెళ్లింది" అంటూ స్పోర్టింగ్ టైమ్స్ రాసుకొచ్చింది. ఈ తరువాత ఏడాది ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు, ఆంగ్ల మీడియా ‘యాషెస్‌ను తిరిగి తీసుకరావాలంటూ’ వార్తలు ప్రచురించాయి. ఆతర్వాత ఈ రెండు దేశాల మధ్య జరిగే టెస్టు సిరీస్‌కు యాషెస్ అని పేరు పెట్టారు.
ఓవల్ టెస్టు రికార్డులు ఎలా ఉన్నాయంటే?
అత్యధిక స్కోర్: 1938లో ఆస్ట్రేలియాతో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఏకంగా 7 వికెట్ల నష్టానికి 903 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ లియోనార్డ్ హట్టన్ 364 పరుగులతో చెలరేగాడు. ఇప్పటివరకు ఓవల్ ఇదే అత్యధిక స్కోర్. అత్యల్ప స్కోర్: ఈ వేదికపై 1896లో ఆస్ట్రేలియా అత్యల్ప జట్టు స్కోరు చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కంగరూ జట్టు కేవలం 44 పరుగులకే ఆలౌటైంది.
అత్యధిక పరుగులు: ఓవల్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇంగ్లండ్ దిగ్గజం లియోనార్డ్ హట్టన్ పేరిట ఉంది. ది ఓవల్‌లో అతడు 1,521 పరుగులు చేశాడు. ఈ మైదానంలో అతడు నాలుగు సెంచరీలు, ఐదు అర్ధసెంచరీలు చేశాడు.
అత్యధిక వికెట్లు: ఈ మైదానంలో టెస్టుల్లో ఇంగ్లండ్ దిగ్గజ ఆల్ రౌండర్ ఇయాన్ బోథమ్ అత్యధిక వికెట్లు పడగొట్టాడు. అతడు 11 మ్యాచ్‌లలో 26.51 సగటుతో మరియు 3.61 ఎకానమీతో 52 టెస్ట్ వికెట్లు తీశాడు.
అత్యధిక వ్యక్తిగత స్కోరు: ఈ మైదానంలో అత్యధిక వ్యక్తిస్కోర్ సాధించిన రికార్డు ఇంగ్లండ్ దిగ్గజం లియోనార్డ్ హట్టన్ పేరిటే ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో లియోనార్డ్ హట్టన్ 364 చేశాడు.
ఓవల్‌లో భారత రికార్డు ఎలా ఉందంటే?
భారత జట్టు 1936 నుండి ఓవల్‌లో ఆడుతోంది. అయితే ఈ వేదికపై మొదటి విజయాన్ని సాధించేందుకు భారత్‌కు 35 ఏళ్లు పట్టింది. 1971లో అజిత్ వాడేకర్ సారథ్యంలో ఇంగ్లండ్‌పై తొలి విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకూ ఈ వేదికపై 14 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన భారత్.. కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది. ఐదు మ్యాచుల్లో ఓటమి పాలవ్వగా.. ఏడు డ్రాగా ముగిశాయి.
చదవండి: WTC Final 2023: రంగు రంగుల రబ్బరు బంతులతో టీమిండియా ప్రాక్టీస్.. రియాక్షన్ బాల్స్ అంటే ఏంటి?
Comments
Please login to add a commentAdd a comment