![There Is No shame in losing to 5 Time Champions: Gavaskar Praises Team India - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/20/There-Is-No-shame-in-losing-to-5-Time-Champions.jpg3_.jpg.webp?itok=2yOztTaw)
వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో ఓడిన రోహిత్ సేనకు టీమిండియా క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ అండగా నిలిచాడు. ఇప్పటికే ఐదుసార్లు చాంపియన్ అయిన జట్టు చేతిలో ఓడిపోయినందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదన్నాడు. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో వినోదం పంచడం గొప్ప విషయమంటూ బాసటగా నిలిచాడు.
కాగా సొంతగడ్డపై లీగ్ దశలో తొమ్మిదికి తొమ్మిది మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా.. సెమీస్‌లో న్యూజిలాండ్ రూపంలో ఎదురైన గండాన్ని దిగ్విజయంగా దాటింది. ప్రపంచకప్ పదమూడవ ఎడిషన్‌లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచింది.
కానీ తుదిమెట్టుపై ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలై ట్రోఫీని చేజార్చుకుంది. టాస్ ఓడి నామమాత్రపు స్కోరుకు పరిమితమైన రోహిత్ సేన 6 వికెట్ల తేడాతో ఓడి రిక్తహస్తాలతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఈ నేపథ్యంలో భారత్ ఓటమిపై మాజీ కెప్టెన్, కామెంటేటర్ సునిల్ గావస్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈసారి అంతా సజావుగా సాగుతుందని భావిస్తే దురదృష్టవశాత్తూ ఆఖరి నిమిషంలో తారుమారైంది.
ఒక్కోసారి అదృష్టం కూడా కలిసి వస్తేనే అనుకున్నవి సాధ్యపడతాయి. అయినా.. పటిష్ట జట్టు చేతిలో ఓడిపోయిన కారణంగా ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు.
టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆసీస్‌పై టీమిండియా పైచేయి సాధించింది. ఈరోజు వాళ్లు తమదైన శైలిలో రాణించి గెలిచారు. ఐదుసార్లు చాంపియన్ అయిన జట్టుకు ఫైనల్లో ఎలా గెలవాలో కచ్చితంగా తెలిసే ఉంటుంది కదా! ఏదేమైనా టీమిండియా ఇక్కడి దాకా సాగించిన ప్రయాణం మమ్మల్నందరినీ గర్వపడేలా చేసింది.
కోట్లాది మంది ప్రేక్షకులకు మీరు వినోదం పంచారు. గర్వపడేలా చేశారు’’ అంటూ భారత ఆటగాళ్లను గావస్కర్ ప్రశంసించాడు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు సైతం టీమిండియాకు మద్దతుగా ట్వీట్లు చేసిన విషయం విదితమే!! ఇదిలా ఉంటే తాజా విజయంలో ఆస్ట్రేలియా ఆరోసారి చాంపియన్‌గా నిలిచి సత్తా చాటింది.
Comments
Please login to add a commentAdd a comment