కొలొంబో: శ్రీలంక ఆల్‌రౌండర్ తిసార పెరీరా అరుదైన రికార్డును సాధించాడు. ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన తొలి లంక క్రికెటర్‌గా చరిత్ర పుటల్లోకెక్కాడు. శ్రీలంక లిస్ట్ ఏ క్రికెట్‌లో భాగంగా శ్రీలంక ఆర్మీ అండ్ స్పోర్ట్స్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆయన.. ప్రత్యర్ధి బౌలర్ దిల్హన్ కూరే బౌలింగ్‌లో వరుస సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో అతను 13 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ(52 పరుగులు) పూర్తి చేశాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో ఇది రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ కాగా, అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు శ్రీలంక ఆల్‌రౌండర్ కౌసల్య వీరరత్నే పేరిట నమోదై ఉంది.
రంగన క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించిన వీరరత్నే 2005 నవంబర్‌లో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ(18 బంతుల్లో 66) పూర్తిచేశాడు. శ్రీలంక లిస్ట్ ఏ క్రికెట్‌లో ఇదే వేగవంతమైన అర్ధశతకం. వీరరత్నే ఫిఫ్టీలో 2 ఫోర్లు, 8 సిక్సర్లుండగా... అందులో ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు సాధించడం విశేషం. కాగా, తిసార పెరీరా ఈ ఘనతను సాధించడానికి కొద్ది వారాల క్రితమే అంతర్జాతీయ టీ20లో విండీస్ యోధుడు కీరన్ పోలార్డ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాడు.
శ్రీలంకతోనే జరిగిన ఈ మ్యాచ్‌లో లంక బౌలర్ అఖిల ధనుంజయ బౌలింగ్‌లో పోలార్డ్ ఈ ఘనతను సాధించాడు. మొత్తంగా ఈ ఘనత సాధించిన క్రికెటర్ల జాబితాలో తిసార పెరీరా తొమ్మిదో స్థానంలో నిలిచాడు. పెరీరాకు ముందు గ్యారి సోబర్స్(వెస్టిండీస్), రవిశాస్త్రి(భారత్), గిబ్స్(దక్షిణాఫ్రికా), యువరాజ్(భారత్), రాస్ వైట్లీ(ఇంగ్లండ్), హజ్రతుల్లా జజాయ్(ఆఫ్ఘనిస్తాన్), లియో కార్టర్(న్యూజిలాండ్), పోలార్డ్(వెస్టిండీస్) ఉన్నారు.
చదవండి: ముంబై ఇండియన్స్ శిబిరంలో రోహిత్
Comments
Please login to add a commentAdd a comment