IND Vs WI 5th T20I: Tilak Varma Dismisses Nicholas Pooran To Claim His Maiden International Wicket; Video Viral - Sakshi
Sakshi News home page

Ind vs WI: కొరకరాని కొయ్య.. తిలక్‌ వర్మ నుంచి ఇది ఊహించలేదు! వీడియో వైరల్‌

Published Mon, Aug 14 2023 12:29 PM | Last Updated on Mon, Aug 14 2023 1:17 PM

Tilak Varma Bamboozles Pooran To Bag His 1st International Wicket Video - Sakshi

West Indies vs India, 5th T20I: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ ఓడిపోయి ఘోర పరాభవం మూటగట్టుకుంది టీమిండియా. పసికూనలతో పోటీ పడి ఐసీసీ మెగా ఈవెంట్లకు అర్హత సాధించలేక చతికిలపడ్డ విండీస్‌ చేతిలో ఓటమిపాలైంది. అయితే, ఈ పర్యటన ద్వారా యశస్వి జైశ్వాల్‌, తిలక్‌ వర్మ రూపంలో ఇద్దరు యువ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో క్రీడావర్గాల్లో చర్చనీయాంశమయ్యారు.

అరంగేట్రంలో అదరగొట్టి
కేవలం ఐపీఎల్‌కు మాత్రమే తమ ఆట పరిమితం కాదని.. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ సత్తా చాటగలమని నిరూపించారు. అరంగేట్ర మ్యాచ్‌లోనే విలువైన ఇన్నింగ్స్‌ ఆడి సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టారు. టెస్టులో సెంచరీతో యశస్వి మెరవగా.. తిలక్‌ తొలి టీ20లోనే టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

బౌలింగ్‌ కూడా..
ఇక వెస్టిండీస్‌తో నాలుగో టీ20కి ముందు భవిష్యత్తులో వీరిద్దరితో బౌలింగ్‌ కూడా చేయిస్తామంటూ టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ పారస్‌ మాంబ్రే పేర్కొన్న విషయం తెలిసిందే. నైపుణ్యాలకు పదును పెడితే కచ్చితంగా బౌలర్లుగా కూడా రాణించలగరని విశ్వాసం వ్యక్తం చేశాడు.

తొలి వికెట్‌గా బిగ్‌ హిట్టర్‌ 
అందుకు తగ్గట్లుగానే తిలక్‌ వర్మ ఐదో టీ20లో 2 ఓవర్లు బౌలింగ్‌ చేశాడు. 17 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. నికోలస్‌ పూరన్‌ వంటి బిగ్‌ హిట్టర్‌ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. బ్రాండన్‌ కింగ్‌తో మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పి కొరకరాని కొయ్యగా మారిన పూరన్‌ ఆట కట్టించాడు. 35 బంతుల్లో 47 పరుగులతో జోరు మీదున్న అతడిని బోల్తా కొట్టించాడు.

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ 13.2 ఓవర్లో తిలక్‌ సంధించిన బంతిని తప్పుగా అంచనా వేసిన పూరన్‌.. స్విచ్‌ హిట్‌కు యత్నించి స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాకు క్యాచ్‌ ఇచ్చాడు. అయితే, విండీస్‌ రివ్యూకు వెళ్లగా థర్డ్‌ అంపైర్‌ అవుటివ్వడంతో పూరన్‌ పెవిలియన్‌ చేరాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ నికోలస్‌ పూరన్‌ రూపంలో తిలక్‌ వర్మ తన తొలి అంతర్జాతీయ వికెట్‌ దక్కించుకున్నాడు. 

బ్యాట్‌ ఝులిపించి.. బౌలింగ్‌లోనూ
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆతిథ్య కరేబియన్‌ జట్టు 3-2తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక విండీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తిలక్‌ తొలి మూడు టీ20లలో వరుసగా 39,51,49 పరుగులు సాధించాడు. నాలుగో టీ20లో బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. ఇక ఆఖరిదైన ఐదో టీ20లో ఈ హైదరాబాదీ 27 పరుగులు చేయగలిగాడు.  

చదవండి: ఓవరాక్షన్‌ చేస్తే అలానే ఉంటుంది.. హార్దిక్‌ను ఉతికారేసిన పూరన్‌! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement