Ind vs WI 1st T20: Tilak Varma Smacked Three Sixes On His Debut - Sakshi
Sakshi News home page

IND vs WI: చరిత్ర సృష్టించిన తిలక్‌ వర్మ.. తొలి భారత ఆటగాడిగా!

Published Fri, Aug 4 2023 1:07 PM | Last Updated on Fri, Aug 4 2023 1:36 PM

Tilak Varma smacked three sixes in his innings in debut - Sakshi

టీమిండియా యువ ఆటగాడు తిలక్‌ వర్మ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. ట్రినిడాడ్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన తిలక్‌.. తన ప్రదర్శనతో అందరిని అకట్టుకున్నాడు. తన కెరీర్‌లో ఎదుర్కొన్న తొలి మూడు బంతుల్లోనే 2 సిక్సర్లు బాదాడు. ఓవరాల్‌గా 22 బంతులు ఆడిన తిలక్ వర్మ 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

అదే విధంగా ఫీల్డింగ్‌లో కూడా రెండు అద్భుతమైన క్యాచ్‌లతో వర్మ మెరిశాడు. ఇక తొలి మ్యాచ్‌లో సంచలన బ్యాటింగ్‌ చేసిన తిలక్.. ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించకున్నాడు. విదేశీ గడ్డపై టీ20 అరంగేట్ర మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారత ఆటగాడిగా రాహుల్‌ ద్రవిడ్‌, మురళీ విజయ్‌తో కలిసి సంయుక్తంగా తిలక్‌ నిలిచాడు.

అంతకుముందు మురళీ విజయ్‌ 2010 లో తన డెబ్యూ మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్‌పై 3 సిక్స్‌లు బాదగా.. 2011లో రాహుల్‌ ద్రవిడ్‌ కూడా తన అరంగేట్ర మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 3 సిక్స్‌లు కొట్టాడు. ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత తిలక్‌ వర్మ ఈ అరుదైన ఫీట్‌ సాధించాడు. అదే విధంగా ఈ మ్యాచ్‌లో తిలక్‌ మరో అరుదైన రికార్డును కూడా సాధించాడు. టీ20ల్లో అరంగేట్ర మ్యాచ్‌లో అత్యధిక స్ట్రైక్‌రేట్‌తో 30కు పైగా పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా వర్మ చరిత్ర సృష్టించాడు. తిలక్‌ 177.27 స్ట్రైక్‌రేట్‌తో 39 పరుగులు చేశాడు.

ఇ​క మ్యాచ్‌ విషయానికి వస్తే.. విండీస్‌ చేతిలో 4 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 149 పరుగులు చేసింది. నికోలస్ పూరన్(41), రోవ్‌మన్ పోవెల్(48) రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ రెండేసి వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.

అనంతరం 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ త్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులే చేసి ఓటమిపాలైంది. తిలక్ వర్మ(22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39) మినహా అంతా విఫలమయ్యారు. విండీస్‌ బౌలర్లు జాసన్ హోల్డర్, రోమారియో షెఫర్డ్, ఒబెడ్ మెక్‌కాయ్ రెండేసి వికెట్లు తీయగా.. అకీల్ హోస్సెన్ ఓ వికెట్ పడగొట్టాడు.
చదవండి: చాలా సంతోషంగా ఉంది.. టీమిండియాను చూశాక తప్పుచేశా అనుకున్నా! కానీ: విండీస్‌ కెప్టెన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement