బిగ్‌బాస్‌పై ఐపీఎల్‌ ఎఫెక్ట్‌! | The Time Of Entertainment Fever Makes Success Fear | Sakshi
Sakshi News home page

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫీవర్‌.. సక్సెస్‌ ఫియర్‌

Published Mon, Sep 7 2020 2:00 PM | Last Updated on Sat, Sep 19 2020 3:27 PM

The Time Of Entertainment Fever Makes Success Fear - Sakshi

(వెబ్‌ స్పెషల్‌): కరోనా వైరస్‌.. ఇప్పటికీ ప్రజల్ని వెంటాడుతూనే ఉంది. మొత్తం ప్రపంచాన్ని సుదీర్ఘకాలం స్తంభింపజేసిన ఈ వైరస్‌తో సహజీవనం చేయాల్సిన పరిస్థితులే ఇప్పుడు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటివరకూ నిలిచిపోయిన ఒక్కొక్కటి గాడిన పడుతున్నాయి. అదే సమయంలో ఎంటర్‌మైన్‌ ఫీవర్‌ కూడా వచ్చేసింది. భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) నిర్వహించే ఐపీఎల్‌తో పాటు తెలుగు ప్రేక్షక్షుల్ని అలరించడానికి బిగ్‌బాస్‌-4 కూడా సిద్ధమైంది.  ఇప్పటికే బిగ్‌బాస్‌ ప్రారంభం​ కాగా, ఐపీఎల్‌ మరో రెండు వారాల్లో ఆరంభం కానుంది. బిగ్‌బాస్‌ 15 వారాల పాటు వినోదాన్ని పంచడానికి సిద్ధం కాగా, ఐపీఎల్‌ సుమారు రెండు నెలలు పాటు అలరించనుంది. ఈ రెండూ సుదీర్ఘమైన షెడ్యూల్‌లు కావడమే ఆయా యాజమాన్యాలను టెన్షన్‌ పెడుతోంది.(చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్‌లో కరోనా టెన్షన్‌)

రియాల్టీ షో.. రియల్‌ లైవ్‌ షో
ఇందులో ఒకటి పూర్తి బయో సెక్యూర్‌ బబుల్‌ వాతావరణంలో జరుగుతుండగా, మరొకటి ఒకే ఇంటిలో జరుగుతుంది. ‘ఐపీఎల్‌’బయో బబుల్‌లో ఉంచడం అంటే, జట్లను వీలైనంత వరకు బయటి ప్రపంచంతో కలవకుండా విడిగా ఉంచడమే. మరి బిగ్‌బాస్‌ జరిగే తీరు ‘హోమ్‌ క్వారంటైన్‌’కు సరిపోతుందంటే అతిశయోక్తి కాదేమో. కరోనా టెస్టులు చేయించుకుని నెగిటివ్‌గా తేలిన తర్వాత క్వారంటైన్‌లో ఉండి ఆ తర్వాత తిరిగి టెస్టులు చేయించుకుని మళ్లీ కరోనా నెగిటివ్‌ వచ్చిన తర్వాత హౌస్‌మేట్స్‌ అంతా కూడా బిగ్‌బాస్‌ ఇంటిలోకి అడుగుపెట్టారు.  మరొకవైపు ఈ షోకు పని చేసే టెక్నిషియన్స్‌కు కూడా సెపరేట్‌ రూమ్స్‌ ఏర్పాటు చేసి వారిని ఇక్కడే ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. కానీ బిగ్‌బాస్‌కు ఒకటే టెన్షన్‌.. ఈ షో మొత్తం ఏసీ గదుల్లోని జరుగుతుంది. ఈ రియాల్టీ షోను షూట్‌ చేయడం కూడా ఏసీ గదుల నుంచి జరుగుతుంది. అందులో ఏసీ పడకపోయిన వాళ్లు ఎవరున్నా డస్ట్‌ ఎలర్జీ బారిన పడతారు. ఈ క్రమంలోనే ఎవరైనా అనారోగ్యం  బారిన పడితే మాత్రం అది కలవరపాటుకు గురిచేయడం ఖాయం.  ప్రధానంగా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టిన వారు సేఫ్‌ గేమ్‌ ఆడటమే కాదు.. ఆరోగ్యం పరంగా సేఫ్‌ జోన్‌లో ఉండక తప్పదు. బిగ్‌బాస్‌ షోకు కరోనా వైరస్‌ వ్యాపించకుండా ఉండటానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో ఇది రన్‌ కావడానికి ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఇక్కడ బిగ్‌బాస్‌ రియాల్టీ షో అయితే ఐపీఎల్‌ రియల్‌ లైవ్‌ షో.

పొరపాటు చేస్తే ఫట్‌..
ఐపీఎల్‌.. ఇది ఇంట్లో ఉండి ఆడే గేమ్‌ కాదు.. గ్రౌండ్‌లోకి వెళ్లాలి.. ఆడాలి. ఇక్కడ ఎంత బయో సెక్యూర్‌ బబుల్‌ పరిస్థితుల్లో ఆడాల్సి  వచ్చినప్పటికీ ఏ చిన్నపాటు జరిగినా అది మొత్తం ఐపీఎల్‌ షెడ్యూల్‌పైనే పడుతుంది. ఏదైనా జట్టులోని ఆటగాళ్లు కరోనా బారిన పడితే అది మిగతా జట్లపై కూడా ప్రభావ చూపే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ అత్యంత పకడ్భందీగా జరగాల్సి ఉంది. ఇప్పటికే సీఎస్‌కే(చెన్నై సూపర్‌ కింగ్స్‌)లోని పలువురు ఆటగాళ్లతో పాటు పలువురు సిబ్బంది కరోనా సోకి కోలుకోగా, బీసీసీఐ వైద్యబృందంలోని ఒక సభ్యుడికి, ఢిల్లీ క్యాపిటల్స్‌లోని ఫిజియోథెరపిస్ట్‌కు కరోనా వచ్చింది. వీరు ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఇంతవరకూ లీగ్‌ ఆరంభం కాలేదు కాబట్టి ఎవరికి కరోనా వచ్చినా టైమ్‌ ఉంది కదా అని సరిపెట్టుకున్నారు.. ఒకసారి టోర్నీ ఆరంభమైన తర్వాత కరోనా పాజిటివ్‌ కలవర పెడితే మాత్రం హిట్‌ అనుకున్నది కాస్తా ఫట్‌ అవుతుంది.

బయో సెక్యూర్‌ బబుల్‌ అంటే..
బయో సెక్యూర్ బబుల్ మ్యాచ్‌కి ముందు కూడా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించి.. నెగటివ్ అని తేలితేనే ఆటలోకి అనుమతిస్తారు. ఎవరైనా ఈ బయో- సెక్యూర్ బబుల్ దాటి వెలుపలికి వెళ్లినా లేదా బబుల్ రూల్స్ బ్రేక్ చేసినా.. వారిని కనీసం ఐదు రోజులు క్వారంటైన్‌లో ఉంచి రెండు సార్లు కరోనా పరీక్షలు చేసి.. అందులో నెగటివ్ అని తేలితేనే మళ్లీ బబుల్‌లోకి అనుమతిస్తారు. ఇది అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఒకవేళ మ్యాచ్‌కు ముందు కీలక ఆటగాళ్లలో ఏ ఒక్కరికి కరోనా సోకినా ఈ లీగ్‌ కళ తప్పడం ఖాయం. ఇప్పుడే ఇదే టెన్షన్‌ బీసీసీఐను, ఐపీఎల్‌ యాజమాన్యాన్ని వేధిస్తోంది. (చదవండి: రైనాకు ఏదైనా జరగకూడనిది జరిగితే..!)

30 శాతం అభిమానులు? 
ఐపీఎల్‌-2020కి సుమారు 30 శాతం అభిమానుల్ని స్టేడియాలకు అనుమతి ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తెలిపాడు. దీనిపై ఇంకా స్పష్టత లేకపోయినప్పటికీ ప్రేక్షకుల్ని  స్టేడియాన్ని అనుమితి ఇస్తే మాత్రం అది కచ్చింతగా సవాల్‌తో కూడుకున్నదే. యూఏఈలో కరోనా కేసులు సంఖ్య లేకపోయినప్పటికీ ప్రేక్షకుల్ని ఈ సంక్షోభ సమయంలో స్టేడియంలోకి అనుమతించడం అంటే డేంజర్‌ గేమ్‌ ఆడుతున్నట్లే. ఈ సీజన్ ఐపీఎల్ జరిగితే ప్రతీ ఫ్రాంచైజీ 150 కోట్ల రూపాయలు సంపాదించుకోనున్నాయని బీసీసీఐ వర్గాలే తెలియజేశాయి.  ఐపీఎల్‌ యూఏఈకి తరలివెళ్లడంతో ఫ్రాంఛైజీలకు ఖర‍్చుల వ్యయం కాస్త పెరగడం మినహాయించి నష్టపోయిదేమే ఉండదనేది బీసీసీఐ పెద్దల మాటల్లో తెలుస్తోంది. ఇక్కడ ఫ్రాంచైజీలు చేయాల్సిందల్లా తమ ఆటగాళ్లను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పరిస్థితులు మాత్రమే ఉన్నాయి.  ఇక్కడ ఏమాత్రం తేడా వచ్చినా మొదటికే మోసం వస్తుంది.

బిగ్‌బాస్‌పై ఐపీఎల్‌ ప్రభావం
ఇప్పటివరకూ బిగ్‌బాస్‌ తెలుగు రియాల్టీ షోపై ఐపీఎల్‌ ప్రభావం పడలేదు. గత మూడు సీజన్లలో బిగ్‌బాస్‌ తెలుగు షో అనేది ఐపీఎల్‌కు ఎడంగానే ఉంటూ వచ్చింది. కానీ ఈసారి తెలుగు బిగ్‌బాస్‌పై ఐపీఎల్‌ ప్రభావం కచ్చితంగా పడుతుంది. ఈ రెండింటికి పెద్దగా కాల వ్యవధి లేకపోవడమే ఇందుకు కారణం. బిగ్‌బాస్‌-4 సీజన్‌(సెప్టెంబర్‌ 6) ఆదివారం నుంచి ఆరంభం కాగా, ఐపీఎల్‌కు కూడా అధికారిక షెడ్యూల్‌ వచ్చేసింది. ఈ నెల 19వ తేదీ నుంచే ఐపీఎల్‌ షురూ కానుంది. అంటే 13 రోజులే తేడా. ఈ రెండూ ఎంటెర్‌టైన్‌మెంట్‌ షోలు దాదాపు ఒకే సమయంలో జరిగే అవకాశం ఉండటంతో వ్యూయర్‌షిప్‌ పరంగా బిగ్‌బాస్‌కు ఇది దెబ్బగానే చెప్పొచ్చు.  

ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు, రెండో మ్యాచ్‌ రాత్రి 7:30 గంటల నుంచి జరుగుతాయి.  లీగ్‌లో రెండేసి మ్యాచ్‌లు అనేది 10 రోజులే జరుగుతాయి. ఇక్కడ రెండో మ్యాచ్‌తోనే బిగ్‌బాస్‌ షోకు ఇబ్బంది. సాధారణంగా క్రికెట్‌కు ఫ్యాన్స్‌ ఎక్కువ కాబట్టి, బిగ్‌బాస్‌ షో వ్యూయర్‌షిప్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ సీజన్‌ ఐపీఎల్‌-13 సీజన్‌ జరుగుతుందని తెలిసినప్పటికీ బిగ్‌బాస్‌ యాజమాన్యం సాహసించి నిర్ణయం తీసుకుంది. దీనిపై తొలుత తర్జన భర్జనలు పడిన తర్వాతే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఒకవేళ ఐపీఎల్‌ అయిన తర్వాత బిగ్‌బాస్‌ షోను నిర్వహించాలంటే రెండు నెలలు ఆగాల్సి వస్తుందనే కారణంతోనే యాజమాన్యం చివరకు షోను నిర్వహించడానికే ముందడుగు వేసింది. ఒకరోజు అయిన షోను మళ్లీ రిపేట్‌ చేసే అవకాశం ఉండటమే బిగ్‌బాస్‌ ధైర్యం చేసి నిర్ణయం తీసుకోవడానికి కారణం కావొచ్చు. ఏది ఏమైనా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫీవర్‌లో ఇప్పుడు సక్సెస్‌ ఫియర్‌ కూడా మొదలైందనేది ఎవరూ కాదనలేని వాస్తవం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement